breaking news
Nageswara Rao passes away
-
ఎప్పటికీ ఎవర్గ్రీన్
అక్కినేని మృతితో శోకసంద్రంలో రాష్ట్రం గుండెలవిసేలా రోదిస్తున్న అభిమానులు కడసారి చూపునకు తరలివస్తున్న ప్రజలు జనసంద్రమైన అన్నపూర్ణ స్టూడియోస్ సినీ దిగ్గజాలు, రాజకీయ ప్రముఖుల నివాళులు దేశవ్యాప్తంగా సంతాప సందేశాల వెల్లువ నేడు సినీ షూటింగులు, థియేటర్లు బంద్ శాసనమండలి, అసెంబ్లీ సంతాప తీర్మానాలు మధ్యాహ్నం దాకా అన్నపూర్ణ స్టూడియోస్‌లో భౌతికకాయం అనంతరం ఫిల్మ్ చాంబర్ నుంచి అంతిమయాత్ర అన్నపూర్ణ స్టూడియోస్‌లో ప్రభుత్వ లాంఛనాలతో సాయంత్రం అంత్యక్రియలు ఓ.. దేవదా.. బోరున వర్షం.. ఉరుములు.. మెరుపులు.. ఒకటే దగ్గు.. నోట్లోంచి తెరలు తెరలుగా రక్తం.. ‘ఇంకెంత దూరం..’.. ‘ఇంకో కోసెడు ఉంది బాబు..’ ‘అంతవరకు బతుకుతానో లేదో, కోరినంత డబ్బు ఇస్తాను త్వరగా పోనీ’ దుర్గాపురం వచ్చేసింది.. చావిట్లో గడ్డిపై పడిపోయిన ఆయన నోట మాట పెగలటం లేదు.. పార్వతిని చూసేందుకు తపించిన ఆ కన్నులు కాసేపటికే మూతపడ్డాయి.. ఇచ్చిన మాట కోసం ప్రాణాలకు తెగించి పట్నం నుంచి వచ్చిన ఓ దేవదా..! నిన్ను పార్వతి కన్నా అమితంగా ఆరాధిస్తున్న కొన్ని కోట్ల గుండెలు పిలుస్తున్నాయి.. మా కోసం మళ్లీ రావా.. మహా నటశిఖరం నేలకొరిగింది. అఖిలాంధ్ర ప్రేక్షకులను ఏకంగా ఏడు దశాబ్దాలకు పైగా ఆనంద సాగరంలో ఓలలాడించిన సినీ దిగ్గజం ఇక సెలవంటూ జీవిత రంగ స్థలం నుంచి నిష్ర్కమించింది. నటనకే కొత్త భాష్యం చెప్పడమే గాక హుషారైన డ్యాన్సులతో తెలుగు సినిమాకు కొత్త పోకడలు నేర్పిన నటసమ్రాట్ మరి లేరన్న వార్త తెలిసి ఆంధ్ర దేశమంతా ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనైంది. బుధవారం తెల్లవారుజామున అక్కినేని నాగేశ్వరరావు మరణించారన్న విషాద వార్త సూర్యోదయానికి ముందే రాష్ట్రమంతటా దావానలంలా పాకింది. అశేష అభిమానులంతా ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయారు. గుండెలవిసేలా రోదించారు. తమ అభిమాన నటుణ్ని కడసారి కళ్లారా చూసుకునేందుకు తండోపతండాలుగా తరలివస్తున్నారు. అక్కినేని భౌతికకాయాన్ని ఉంచిన హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ అభిమానుల తాకిడితో జనసంద్రంగా మారింది. ఏఎన్నార్ మరణ వార్త తెలిసి తెలుగు సినీ పరిశ్రమ కూడా తల్లడిల్లిపోయింది. తెలుగుతో పాటు దక్షిణాది సినీ పరిశ్రమ దిగ్గజాలు, ప్రముఖ నటీనటులంతా అక్కినేనికి శ్రద్ధాంజలి ఘటించేందుకు బారులు తీరుతున్నారు. దేశం నలుమూలల నుంచీ సంతాప సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు రాజకీయ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, మంత్రులు బుధవారం ఆయన భౌతికకాయాన్ని సందర్శించి కడసారి నివాళులు అర్పించారు. శాసనమండలి, శాసనసభ అక్కినేని మృతికి సంతాపం ప్రకటించాయి. ఏఎన్నార్ మృతికి సంతాప సూచకంగా గురువారం రాష్ట్రవ్యాప్తంగా సినిమా థియేటర్లు మూతబడనున్నాయి. సినీ షూటింగులకు కూడా విరామం ప్రకటించారు. అభిమానుల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని గురువారం ఉదయం 11.30 దాకా అన్నపూర్ణ స్టూడియోస్‌లో, అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు ఫిలిం చాంబర్లో ఉంచుతారు. 