మాయమైపోతున్నడమ్మా.. కొడుకన్నవాడు..!

sons harass the parents in khammam district - Sakshi

కని పెంచిన కొడుకులే.. కాల యముళ్లుగా మారుతున్నారని ఆ వృద్ధ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తమను పున్నామ నరకం నుంచి తప్పించేందుకు ఒక్క కొడుకైనా ఉండాలని ఏ దంపతులైనా ఆశపడతారు. వీరు కూడా ఒకప్పుడు అలాగే అనుకున్నారు. ఇప్పుడు మాత్రం.. ‘‘చనిపోయిన తరువాత నరకం తప్పించడం సంగతి దేవుడెరుగు..! బతికుండగానే నరకం చూపిస్తున్నాడు..!!’’ అంటూ వారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కనిపెంచిన తల్లిదండ్రులను వృద్ధాప్యంలో కన్నబిడ్డలుగా చూసుకోవాల్సిన ఆ కొడుకుల నిర్వాకాన్ని చూసిన వారంతా.. ఇలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు...‘మాయమైపోతున్నడమ్మా.. కొడుకన్న వాడు’

సాక్షి, పాల్వంచ:
అప్పుడు.. అక్కడ అలా... ఆయన.. పమ్మి సుదర్శనాచారి. ఆమె.. పమ్మి స్వరాజ్యలక్ష్మి. కేటీపీఎస్‌ ఫోర్‌మెన్‌గా 2009లో ఆయన ఉద్యోగ విరమణ చేశారు. తన కష్టార్జితంతో పాల్వంచలోని గట్టాయిగూడెం ఆదర్శనగర్‌లో ఇల్లు నిర్మించుకున్నారు. ఈ దంపతులకు ఒక కుమారుడు (సతీష్‌ కుమార్‌), ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ముగ్గురికీ వివాహాలయ్యాయి. పట్టణంలోని శాస్త్రి రోడ్డులో ‘జానకీరామ జ్యూయలరీ షాపు’ను సతీష్‌ కుమార్‌తో పెట్టించారు. ప్రభుత్వ ఉపాధ్యాయురాలైన కామేశ్వరిని ఇతడు కులాంతర వివాహం చేసుకున్నాడు. ఈ వివాహానికి సతీష్‌ కుమార్‌ తల్లిదండ్రులు అయిష్టంగానే అంగీకరించారు. 

కొన్నాళ్లపాటు బయటనే ఉన్నారు. ఆ తరువాత తల్లిదండ్రుల వద్దకు వచ్చారు. నలుగురూ కలిసే ఉంటున్నారు. సుదర్శనాచారి–స్వరాజ్యలక్ష్మి దంపతులను కొన్నాళ్ల నుంచి కొడుకు–కోడలు వేధిస్తున్నారు. తమ పేరిట ఇల్లు రాయాలని పట్టుబడుతున్నారు. ఇంటి నుంచి వెళ్లిపోవాలని మానసికంగా వేధిస్తున్నారు. ‘బయటకు వెళ్లకపోతే.. కట్నం తేవాలంటూ వేధిస్తున్నారని మీపై కోడలితో కేసు పెట్టిస్తా, జైలుకు పంపిస్తా’నని కొడుకు బెదిరిస్తున్నాడు. సుదర్శనాచారికి రెండుసార్లు, స్వరాజ్యలక్ష్మికి ఒకసారి గుండె ఆపరేషన్‌ జరిగింది. తమను సరిగ్గా చూసుకోకపోవడంతోపాటు తరచూ ఘర్షణ పడుతుండడంతో ఆ దంపతులు మనోవేదనతో కుమిలిపోతున్నారు. 

 ‘‘గుండె ఆపరేషన్‌ చేయించుకున్న మీకు.. మానసిక ప్రశాంతత అవసరం’’ అని వైద్యులు చెప్పారు. ఈ నేపథ్యంలోనే, తప్పనిసరి పరిస్థితుల్లో ఆ దంపతులు గడిచిన రెండేళ్లపాటు తమ బంధువుల ఇళ్లలో ఉన్నారు. గురువారమే తమ ఇంటికి వచ్చారు.  వీరిని ఆ కొడుకు లోపలికి రానివ్వలేదు. తలుపుకు తాళం వేసి బయటకు వెళ్లిపోయాడు. ఆ దంపతులు గేటు ముందు మెట్లపై కూర్చున్నారు. ఈ విషయం తెలిసి, అక్కడకు వచ్చిన చుట్టుపక్కల వారిని చూసి.. ‘‘సాయం చేయండి’’ అంటూ, దీనవదనంతో రెండు చేతులెత్తి వేడుకున్నారు.
 మీడియా ప్రతినిధులు వచ్చారన్న సమాచారంతో అక్కడకు సతీష్‌ కుమార్‌ వచ్చాడు. ‘‘ఈ ఇంటిని త్వరలో మేమే ఖాళీ చేసి వెళ్లిపోతాం’’ అని చెప్పి వెళ్లిపోయాడు. తాళం మాత్రం తీయలేదు. ఆ వృద్ధ దంపతులు రాత్రి 11 గంటల వరకు అలా అక్కడే కూర్చున్నారు.
 
