మురుగు పరుగు

people facing problem with poor drainage system in medak district - Sakshi

రోడ్లపై పారుతున్న మురుగు

ఇబ్బందిపడుతున్న జనం

పట్టించుకోని అధికారులు చర్యలు చేపట్టాలని వినతి

మురుగు రోడ్లపై పారుతుండటంతో స్థానికులు అవస్థలుపడుతున్నారు. స్వచ్ఛభారత్, స్వచ్ఛగ్రామంపై విస్తృతంగా ప్రచారంచేసే నాయకులు స్థానిక పారిశుద్ధ్య సమస్యలు పట్టించుకోవడంలేదని గ్రామస్తులు వాపోతున్నారు. పారిశుద్ధ్య నిర్వహణ అధ్వానంగా ఉందని, వ్యాపారాలు చేసుకోలేకపోతున్నామని చిరువ్యాపారులు చెబుతున్నారు. వెంటనే అధికారులు స్పందించి పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా జరిగేలా చూడాలని కోరుతున్నారు.

అల్లాదుర్గం(మెదక్‌) : అల్లాదుర్గం బస్టాండ్‌ ప్రాంతంలో మురుగు కాల్వ నిండింది. ఈ ప్రాంతంలో చికెట్, మటన్‌ దుకాణాలు ఉన్నాయి. ఇళ్ల వాడకం నీరు, కోళ్ల వ్యర్థాలు కాల్వలో వేస్తుండటంతో మురుగు పారుదల నిలిచిపోతోంది. ఫలితంగా మురుగు రోడ్లపై పారుతోంది. అంతేకాకుండా బస్టాండ్‌ పరిసర నివాసాల మరుగుదొడ్ల పైపులుకూడా మోరీకి కలపడంతో దుర్వాసన వస్తోందని, ఆ ప్రాంతంలో ముక్కుమూసుకుని నిలబడాల్సి వస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

ఇక చికెన్‌ షాపు యజమానులు వ్యర్థాలను ఎల్లమ్మ దేవాలయం పరిసరాల్లో వేస్తుడటంతో దుర్వాసన భరించలేకపోతున్నామని చెబుతున్నారు. సమస్యపై సర్పంచ్, పంచాయతీ అధికారులకు ఫిర్యాదుచేసినా ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు చేపట్టలేదని మండిపడుతున్నారు. ఇక మురుగు కాల్వలకు కలిపిన పైపులు చెత్తాచెదారంతో నిండి జామవుతుండటంతో ఈ పరిస్థితి నెలకొందని తెలిపారు.  మురుగు కాల్వలు, పైపులు శుభ్రం చేస్తే సమస్య పరిష్కారమవుతుందన్నారు. ప్రజల అవస్థలు, ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా జరిగేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. 

దుర్వాసనతో ఇబ్బంది
మురుగు పారుగుదల నిలిచి రోడ్లపై పారుతుండటంతో దుర్వాసన వస్తోంది. హోటళ్లలో ఉండలేని పరిస్థితి నేలకొంది. అ«ధికారులు పట్టించుకోవడంలేదు. పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా జరిగేలా చూడాలి.    -గడ్డం రమేశ్, హోటల్‌ యజమాని, అల్లాదుర్గం

మురుగంతా రోడ్డు పైనే 
మురుగు కాల్వలు చెత్తాచేదారంతో నిండిపోయాయి. మురుగంతా రోడ్డుపైనే. బస్టాండ్‌ ప్రాంతంలో తోపుడు బండ్ల వ్యాపారులు ఎక్కువ. వారు నిలబడలేని పరిస్థితి. దుర్వాసనతో ఇబ్బందిపడుతున్నాం.   
– అశ్సు, పండ్ల వ్యాపారి, అల్లాదుర్గం

Read latest Medak News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top