12.30 నుంచి అక్కినేని అంతిమయాత్ర మొదలవుతుందని ‘మా’ అధ్యక్షుడు మురళీమోహన్ ప్రకటించారు. ఫిలిం చాంబర్ నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు మీదుగా తిరిగి అన్నపూర్ణ స్టూడియోకు అంతిమయాత్ర చేరుతుందని తెలిపారు. గురువారం సాయంత్రం మూడింటి తర్వాత అక్కినేని పార్ధివ దేహానికి పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో అన్నపూర్ణ స్టూడియోలో అంత్యక్రియలు జరగనున్నాయి. తెలుగు సినీ పరిశ్రమను మకుటం లేని మహారాజుల్లా ఏలిన అగ్రశ్రేణి ద్వయంలో ఎన్టీఆర్ అనంతరం ఇప్పుడు ఏఎన్నార్ కూడా మహాభినిష్ర్కమణం చేసి కళామతల్లికి కడుపుకోత మిగిల్చారు. ఎన్నెన్ని పాత్రలు! ఎంతటి వైవిధ్యం! ఎంతటి నటనా వైదూష్యం! జానపద నాయకుడిగా మురిపించినా, అల్లరి ప్రియుడిగా కొంటె చేష్టలతో అలరించినా, భగ్న ప్రేమికుడిగా భేష్ అన్పించినా, నవలా నాయకునిగా రాణించినా, విషాదమూర్తిగా వైరాగ్యం పండించినా, సాంఘిక పాత్రల్లో సాటిలేని నటన ప్రదర్శించినా, మహా భక్తునిగా తత్వసారాన్ని రంగరించినా, వయసు పైబడ్డాక కుటుంబ పెద్దగా వెండితెరకే నిండుదనం తెచ్చినా ఆయనకే చెల్లింది. పద్మాలు మొదలుకుని ఫిల్మ్ఫేర్లు, దాదాసాహెబ్ ఫాల్కే దాకా అక్కినేనిని వరించినన్ని అవార్డులు, ఆయనకు దక్కినన్ని సన్మానాలు మరే సినీ ప్రముఖుడికీ లభించలేదు. తెలుగు సినీ పరిశ్రమ ఆనాటి మద్రాసు నుంచి హైదరాబాద్ తరలిరావడంలో ఆయనదే కీలక పాత్ర. 1974లోనూ, ఆ తర్వాత మరోసారి 1988లోనూ పెను సవాలు విసిరిన తీవ్రమైన గుండె జబ్బును అంతులేని ఆత్మవిశ్వాసంతో జయించి, ఆపరేషన్ చేసిన డాక్టర్లే ఆశ్చర్యపోయేలా ఆ తర్వాత కూడా దశాబ్దాల పాటు చెక్కుచెదరని ఆరోగ్యంతో జీవించి చూపించిన రియల్ హీరో ఏఎన్నార్. 90 ఏళ్ల వయసులో కూడా తన కుటుంబంలోని మూడు తరాల వారితోనూ కలసి తాజాగా ‘మనం’ అనే సినిమాలో నటించారాయన. కేన్సర్ మహమ్మారి తనను కబళించేందుకు ప్రయత్నిస్తోందని, అభిమానుల ఆశీర్వాద బలంతో దాన్ని కూడా జయిస్తానని ఆ షూటింగ్లో ఉండగానే విలేకరుల సమావేశం నిర్వహించి మరీ ప్రకటించిన అంతులేని ఆత్మబలం అక్కినేని సొంతం. అక్కినేనిని కేర్‌కు చేర్చిన 108 అంబులెన్స్ ఏఎన్నార్‌కు ఇటీవలే కిమ్స్‌లో మలద్వార కేన్సర్ శస్త్రచికిత్స జరగడం తెలిసిందే. అప్పటినుంచీ ఆయన పూర్తిగా ఇంటికే పరిమితమయ్యారు. కోలుకుంటున్నారని అంతా అనుకుంటున్న సమయంలో అధిక విరేచనాలతో ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. బుధవారం తెల్లవారుజామున 1.30 గంటల ప్రాంతంలో ఏఎన్నార్‌కు గుండెపోటు వచ్చింది. ఆయన మనవరాలు సుప్రియ వెంటనే 108 అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. ఆ సమయంలో సరిగ్గా జూబ్లీహిల్స్ చౌరస్తాలోనే ఉన్న అంబులెన్స్ నాలుగు నిమిషాల్లో జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 17లోని అక్కినేని నివాసానికి చేరుకుంది. అంబులెన్స్ సిబ్బంది వడివడిగా ఆక్సిజన్ సిలిండర్‌తో పాటు లోనికి వెళ్లి అక్కినేనికి ప్రథమ చికిత్స చేశారు. కొన ఊపిరితో ఉన్న ఆయనను 10 నిమిషాల్లోనే బంజారాహిల్స్ కేర్ ఆసుపత్రికి తరలించారు. అక్కినేనితో పాటు మనవరాలు సుప్రియ, మనవడు సుమంత్ కూడా అంబులెన్స్‌లోనే ఆస్పత్రికి వెళ్లారు. కన్నీరుమున్నీరైన నాగార్జున బుధవారం తెల్లవారుజాము 1.45 గంటలకు 108 అంబులెన్స్ అక్కినేనిని కేర్ ఆస్పత్రి అత్యవసర విభాగానికి చేర్చింది. డాక్టర్ సోమరాజు నేతృత్వంలోని వైద్య బృందం మొదట ఆయనకు సీపీఆర్, తర్వాత ఈసీజీ తదితర పరీక్షలు నిర్వహించింది. ఇదంతా జరుగుతుండగానే ఆయన పల్స్‌రేటు పడిపోయింది. వైద్యులు ఎంత శ్రమించినా ఫలితం లేకపోయింది. అక్కినేని చనిపోయినట్టు తెల్లవారుజాము 2.45కు వైద్యులు ధ్రువీకరించారు.ఆయన మృతికి గుండెపోటే కారణమని విశ్వసనీయంగా తెలిసింది. అనంతరం ఆయన గుండెకు గతంలో అమర్చిన పేస్‌మేకర్‌ను కూడా తొలగించారు. ఈ సమయంలో ఏఎన్నార్ కుమారుడు నాగార్జున సహా కుటుంబసభ్యులంతా అక్కడే ఉన్నారు. తండ్రి లేడన్న వాస్తవాన్ని జీర్ణించుకోలేక నాగార్జున సహా వారంతా కన్నీరుమున్నీరయ్యారు. తర్వాత మృతదేహాన్ని తెల్లవారుజాము 3 గంటలకు ఆయన నివాసానికి తరలించారు. బుధవారం ఉదయం 9 గంటలకు బంజారాహిల్స్‌లోని అన్నపూర్ణ స్టూడియోకు తరలించారు. తండ్రి పార్ధివ దేహంతో పాటు నాగార్జున కూడా స్టూడియోకు చేరుకున్నారు. సోదరి నాగసుశీల అక్కడకు రావడంతోనే దుఃఖాన్ని ఆపుకోలేక బోరుమని విలపించారు. నాగార్జున రోదన చూసి ఆయన కుమారులు నాగచైతన్య, అఖిల్ కూడా కన్నీరుమున్నీరయ్యారు. నాగార్జునను ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు. అరగంట పాటు ఆయన గుక్కపట్టి ఏడ్చారు. అది చూసి అభిమానులంతా శోకసంద్రంలో మునిగిపోయారు. ఏఎన్నార్ పేస్‌మేకర్‌ను హృద్రోగంతో బాధపడుతున్న ఎవరైనా నిరుపేద కళాకారునికి ఉచితంగా అందజేయవచ్చని సమాచారం. అభిమానులతో కిక్కిరిసిన అన్నపూర్ణ స్టూడియో అక్కినేని మరణవార్త తెలియగానే అభిమానులు తండోపతండాలుగా అన్నపూర్ణ స్టూడియో వద్ద బారులుతీరారు. బుధవారం తెల్లవారుజామున మూడింటి నుంచే అక్కడ క్యూలు కట్టారు. వారి సంఖ్య గంటగంటకూ పెరిగిపోవడంతో స్టూడియో పరిసరాలన్నీ కిటకిటలాడాయి. 