ఆ దంపతుల వద్దకు కుల పెద్దలు వచ్చారు. అందరూ కలిసి పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లారు. సతీష్‌కుమార్‌ను సీఐ పిలిపించి మందలించారు. తన తల్లిదండ్రులకు ఇంటిని ఈ నెల 18వ తేదీన అప్పగిస్తానని ఆ ‘సుపుత్రుడు’ చెప్పాడు. 19వ తేదీ నుంచి ఆ ఇంటితో తనకు సంబంధం లేదన్నాడు. దీంతో, ఆ దంపతులు తమ బంధువుల ఇంటికి తిరిగి వెళ్లారు.
 చెప్పిన తేదీ నాటికి ఇంటిని అప్పగించకపోతే చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు. 

ఇప్పుడు.. ఇక్కడ ఇలా...
దమ్మపేట: ఆయన పేరు.. అంకత నాగయ్య, ఆమె పేరు.. అంకత గంగమ్మ. దమ్మపేట మండలం మల్కారం గ్రామానికి చెందిన ఈ దంపతులకు ఇద్దరు కుమారులు (బ్రహ్మయ్య, వెంకటేశ్వరరావు), ఇద్దరు కుమార్తెలు (సరోజని, కుమారి) ఉన్నారు. నాగయ్యకు ఒకప్పుడు మొత్తం 37 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. దాదాపు 20 ఏళ్ల క్రితం 13 ఎకరాల చొప్పున 26 ఎకరాల భూమిని ఇద్దరు కుమారులకు పంచి ఇచ్చాడు. మిగిలిన 11 ఎకరాలను తన వద్దనే ఉంచుకున్నాడు. అప్పడే, పెద్ద కుమారుడు బ్రహ్మయ్య వేరుబడి, మల్కారం గ్రామంలో ఇల్లు కట్టుకున్నాడు. అక్కడే ఉంటున్నాడు. 

నాగయ్య దంపతులు, తమ ఇంట్లోని నాలుగు గదుల్లో రెండింటిని చిన్న కుమారుడు వెంకటేశ్వరరావుకు ఇచ్చారు. మిగిలిన రెండు గదుల్లో తమ చిన్న కుమార్తె కుమారితో కలిసి ఉంటున్నారు. తమకు మిగిలిన భూమిని కౌలుకు ఇచ్చారు. ఆ ఆదాయంతోనే జీవనం సాగిస్తున్నారు. భూముల పంపకం పూర్తయినప్పటి నుంచి ఆ దంపతుల బాగోగులను కొడుకులిద్దరూ పట్టించుకోవడం లేదు. తమ బాగోగులు చూడాలని, అందుకుగాను తన పేరిట ఉన్న 11 ఎకరాల భూమిని రాసిస్తానని చిన్న కుమారుడు వెంకటేశ్వరరావుతో నాగయ్య చెప్పాడు. అందుకు కొడుకు అంగీకరించాడు. 

దీంతో అతడి పేరిట  వీలునామాను నాగయ్య రాశాడు. చిన్న కుమారుడి పేరిట భూమిని వీలునామా రాయడం సరికాదని నాగయ్యకు బంధువులు చెప్పారు. దీంతో, ఆయన వెంటనే ఆ వీలునామాను రద్దు చేసుకున్నారు. ఇది చిన్న కుమారుడు వెంకటేశ్వరరావుకు కోపం తెప్పించింది. గొడవలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో, నాగయ్య దంపతులు గత ఆరు నెలలుగా తమ పెద్ద కుమార్తె సరోజని (అశ్వారావుపేట మండలం వినాయకపురం గ్రామం) ఇంటి వద్ద ఉంటున్నారు. ఆ దంపతులు, తమ చిన్న కుమార్తెతో కలిసి శుక్రవారం సాయంత్రం మల్కారంలోని తమ ఇంటికి వచ్చారు. శనివారం ఉదయం గంగమ్మ, కుమారి కలిసి గిన్నెలు తోముతున్నారు. నాగయ్య బయటకు వెళ్లాడు. ఆ సమయంలో ఇంటికి వెంకటేశ్వరరావు తాళం వేసి బయటకు వెళ్లిపోయాడు. ఎంతసేపటికీ రాలేదు. 
 
ఆ దంపతులు ఈ విషయాన్ని గ్రామ పెద్దలతో చెప్పారు. వారు వెంకటేశ్వరరావును వివరణ అడిగారు. తాను ఎవ్వరికీ సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదంటూ నిర్లక్ష్యంగా మాట్లాడాడు. మరో మార్గం లేకపోవడంతో, ఆ వృద్ధ దంపతులు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సీఐ, ఎస్‌ఐ కౌన్సిలింగ్‌ ఇస్తారని ఏఎస్‌ఐ సుబ్బారావు చెప్పారు. ఆ దంపతులు, వినాయకపురంలోని తమ పెద్ద కుమార్తె ఇంటికి వెళ్లారు.  

Read latest Khammam News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top