లైంగిక వేధింపులపై స్పందించిన ఐశ్వర్యరాయ్‌

Aishwarya Rai Bachchan Responds On Sexual Harassment - Sakshi

సాక్షి, ముంబై : హాలీవుడ్‌ సినీ దిగ్గజం హార్వీ వీన్‌స్టీన్‌ బాగోతం బట్టబయలైన అనంతరం పనిప్రదేశాల్లో లైంగిక వేధింపులపై బాహాటంగా మాట్లాడటం వెలుగుచూస్తోంది. మీటూ మూవ్‌మెంట్‌ పేరిట మహిళా సెలబ్రిటీలు తమకు ఎదురైన అనుభవాలను వెల్లడిస్తున్న క్రమంలో మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్‌ బచ్చన్‌ సైతం దీనిపై పెదవివిప్పారు. మీటూ ఉద్యమంతో ప్రపంచవ్యాప్తంగా ప్రజలు తమ అనుభవాలను పంచుకోవడం.. మాట్లాడటం స్వాగతించదగిన పరిణామమని ఐశ్వర్యరాయ్‌ అన్నారు. ఇది ప్రపంచంలో ఏ ఒక్క ప్రాంతానికో పరిమితమైందని తాననుకోవడంలేదన్నారు.

ఓ మహిళ తనకు ఎదురైన అనుభవాల గురించి మాట్లాడటం, పంచుకోవడం దాన్ని ఇతరులు అందిపుచ్చుకోవడం అద్భుతమని వ్యాఖ్యానించారు. ఈ ఆలోచన వాణిజ్యం, సినిమా వంటి ఏ కొన్ని రంగాలకో పరిమితం కాదని.. అన్నివర్గాల వారూ దీనిపై మాట్లాడటం హర్షణీయమన్నారు. హాలీవుడ్‌ నిర్మాత హార్వీ వీన్‌స్టీన్‌ లైంగిక వేధింపుల పర్వం బట్టబయలైన అనంతరం బాధితులు చేపట్టిన మీటూ ఉద్యమానికి అనూహ్య మద్దతు లభించింది. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి ఉదంతాలను ఈ హ్యాష్‌ట్యాగ్‌తో సోషల్‌ మీడియాలో ప్రస్తావిస్తూ అవగాహన పెంచుతున్నారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top