70 వేల మందికి పైగా తరలిరావడంతో స్టూడియో ఆవరణంతా అభిమానులతో నిండిపోయింది. ఆ ప్రాంతమంతా ఇసకేస్తే రాలనంతగా కిక్కిరిసింది. ప్రముఖుల రాక మొదలవడంతో రోడ్లకు రెండు వైపులా వాహనాల పార్కింగ్‌లతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. దాంతో పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. బారికేడ్లు ఏర్పాటు చేశారు. స్టూడియో ప్రధాన ద్వారం నుంచి క్యూ ఏర్పాటు చేసి అభిమానులను లోనికి పంపారు. నుంచునేచోటు కూడా లేక చాలామంది చెట్ల పెకైక్కి, అక్కడి నుంచే తమ నటుణ్ని కడసారి చూసుకున్నారు. బుధవారం రాత్రి పొద్దుపోయేదాక కూడా రద్దీ కొనసాగుతూనే ఉంది. సందర్శించిన ప్రముఖులు అక్కినేని పార్ధివ దేహాన్నిపలువురు ప్రముఖులు సందర్శించి నివాళులర్పించారు. ఆయన లోటు తీర్చలేనిదని కొనియాడారు. అక్కినేని భారతీయ చిత్ర పరిశ్రమకే మేరునగమని సినీ ప్రముఖులు అభిప్రాయపడ్డారు. అన్నపూర్ణ స్టూడియోలో అక్కినేని పార్ధివ దేహాన్ని సందర్శించిన వారిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, కేంద్ర మంత్రులు చిరంజీవి, దగ్గుబాటి పురందేశ్వరి, సర్వే సత్యనారాయణ, శాసనమండలి చైర్మన్ కె.చక్రపాణి, స్పీకర్ నాదెండ్ల మనోహర్, మంత్రులు బొత్స సత్యనారాయణ, రఘువీరారెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, టీజీ వెంకటేష్, గీతారెడ్డి, డీకే అరుణ, వట్టి వసంత్‌కుమార్, సి.రామచంద్రయ్య, దానం నాగేందర్, కె.జానారెడ్డి, గల్లా అరుణకుమారి, కాసు కృష్ణారెడ్డి, మాజీ మంత్రులు దేవేందర్‌గౌడ్, షబ్బీర్ అలీ, మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, ఎంపీలు ఉండవల్లి అరుణ్‌కుమార్, టి.సుబ్బిరామిరెడ్డి, లగడపాటి రాజగోపాల్, సీఎం రమేశ్, లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ, రామోజీరావు, ఎమ్మెల్యేలు కేటీఆర్, ఈటెల రాజేందర్, జూపల్లి కృష్ణారావు, మర్రి శశిధర్‌రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు, ఎర్రబెల్లి దయాకర్‌రావు, శంకర్రావు, జూలకంటి రంగారెడ్డి, డి.శ్రీనివాస్, నేదురుమల్లి రాజ్యలక్ష్మి, మ్యాట్రిక్స్ ప్రసాద్ తదితరులున్నారు. సినీ ప్రముఖుల నివాళులు అక్కినేనికి నివాళులర్పించిన సినీ ప్రముఖుల్లో నటుడు కృష్ణ, హీరోలు వెంకటేశ్, బాలకృష్ణ, పవన్‌కల్యాణ్, మహేశ్‌బాబు, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, కైకాల సత్యనారాయణ, గొల్లపూడి మారుతీరావు, కె.రాఘవేంద్రరావు, నిర్మాతలు రామానాయుడు, సురేశ్‌బాబు, వీబీ రాజేంద్రప్రసాద్, కవి సి.నారాయణరెడ్డి, నటి అనుష్క, రోజా, తమిళ నటులు శరత్‌కుమార్, రాధిక దంపతులు, నాగేంద్రబాబు, హరికృష్ణ, జయప్రద, రానా, సాయిధరమ్ తేజ్, అలీ, అల్లు అరవింద్, వేణుమాధవ్, శ్రీకాంత్, ప్రకాష్‌రాజ్, మురళీమోహన్, జయసుధ, వాణిశ్రీ, జమున, రమాప్రభ, గీతాంజలి, మోహన్‌బాబు తదితరులున్నారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు: డీకే అరుణ అక్కినేని మృతి పట్ల సమాచార, పౌరసంబంధాలు, సినిమాటోగ్రఫీ మంత్రి డీకే అరుణ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన అంత్యక్రియల్ని పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నట్టు ప్రకటించారు. - సాక్షి నెట్వర్క్ -
అమరం.. నీ కథ అజరామరం..
