దాడి సూత్రధారి ఉమేర్‌

Mohammed Ummer mastermind of pulwama attacks - Sakshi

అఫ్గానిస్తాన్‌లో ఉగ్రదాడులకు శిక్షణ

గాలింపును ముమ్మరం చేసినభద్రతాబలగాలు

దాడికి జైషే మొహమ్మద్‌(జేఈఎం)కు చెందిన మహ్మద్‌ ఉమేర్‌ వ్యూహరచన చేశాడని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) అధికారులు చెప్పారు. ఉగ్రవాద దాడులకు సంబంధించి ఉమేర్‌ అఫ్గాన్‌లో శిక్షణ పొందాడని, ఆ అనుభవంతో దాడికి పథక రచన చేశాడన్నారు. జైషే చీఫ్‌ మసూద్‌ అజహర్‌కు ఉమేర్‌ స్వయానా సోదరుడి కొడుకని చెప్పారు. దాడికి ఉమేర్‌ సూత్రధారి కాగా, మరో ఇద్దరు ఆర్డీఎక్స్‌ బాంబును రూపొందించారని ఎన్‌ఐఏ అధికారులు అన్నారు. బాంబును తయారుచేసిన ఇద్దరు ఇప్పటికే సరిహద్దును దాటి పాకిస్తాన్‌ ఆక్రమిత కశ్మీర్‌(పీవోకే)లోకి వెళ్లిపోగా, ఉమేర్‌ మాత్రం దాడిని పర్యవేక్షించేందుకు పుల్వామాలోనే ఆగిపోయాడని తెలిపారు. అతని కోసం భద్రతాబలగాలు విస్తృతంగా గాలిస్తున్నాయన్నారు. మసూద్‌ అజహర్‌కు బంధువైన హైదర్‌ 2018, అక్టోబర్‌లో కశ్మీర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోవడంతో, అతని స్థానంలో ఉమేర్‌ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నాడు.

సిరియా, అఫ్గాన్‌ తరహాలో..
సిరియా, అఫ్గానిస్తాన్‌లోని అమెరికా బలగాలు లక్ష్యంగా తీవ్రవాదులు, తిరుగుబాటుదారులు కారుతో పుల్వామా తరహాలో ఆత్మాహుతి దాడులు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో అఫ్గాన్‌లో ఉగ్రవాదుల దగ్గర శిక్షణ పొందిన ఉమేర్‌ దాన్ని కశ్మీర్‌లో పక్కాగా అమలు చేశాడు. ఈ ఆత్మాహుతి దాడి కుట్ర రషీద్‌ ఘజీ, కమ్రాన్‌ అనే ఇద్దరు ఉగ్రవాదుల పాత్ర ఉందని అధికారులు తెలిపారు. ఈ దుర్ఘటనపై ఇంటెలిజెన్స్‌ బ్యూరో(ఐబీ), జాతీయ భద్రతా దళం(ఎన్‌ఎస్‌జీ)తో కలిసి తాము దర్యాప్తు చేస్తున్నామన్నారు. జమ్మూ–కశ్మీర్‌ జాతీయ రహదారికి సమీపంలో పుల్వామా–పొంపోర్‌ల మధ్య 20–25 కిలోమీటర్ల ప్రాంతం ఉగ్రవాదులకు సురక్షిత స్థావరంగా ఉందన్నారు. ఉగ్రవాదుల్ని ఏరివేయడానికి ఈ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నామనీ, గ్రామాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. కాగా, ఉగ్రవాదుల జాడ తెలుసుకునేందుకు అధికారులు ఈ ప్రాంతంలో సెల్‌ఫోన్‌ కాల్స్‌ వివరాలను పరిశీలిస్తున్నారు. అలాగే దాడి జరగడానికి 48 గంటల ముందు వరకూ ఇంటర్నెట్‌ ద్వారా వెళ్లిన కాల్స్, సందేశాలను విశ్లేషిస్తున్నారు.

ఐఎస్‌ఐ మునీర్‌ ముద్ర!
దాడిలో పాక్‌ నిఘా సంస్థ ఇంటర్‌ సర్వీస్‌ ఇంటెలిజెన్స్‌(ఐఎస్‌ఐ) అధిపతి లెఫ్టినెంట్‌ జనరల్‌ అసీమ్‌ మునీర్‌ ముద్ర కనిపిస్తోంది. పాక్‌ ఉత్తర ప్రాంతాల కమాండర్‌గా పనిచేసిన మునీర్‌కు కశ్మీర్‌పై పూర్తి అవగాహన ఉందని ఐఎస్‌ఐ నిపుణులు వెల్లడించారు. ఐఎస్‌ఐ చీఫ్‌గా మునీర్‌ను గత ఏడాది అక్టోబర్‌లో పాక్‌ ఆర్మీ చీఫ్‌ కమర్‌ జావేద్‌ బాజ్వా నియమించారు. పుల్వామా దాడి జరిపిన జైషే మహ్మద్‌తోనే గతంలో కశ్మీర్‌లో ఐఎస్‌ఐ అనేక ఉగ్రవాద కార్యకలాపాలు చేయించింది. భారత పార్లమెంటుపై దాడి కేసులో మరణ శిక్షకు గురైన అఫ్జల్‌ గురు వర్ధంతి సమయంలో అంటే ఫిబ్రవరి మొదటి వారంలో ఇంతటి భారీ దాడి చేయించడానికి ఐఎస్‌ఐ కుట్ర పన్నిందని పాక్‌ నిఘా సంస్థ గురించి తెలిసిన వారంటున్నారు. కానీ, తన పథకాన్ని ఇంకా పకడ్బందీగా అమలు చేయడానికి దాడిని కొద్ది రోజులు వాయిదా వేసింది. ‘ఇది అమలు జరిగిన తీరులో ఐఎస్‌ఐ చీఫ్‌ ముద్ర కనిపిస్తోంది’ అని కేబినెట్‌ సెక్రెటేరియట్‌లో పనిచేసిన తిలక్‌ దేవాశర్‌ తెలిపారు.

Read latest Maharashtra News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top