ముంబైలో కూలిన విమానం

Charted Plane Crashed In Mumbai - Sakshi

ఇద్దరు పైలట్లు సహా ఐదుగురు మృతి

విచారణకు ఆదేశించిన కేంద్ర మంత్రి

సాక్షి, ముంబై : ముంబై నగరంలో చిన్న విమానం కూలడంతో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. మరికొద్ది సేపట్లో జుçహూ ఎయిర్‌పోర్టులో దిగాల్సిన విమానం ఘాట్కోపర్‌లోని ఓ నిర్మాణంలో ఉన్న భవనాన్ని ఢీకొని కూలిపోయింది. ప్రమాదంలో ఇద్దరు పైలట్లు, ఇద్దరు ఎయిర్‌క్రాఫ్ట్‌ నిర్వహణ ఇంజనీర్లతో పాటు ఓ పాదచారి మృతి చెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక శాఖ, విపత్తు నిర్వహణ శాఖల అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఉవ్వెత్తున లేస్తున్న మంటలను ఆర్పివేశారు. మృతదేహాలను, క్షతగాత్రులను ఘాట్కోపర్‌లోని రాజావాడి ఆస్పత్రికి తరలించారు.

ప్రమాదానికి గురైన విమానం ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందినదని, అయితే దాన్ని యూవై ఏవియేషన్‌ సంస్థకు విక్రయించారని ఓ అధికారి తెలిపారు. 12 సీట్లతో కూడిన కింగ్‌ ఎయిర్‌ సీ90 విమానం జుçహూ నుంచి టేకాఫ్‌ తీసుకుందన్నారు. మరోవైపు ఘటనపై విచారణ జరపాల్సిందిగా డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ను పౌర విమానయాన శాఖ మంత్రి సురేశ్‌ ప్రభు ఆదేశించారు. జుహూలో విమానాలు రాకపోకలు సాగించేందుకు పవన్‌ హన్స్‌ విమానాశ్రయం ఉంది. మధ్యాహ్నం ట్రయల్‌ కోసం బయలుదేరిన విమానం టేకాఫ్‌ అయిన కొద్ది నిమిషా ల్లోనే çఘాట్కోపర్‌లో నిర్మాణంలో ఉన్న భవనాన్ని ఢీ కొని పడిపోయింది. అదృష్టవశాత్తు ఆ సమయంలో అక్కడ పనిచేస్తున్న 40–50 మంది కూలీలు భోజనానికి వెళ్లడంతో పెను ప్రమాదం తప్పింది. లేని పక్షంలో భారీ ప్రాణ నష్టం జరిగేదని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top