శిఖరం ఒరిగింది... అక్కినేని అస్తమించారు... ప్రతి తెలుగువాడికీ శరాఘాతం ఈ మాట. కానీ తప్పదు. గుండెను దిటవు చేసుకోక తప్పదు. ‘కన్నీళ్లకే బతికించే శక్తి ఉంటే.. అవి ఏనాడో కరువైపోయేవి’ అన్నాడు ఆయనే ఓ సినిమాలో. అందుకని వాటిని ఆపగలమా? కట్టలుతెగిన విషాదానికి అడ్డుకట్ట వేయగలమా? ఏడు దశాబ్దాల పాటు తన నటనతో రంజిపంజేసి.. ప్రేక్షకుల్ని రుణగ్రస్తుణ్ణి చేశాడాయన. ఆయన పంచిన ఆనందాన్ని మరిచిపోవడం తేలికైన విషయం కానేకాదు. మనిషి అనేవాడు ఎలా బతకాలో ఆయన పాత్రలు చెప్పాయి. ఎలా బతక్కూడదో ఆయన పాత్రలు చెప్పాయి. సంఘాన్ని సంస్కరించేంత గొప్ప పాత్రలు పోషించిన ఘనత ఆయనది. ఈ వయసులో కూడా మూడు తరాలకు చెందిన తన కుటుంబ సభ్యులతో కలిసి నటించిన నవ యువకుడు అక్కినేని. కుటుంబసభ్యులతో కలిసి ఆయన నటించిన చివరి సినిమా ‘మనం’ త్వరలోనే విడుదల కానుంది. దటీజ్ అక్కినేని... ఎన్నెన్ని ప్రేమ కావ్యాలు, ఎన్నెన్ని కుటుంబ గాధలు, ఎన్నెన్ని ఆధ్యాత్మికానందాలు, ఎన్నెన్ని పురాణపాత్రలు.. ఒకానొక దశలో తెరపై మానవ బంధాలన్నింటిలో అక్కినేనినే చూసుకుంది ప్రేక్షకలోకం. ప్రేమికుడంటే అక్కినేని. కొడుకంటే అక్కినేని. భర్త, అన్న, తమ్ముడు, మరిది, తండ్రి, తాత.. ఇలా అన్ని బంధాల్లో అక్కినేనినే చూసుకున్నారు. తెలుగుతెరపై అజరామరమైన సాంఘిక, పౌరాణిక, జానపద, చారిత్రక పాత్రలతో రంజింపజేసి ‘నటసామ్రాట్’ బిరుదుని సార్థకం చేసుకున్నారాయన... పట్టుదలకు పర్యాయపదం అక్కినేని... కార్యదీక్షను ఇంటిపేరుగా మార్చుకున్న నిత్య కృషీవలుడు అక్కినేని.. నిరంతరం నటననే శ్వాసించిన అభినయ నటరాజు అక్కినేని... చెన్నపట్టణంలో వేళ్లూనుకుపోయిన.. మన సినిమాను తెలుగునేలకు తరలించిన అభినవ భగీరథుడు అక్కినేని... 82 ఏళ్ల తెలుగు సినిమాతో.. 72ఏళ్ల పాటు ప్రయాణించి తెలుగు సినీ సహోదరుడు అక్కినేని... అక్కినేని జీవన ప్రస్థానంలో ఎన్నో మలుపులు. ఎన్నో ఒడిదుడుకులు. హీరోగా నిలదొక్కుకోడానికి ఆయన చేసిన సాహసాలు ఎన్నో. విమర్శించిన వారితోనే పొగిడించుకున్న దీక్షాదక్షుడు అక్కినేని అక్కినేని బాల్యం కృష్ణాజిల్లా గుడివాడ తాలూకాలోని వెంకటరాఘవపురంలో (ప్రస్తుతం రామాపూరం) 1924 సెప్టెంబర్ 20న పున్నమ్మ, వెంకటరత్నం దంపతులకు జన్మించారు అక్కినేని నాగేశ్వరరావు. నిజానికి అక్కినేని కుటుంబంలో కళాకారులు లేరు. కళ అనేది దైవదత్తంగా ఆయనకు అబ్బింది. చిన్నతనం నుంచే నాటకల్లో వేషాలు వేసేవారాయన. అక్కినేని ధరించిన తొలి పాత్ర ‘నారదుడు’. వెంకటరాఘవపురంలో పిల్లలందరూ కలిసి వేసిన ‘సత్యహరిశ్చంద్ర’ నాటకంలో పట్టుబట్టి అక్కినేనితో నారద పాత్రను వేయించారు. కారణం ఆ ఊళ్లో ఆయన మంచి పాటగాడు కావడమే. ఆ తర్వాత ఏఎన్నార్ నటించిన పాత్ర చంద్రమంతి. తర్వాత ‘కనకతార’ అనే నాటకంలో తారగా నటించారు. అప్పట్నుంచీ నాటకాల్లో స్త్రీ వేషాలు విరివిగా రావడం మొదలయ్యాయి. ‘సత్యహరిశ్చంద్ర’ నాటకంలో మాతంగకన్య, ‘భక్తకుచేల’ నాటకంలో మోహిని, ‘సారంగధర’ నాటకంలో చెలికత్తె పాత్ర ఇలా ఖాళీ లేకుండా నాటకాలు వేస్తూ ఉండేవారు. రంగస్థల కళాకారునిగా అక్కినేని తొలి పారితోషికం అర్థరూపాయి. ఆ స్థాయి నుంచి అయిదొందలు తీసుకునే స్థాయికి ఎదిగారు. అమ్మ, అన్న ప్రోత్సాహం వల్లే రంగస్థలంపై రాణించగలిగానని చెబుతూ ఉండేవారు అక్కినేని. అప్పట్లో అక్కినేని కుటుంబానికి ఓ పాతిక ఎకరాలు పొలం ఉండేది. అందుకే ఆయన్ను అందరూ చిన్నదొర అంటుండేవారు. కలిగిన కుటుంబంలో పుట్టినా... డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండేవారాయన. ప్రతి ఏడాదీ కుప్పనూర్పిళ్ల సమయంలో... పొలంలో కష్టపడితే ఓ పావలా వచ్చేది. ఆ డబ్బుతో దాపుడు చొక్కా కొనుక్కునేవారు. భజనల్లో గెంతడాలు, కోలాటాలు ఆయనకు చాలా ఇష్టం. ఆ విధంగా చిన్నతనం నుంచే అక్కినేనికి తాళజ్ఞానం అలవడింది. ఇప్పుడు నడుస్తున్న డాన్స్‌ల ట్రెండ్‌కి బీజం అక్కడ పడిందనమాట. విఫలమైన తొలి సినీ అవకాశం 1940లో వచ్చిన ‘ధర్మపత్ని’ అక్కినేని తొలి సినిమా అని అందరికీ తెలిసిందే. కానీ నిజానికి ఆ సినిమాకంటే ముందే అక్కినేనికి సినీ అవకాశం వచ్చింది. ఆ సినిమా పేరు ‘తల్లిప్రేమ’. జ్యోతి సిన్హా దర్శకుడు. కథ రిత్యా అందులో ఓ పధ్నాలుగేళ్ల కుర్రాడి పాత్ర ఉంది. దానికి అక్కినేనిని ఎంపిక చేసి మద్రాసు తీసుకెళ్లారు ప్రముఖ నిర్మాత కడారు నాగభూషణం. షూటింగ్ జరుగుతోంది. కానీ ఆయన పాత్ర మాత్రం రావడం లేదు. అలా నాలుగు నెలలు అక్కడే ఉన్నారు అక్కినేని. తన పాత్ర ఎప్పుడొస్తుందో అని ఆయన ఎదురు చూస్తున్న సమయంలో... కథలో లెంగ్త్ ఎక్కువ అవ్వడం వల్ల ఆ పాత్రను తీసేశామని బాంబు పేల్చారు. నాలుగు నెలలు అక్కడే ఉన్నందుకు వంద రూపాయలు ఇచ్చి అక్కినేనిని పంపించారు. కానీ ఆయన వెంకటరాఘవపురానికి నిరాశతో రాలేదు. సీఎస్ఆర్ ఆంజనేయశాస్త్రి, కన్నాంబ లాంటి మేటి నటుల్ని చూశానని ఆనందంతో ఆయన వెనుదిరిగారు. ‘దేవదాసు’ నిర్మాత డీఎల్ నారాయణను అక్కినేని తొలిసారి కలిసింది అప్పుడే. ఆ టైమ్‌లో డీఎల్ ప్రొడక్షన్ మేనేజర్. ఉత్తరకాలంలో అక్కినేని హీరో అవుతారని, ఆయనతో డీఎల్ ‘దేవదాసు’ లాంటి అజరామర ప్రేమ కావ్యాన్ని తీస్తారనేది కాలానికి మాత్రమే తెలిసిన భవిష్యవాణి. తొలిసినిమా ‘ధర్మపత్ని’ పి.