
పార్లమెంట్, 26/11 దాడులకు వ్యూహరచన అతడిదే
జైషే మొహమ్మద్ కమాండర్ ఇల్యాస్ కశ్మీరీ వెల్లడి
ఇస్లామాబాద్: భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌లో పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్ అధినేత మసూద్ అజార్ కుటుంబం ముక్కలైపోయిందని స్వయంగా వెల్లడించిన ఆ సంస్థ టాప్ కమాండర్ మసూద్ ఇల్యాస్ కశ్మీరీ మరో సంచలన విషయం బయటపెట్టాడు. భారత్‌లోని ఢిల్లీ, ముంబైలో జరిగిన భీకర ఉగ్రవాద దాడుల్లో మసూద్ అజార్‌దే కీలక పాత్ర అని స్పష్టంచేశాడు. ఆయా దాడులకు ప్రణాళిక రూపొందించి, అమలు చేసింది అతడేనని పేర్కొన్నాడు. ఢిల్లీ, ముంబై ఉగ్రవాద దాడుల వెనుక తమ పౌరుల హస్తం లేదంటూ నమ్మబలుకుతున్న పాకిస్తాన్ ప్రభుత్వం అసలు రంగు దీనితో తేలిపోయింది. పాకిస్తాన్ గడ్డపై ఆశ్రయం పొందుతున్న ఉగ్రవాద సంస్థలే భారత్‌లో మారణహోమం సృష్టించినట్లు స్పష్టంగా బహిర్గతమయ్యింది.
బాలాకోట్ నుంచే కుట్ర
భారత నిఘా వర్గాలు గాలిస్తున్న మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది అమీర్–ఉల్–ముజాహిదీన్ మౌలానా మసూద్ అజార్‌కు మసూద్ ఇల్యాస్ కశ్మీరీ ప్రధాన అనుచరుడిగా గుర్తింపు పొందాడు. అతడు ఇటీవల మాట్లాడిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఢిల్లీలోని తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న సమయంలో 1999లో విమానం హైజాక్ ఉదంతంలో పాకిస్తాన్ ఉగ్రవాదుల డిమాండ్ మేరకు భారత ప్రభుత్వం మసూద్ అజార్‌ను విడుదల చేసింది.
అలా పాకిస్తాన్‌కు చేరుకున్న మసూద్ అజార్ ఇక్కడి నుంచే భారత్‌లో ఉగ్రవాద దాడులకు వ్యూహరచన చేశాడని మసూద్ ఇల్యాస్ కశ్మీరీ చెప్పాడు. పాకిస్తాన్ భూభాగంలోని బాలాకోట్‌ను అడ్డాగా మార్చుకొని, అనుచరుల సంఖ్యను పెంచుకొని, వారికి శిక్షణ ఇచ్చి, భారత్‌పైకి ఉసిగొల్పాడని వెల్లడించాడు. బాలాకోట్ అతడికి సురక్షిత ప్రాంతంగా మారిందని అన్నాడు. 2001 డిసెంబర్ 13న ఢిల్లీలోని భారత పార్లమెంట్‌పై ఆత్మాహుతి దాడి, 2008 నవంబర్ 26న ముంబైలో దాడులకు బాలాకోట్ నుంచే కుట్ర సాగించాడని తేల్చిచెప్పాడు.
రెండు భీకర దాడులు
జైషే మొహమ్మద్‌ను ఐక్యరాజ్యసమితి ఉగ్రవాద సంస్థగా ఇప్పటికే గుర్తించింది. భారత పార్లమెంట్‌పై 2001లో ఐదుగురు జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు దాడికి దిగారు. హోంశాఖ స్టిక్కర్ ఉన్న కారులో లోపలికి దూసుకొచ్చి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆరుగురు ఢిల్లీ పోలీసులు, ఇద్దరు పార్లమెంట్ సెక్యూరిటీ సర్వీసు సిబ్బంది, ఒక తోటమాలి మరణించారు. ఐదుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు కాల్చి చంపాయి. 2008లో ముంబైలో పాకిస్తాన్ ఉగ్రవాదులు బీభత్సం సృష్టించారు. 12 ప్రాంతాల్లో దాడులకు పాల్పడ్డారు. 166 మందిని బలి తీసుకున్నారు.