రూపురేఖలు మార్చేస్తారు.. | facial Surgeries for road accidents victims | Sakshi
Sakshi News home page

రూపురేఖలు మార్చేస్తారు..

Feb 13 2018 11:03 AM | Updated on Feb 13 2018 11:03 AM

facial Surgeries for road accidents victims - Sakshi

ఆపరేషన్‌కు ముందు ఇలా..ఆపరేషన్‌ తరువాత అందంగా

ముఖ భాగంలో ఎముక వంకరగా ఉన్నా, నుదుటి భాగం ఎత్తుగా ఉన్నా, ప్రమాదాల్లో ముఖానికి గాయమైనా, గ్రహణం మొర్రి ఉన్న ఇక బాధ పడనవసరంలేదు. అందవిహీనంగా ఉన్నామన్న ఆందోళన అంతకన్నా అవసరంలేదు. మాక్సిల్లో ఫేషియల్‌ సర్జన్లను సంప్రదించి ముఖానికి సరికొత్త అందాలను సమకూర్చుకోవచ్చు. ఫిబ్రవరి13వ తేదీన జాతీయ, అంతర్జాతీయ మాక్సిల్లో ఫేషియల్‌ సర్జన్ల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.

లబ్బీపేట (విజయవాడ తూర్పు): మారుతున్న కాలానికి అనుగుణంగా మాక్సిల్లో ఫేషియల్‌ సర్జన్‌లు కొత్త ఒరవడిని సృష్టిస్తూ ప్రత్యేకత చాటుతున్నారు. రోడ్డు ప్రమాదాల్లో తల, ముఖం, దవడ ఎముకలు విరిగిన వారికి అభయహస్తం అందిస్తున్నారు. ట్రామాకేర్‌ బృందంలో ప్రముఖ పాత్ర పోషించనున్నారు. మాక్సిల్లో ఫేషియల్‌ సర్జన్‌లు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 60 మంది వరకూ ఉన్నారు. అరుదైన ఫేషియల్‌ ఆపరేషన్లను విజయవంతంగా నిర్వహిస్తూ రోగుల రూపురేఖలను మార్చేస్తున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 2017లో 400 మందికి పైగా ప్రమాదాల్లో ముఖ ఎముకలు విరి గాయి. శస్త్ర చికిత్సతో వారి ముఖ అందాలను కాపాడారు. పొగాకు ఉత్పత్తుల కారణంగా నోటి క్యాన్సర్‌కు గురైన 500 మందికిపైగా శస్త్ర చికిత్స చేసి కాపాడారు.

ప్రమాదాల్లో దవడ ఎముకలతో పాటు, ఫేషియల్‌ కాస్మోటిక్‌ సర్జరీలు, ఫేషియల్‌ రీకన్‌స్ట్రక్షన్‌ సర్జరీలు, ఫేస్‌లిప్ట్, రైనో ఫ్లాస్టీ, హెయిర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ వంటి శస్త్ర చికిత్సలు విజయవంతంగా నిర్వహిస్తున్నారు. బోటాక్స్, డెర్మో ఫిల్లర్స్‌ ద్వారా ముఖంపై ముడతలను తొలగించడం వంటి సర్జరీలను సైతం సమర్థంగా నిర్వహిస్తున్నారు. మరో వైపు ఫేషియల్‌ అంకాలజీ, గ్రహణ మొర్రి ఆపరేషన్‌లు, ప్రమాదాలలో దవడ ఎముకలు విరిగిన వారిని ఆధునిక పద్ధతుల్లో రీకన్‌స్ట్రక్షన్‌ సర్జరీతో అందంగా తీర్చిదిద్దుతున్నారు. పుట్టుకతో ముఖం అందవిహీనంగా ఉన్న వారిని అందంగా మారుస్తున్నారు. ముఖ భాగంలో ఎముక వంకరగా ఉన్నా, నుదుటి భాగం ఎత్తుగా ఉన్నా, ముక్కు వంకరగా ఉన్నా శస్త్ర చికిత్సతో సరిదిద్దుతున్నారు.

ట్రామా బృందంలో సభ్యులుగా
ట్రామాకేర్‌ బృందంలో న్యూరోసర్జన్స్, ఆర్థోపెడిక్‌ సర్జన్‌లతో పాటు, మాక్సిల్లో ఫేషియల్‌ సర్జన్లు కూడా ఉండాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో కూడా ప్రతి ప్రభుత్వ బోధనాస్పత్రిలో మాక్సిల్లో ఫేషియల్‌ సర్జన్‌లు ట్రామా బృందంలో ఉండేలా ఆదేశాలు ఇస్తే అత్యవసర సమయాల్లో రోగులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. 

రోడ్డు ప్రమాదాలపై అవగాహన సదస్సు
జాతీయ మాక్సిల్లో ఫేషియల్‌ సర్జన్స్‌ డేని పురస్కరించుకుని మంగళవారం విజయవాడ పీబీ సిద్ధార్థ గ్రౌండ్స్‌లో రోడ్డు ప్రమాదాలపై అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. అందులో భాగంగా ఫేషియల్‌ సర్జరీల్లో ఆధునిక పద్ధతులపై అవగాహన కల్పిస్తారు. ఈ సదస్సులో నగరంలో ఉన్న మాక్సిల్లో ఫేషియల్‌ సర్జన్లు పాల్గొంటారు.

ఫేషియల్‌ సర్జన్ల ప్రాధాన్యత పెరిగింది
ప్రస్తుతం వైద్య రంగంలో మాక్సిల్లో ఫేషియల్‌ సర్జన్ల పాత్ర కీలకంగా మారింది. ప్రమాదాల్లో దవడ, ముఖ ఎముకలు విరి గిన వారికి శస్త్ర చికిత్సచేసి, వారి అందాన్ని కాపాడుతున్నారు. తెలంగాణ తరహాలో ప్రభుత్వ బోధనాస్పత్రుల్లోని ట్రామా కేర్‌ బృందంలో మాక్సిల్లో ఫేషియల్‌ సర్జన్‌లను నియమించాలి. ఫేషియల్‌ సర్జన్‌ల సేవలు పేద, మధ్యతరగతి వర్గాలకు చేరువలోకి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కృషి చేయాలి.  
– డాక్టర్‌ మెహబూబ్‌ షేక్, అధ్యక్షుడు,మాక్సిల్లో ఫేషియల్‌ సర్జన్స్‌ అసోసియేషన్‌ ఏపీ చాప్టర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement