అంత డ్రామా వద్దన్నారు

Actress Nidhi Agarwal Interview About Savyasachi Movie - Sakshi

హైదరాబాద్‌ టు ముంబై వయా బెంగళూరు... నిధి అగర్వాల్‌కి ఈ మూడు రాష్ట్రాలతో అనుబంధం ఉంది. పుట్టింది హైదరాబాద్‌. చదువకున్నది బెంగళూరు. నటిగా కెరీర్‌ స్టార్ట్‌ చేసింది ముంబైలో. ఇప్పుడు ‘సవ్యసాచి’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు.  మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నాగచైతన్య, నిధి జంటగా చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం నవంబర్‌ 2న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిధి అగర్వాల్‌ చెప్పిన విశేషాలు.

► ‘మున్నా మైఖేల్‌’ అనే హిందీ చిత్రం ద్వారా కథానాయికగా హిందీలో పరిచయమయ్యాను. అందులో టైగర్‌ ష్రాఫ్‌కు జోడీగా నటించాను. ఆ సినిమా చూసి చందూ మొండేటి ‘సవ్యసాచి’కి చాన్స్‌ ఇచ్చారు. హీరో నాగచైతన్య సరసన అవకాశం కావటంతో ఎగిరి గంతేశాను. చైతన్య మంచి కో–స్టార్‌. చిన్న చిన్న డిటేల్స్‌ను కూడా దర్శకుణ్ణి అడిగి తెలుసుకుంటాడు. సమంత, చైతూ ఇద్దర్ని చాలాసార్లు కలిశాను. వాళ్లిద్దర్నీ చూస్తున్నప్పుడు చైతూ ఎంత లక్కీయో అనిపించేది. ఇద్దరూ సోల్‌మేట్స్‌. సమంత గ్రేట్‌ అండ్‌ బ్యూటిఫుల్‌.

► ఈ సినిమా కోసం దాదాపు 40 రోజుల పైనే వర్క్‌ చేశాను. సినిమాలో గ్రాఫిక్స్‌ పార్ట్‌ ఎక్కువ. అందుకే ఎక్కువ టైమ్‌ పట్టింది. నాగార్జునగారి ఓల్డ్‌ సాంగ్‌ ‘నిన్ను రోడ్డు మీద చూసినది లగాయితు..’ పాటకు డాన్స్‌ చేస్తున్నప్పుడు చాలా ఎంజాయ్‌ చేశాను. కీరవాణి గారి మ్యూజిక్‌కు ఫిదా అయ్యాను. ఇప్పటివరకు రిలీజైన టీజర్‌ను, ట్రైలర్‌ను కొన్ని వందల సార్లు చూసుకున్నాను. అంత నచ్చాయి.

► నా గురించి చెప్పాలంటే.. మా ఇంట్లో నేను చాలా మొండిదాన్ని. నేను ఏదైనా కోరుకున్నానంటే అది జరిగి తీరాల్సిందే. ఆర్టిస్ట్‌ అవుతానని పేరెంట్స్‌ దగ్గర అమాయకంగా అడిగితే, ‘అంత డ్రామా క్రియేట్‌ చేయకు. నువ్వు ఏది కావాలంటే అదే జరుగుద్ది’ అన్నారు. ‘డోంట్‌ వర్రీ. మేమంతా నీతో ఉంటాం. కెరీర్‌ని సీరియస్‌గా తీసుకో.. అలాగే ఎంజాయ్‌ చెయ్‌’ అని ఎంకరేజ్‌ చేశారు.

► హ్యాపీగా ఉండాలంటే రోజూ శుభ్రంగా పనిచేయాలి. టైమ్‌కు తిని , చక్కగా నిద్రపోవాలి. హైదరాబాద్‌లో ఉన్నన్ని రోజులు పూర్ణ టిఫిన్‌ సెంటర్‌లో ఇడ్లీలు తింటూ (ఎన్నో చెప్పను– నవ్వుతూ), ఐమాక్స్‌లో సినిమాలు చూస్తూ గడిపేస్తాను. ఐ లవ్‌ హైదరాబాద్‌. ప్రస్తుతం అఖిల్‌తో ‘మిస్టర్‌ మజ్ను’ చేస్తున్నాను. కుదిరితే నాగార్జునగారితో కూడా చేయాలని ఉంది. పర్సనల్‌గా దీపికా పదుకోన్‌గారికి వీరాభిమానిని. ఆమె నాకు ఆదర్శం. బెంగళూర్‌లో చదువుకుని బాలీవుడ్‌లో అంత ఎత్తుకు ఎదిగారామె. మనం మాత్రం ఎందుకు ఎదగకూడదు? మనమూ ట్రై చేద్దాం అనుకున్నాను. అందుకే ఇండస్ట్రీకి వచ్చా.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top