పుల్లయ్య దర్శకత్వంలో ‘ధర్మపత్ని’ సినిమా షూటింగ్ కొల్హాపూరులో మొదలైంది. అందులోని ఓ పిల్లాడి వేషం కోసం అక్కినేని తీసుకున్నారు. అయితే... అప్పటికే ఆయన వయసు 16 ఏళ్లు. దాంతో... ఆ వేషానికి పెద్దవాడైపోయాడనే ఉద్దేశంతో అక్కినేనికి గుంపులో గోవింద లాంటి వేషం ఇచ్చారు పుల్లయ్య. ఆ సినిమాలోని పిల్లలపై తీసిన ఓ పాటలో అక్కినేని కనిపిస్తారు. అందులో అక్కినేనికి ఒక్క డైలాగు లేకపోయినా... తొలిసారి తెరపై కనిపించారు. సో... ఆ విధంగా చూసుకుంటే అక్కినేని తొలి సినిమా ధర్మపత్నే. నట ప్రస్థానం... ముగ్గురు మరాఠీలు(1946) మాయాలోకం(1945) చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్న అక్కినేనికి ‘బాలరాజు’(1948) చిత్రం స్టార్‌ని చేసింది. ఆ వెంటనే వచ్చిన మరో జానపదం ‘కీలుగుర్రం’(1949) ఆయన్ను నంబర్‌వన్‌ని చేసింది. దేవదాసు(1953), అనార్కలి(1955), బాటసారి(1961), మూగమనసులు(1964), మనసేమందిరం,(1966), ప్రేమనగర్(1971), దేవదాసు పళ్లీపుట్టాడు(1978), ప్రేమాభిషేకం(1981), ప్రేమమందిరం(1981), అమరజీవి(1983)... ఇలా చెప్పుకుంటూ పోతే... ఎన్నో ప్రేమకథలు. దక్షిణాదిన ఇన్ని ప్రేమకథల్లో నటించిన హీరో మరొకరు లేరు. అందులోనూ పాత్ర పాత్రకూ వ్యత్యాసం. అక్కినేని భక్తునిగా పేరుతెచ్చిన చిత్రాలు విప్రనారాయణ(1954), భక్తజయదేవ(1961), భక్తతుకారం(1973), మహాకవి క్షేత్రయ్య(1976), చక్రధారి(1977), శ్రీరామదాసు(2006). ఇక అక్కినేని నటించిన సాంఘిక చిత్రాల గురించి చెప్పడమంటే సాహసమే! -
అన్నపూర్ణ స్టూడియోలో అక్కినేని పార్థివదేహం
అభిమానుల సందర్శనార్థం అక్కినేని పార్థివదేహాన్ని అన్నపూర్ణ స్డూడియోకు తరలించారు. ఆయనకు సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. అక్కినేని నాగేశ్వరరావు బుధవారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో తుది శ్వాస విడిచారు. ఏఎన్ఆర్ మరణించిన సమయంలో ఆయన కుమారుడు ప్రముఖ సినీ హీరో అక్కినేని నాగార్జున చెంతనే ఉన్నారు. గత కొంతకాలంగా కేన్సర్ వ్యాధితో బాధపడుతూ చికిత్స పొందుతున్న నాగేశ్వరరావును మంగళవారం అర్ధరాత్రి కేర్ ఆస్పత్రికి తరలించారు. ఏడు దశాబ్దాలకుపైగా అశేష తెలుగుప్రజలను అలరించిన అక్కినేని శాశ్వత వీడ్కోలు తీసుకుని తిరిగిరాని లోకాలకు పోయారు. అభిమానుల కోసం ఆయన భౌతికకాయాన్ని అన్నపూర్ణ స్డూడియోలో ఉంచనున్నట్టు నాగార్జున తెలిపారు. నాగేశ్వరరావుకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. ఏఎన్ఆర్గా తెలుగుప్రజలకు సుపరిచితులైన నాగేశ్వరావు 1923 సెప్టెంబర్ 20న కృష్ణా జిల్లా వెంకటరాఘవ పురంలో వెంకటరత్నం, పున్నమ్మ దంపతులకు జన్మించారు. 1944న సినీ రంగ ప్రవేశం చేశారు. ఏఎన్ఆర్ మొదటి చిత్రం ధర్మపత్ని. తాజా చిత్రం మనంతో కలిపి ఇప్పటి వరకు 256 చిత్రాల్లో నటించారు. పద్మవిభూషణ్, 1988లో పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. పద్మశ్రీ, రఘుపతి వెంకయ్య అవార్డు, దాదాసాహెబ్ ఫాల్కె, ఎన్జీఆర్ జాతీయ అవార్డులను స్వీకరించారు. నవరాత్రి సినిమాలో 9 పాత్రలు చేసిన ఏకైక తెలుగు నటుడు అక్కినేని కావడం విశేషం. తెలుగులో డబుల్ రోల్ పోషించిన మొట్టమొదటి నటుడు కూడా నాగేశ్వరరావే. -
నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు అస్తమయం
సినీ వినీలాకాశంలో 72 ఏళ్లుగా దేదీప్యమానంగా వెలుగొందిన నిండు చందురుడు నేలరాలాడు. తెలుగు సినీమతల్లికి భరించలేని గుండెకోతను మిగిల్చాడు. నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు (90) ఇక లేరు. మంగళవారం అర్ధరాత్రి దాటాక, బుధవారం తెల్లవారుజాము 2.45 గంటలకు హైదరాబాద్ కేర్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా కేన్సర్‌తో బాధపడుతున్న అక్కినేని తెల్లవారుజాము 1.30కు తీవ్ర అస్వస్థతతో గురి కావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిగా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన పరిస్థితి చాలావరకు విషమించింది. వైద్యులు గంటకు పైగా అన్నిరకాలుగా ప్రయత్నాలు చేసినా లాభం లేకపోయింది. ఆఖరి క్షణాల్లో కుమారుడు, సినీ నటుడు నాగార్జునతో పాటు కుటుంబ సభ్యులంతా ఆయనతోనే ఉన్నారు. అక్కినేని తన సుదీర్ఘ నట జీవితంలో 256 సినిమాల్లో నటించారు. దాదాసాహెబ్ ఫాల్కే నుంచి పద్మవిభూషణ్ దాకా పలు అవార్డులు అందుకున్నారు. తాను కేన్సర్ బారిన పడినట్లుగా గత ఏడాది అక్టోబర్ 19న మీడియా సమావేశం ఏర్పాటు చేసి చెప్పారు అక్కినేని. సినీ జీవితంలో కానీ, నిజ జీవితంలో కానీ ఆయన అందకున్న ఎన్నో రికార్డుల మాదిరిగానే ఆ ప్రెస్‌మీట్ కూడా ఓ రికార్డ్. తనకు కేన్సర్ సోకినట్లు ప్రెస్‌మీట్ పెట్టి మరీ చెప్పిన ప్రముఖుడు దేశ చరిత్రలో ఎవరూ లేరు. ఆయన కేన్సర్‌ని జయించాలని, నిండు నూరేళ్లూ వర్ధిల్లాలని తెలుగు నేల ఆశించింది, ఆశీర్వదించింది. కానీ ‘ఆగదు ఏ నిముషము నీ కోసమూ.. ఆగితే సాగదు ఈ లోకము’ అన్నట్లుగా ఆ క్షణం రానే వచ్చింది. ఆత్మబలంతో ఎన్నో ఒడిదుడుకులను అధిగమించి నిలబడ్డ 90 ఏళ్ల అక్కినేనిని మృత్యువు తన ఒడిలోకి తీసుకుంది. అయితే అక్కినేని ఆత్మస్థైర్యాన్ని చూసి విధి సైతం తల వంచాల్సిందే. ఆ మనోనిబ్బరం, ఆత్మస్థైర్యం అందరికీ స్పూర్తిదాయకమే. ఆ స్ఫూర్తిలో అక్కినేని ఆచంద్రతారార్కమూ బతికే ఉంటారు. సామాన్యుడి నుంచి అసామాన్యుడిగా ఎదిగిన అక్కినేని జీవితం భావితరాలకు ఓ పాఠ్యాంశం.