అడుగడుగునా సమస్యలే..

people are facing problems with poor drainage and current facilities - Sakshi

ముక్కులు మూసుకుంటేనే కాలనీల్లో ప్రయాణం

డ్రెయిన్లను కమ్మేసిన కంపచెట్లు..

మురుగుతో తీవ్ర దుర్వాసన  

ఖమ్మంఅర్బన్‌ : నగరంలోని మమత వైద్యశాల రోడ్డులోని కాలనీల ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ‘పైన పఠారం, లోన లొటారం’ అన్న చందంగా మారింది. రోడ్డుకు ఇరువైపుల పదుల సంఖ్యలో పెద్ద పెద్ద అపార్ట్‌మెంట్లు ఉన్నాయి. వారంతా క్రమం తప్పకుండా పన్నులు చెల్లిస్తున్నా కనీస మౌలిక సదుపాయాలు కల్పించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు లోఓల్టేజీ సమస్యను తీర్చాలనే అభిప్రాయంతో ఏడాదిన్నర కిందట సబ్‌స్టేషన్‌ నిర్మాణం కోసం రూ.కోటి నిధులు కేటాయించి, నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. తర్వాత ఆ స్థలం కోర్టు వివాదంతో పనులు నిలిచి పోవడంతో సమస్య తీరలేదు. పరిసరాల కాలనీల పరిధిలో లోఓల్టేజీ సమస్యతోపాటు తరచూ అంతరాయం జరుగుతూ ఇబ్బంది పడుతున్న నివాసులు వాపోతున్నారు. కాలనీలో అందమైన భవనాలు ఉన్నాయి.

కొన్ని రహదారులకు డ్రెయిన్లు ఉన్నప్పటికీ రెగ్యులర్‌గా శుభ్రం చేయక పోవడం వల్ల కంపచెట్లు అల్లుకుని ఆనవాళ్లు లేకుండా పోయాయి. కచ్చా డ్రెయిన్లు ఉన్న వీధుల్లో మురుగునీరు పోయే విధంగా లేక పోవడంతో ఎక్కడి మురుగు అక్కడ నిలిచి కంపు కొడుతోందని కాలనీవాసులు వాపోతున్నారు. మురుగునీరు నిలవడంతో దోమలు, పశువులు స్వైరవిహారం చేస్తున్నాయని కాలనీవాసులు వాపోతున్నారు. రోడ్లు కూడా పూర్తిస్థాయిలో నిర్మించలేదని, ఖాళీ స్థలాల్లో కూడా పెద్ద పెద్ద కంపచెట్లు పెరిగి చిన్న పాటి అడవిని తలపిస్తున్నాయి. రాఘవయ్యనగర్, వరదయ్యనగర్, ఒయాసిస్‌రోడ్డు తదితర 22వ డివిజన్, 10వ డివిజన్, 11వ డివిజన్‌ పరిధిలోని నివాసులు సమస్యలతో ఇబ్బంది పడుతున్నామని వాపోతున్నారు. ఈ కాలనీల పరిధిలో నుంచి లకారం చెరువుకు నీరు అందించే మేజర్‌ కాలువ లైనింగ్‌ లేకపోవడంతోపాటు ఇళ్లు ఆనుకొని ఉండటం వల్ల నీరు కలుషితం కావడంతోపాటు నీరు నిలిపివేసి తర్వాత సమీపంలోని నివాసాల వాడకం నీరు చేరి మురుగు కంపు కొడుతోందని గృహ యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

రోడ్డు లేదు.. డ్రెయిన్లు లేవు...  
తమ కాలనీలో రోడ్డు లేదు. డ్రెయిన్లు లేకపోవడం వల్ల మురుగుకంపు వస్తోంది. ఖాళీ స్థలాల్లో కంపచెట్లు పెరిగి భయంకరంగా మారాయి. పారిశుద్ధ్య కార్మికులు రాక పోవడం వల్ల డ్రెయిన్లు అధ్వానంగా మారుతున్నాయి. పన్నులు మాత్రం క్రమం తప్పకుండా  చెల్లిస్తున్నాం. కానీ, కార్పొరేషన్‌ నుంచి కనీస మౌలిక సదుపాయాలు కల్పించడం లేదు. 
-మందడపు వెంకటేశ్వరరావు, కాలనీవాసి 

సబ్‌స్టేషన్‌ పూర్తయితే  విద్యుత్‌ సమస్య ఉండదు 
మమత వైద్యశాల రోడ్డులో సబ్‌స్టేషన్‌ నిర్మాణం పూర్తయితే ఆ ప్రాంతంలో విద్యుత్‌ సమస్యలు దాదాపు ఉండక పోవచ్చు. ప్రస్తుతం రోటరీనగర్‌ సబ్‌ స్టేషన్‌ నుంచి ఇవ్వాల్సి వస్తోంది. దీంతో అధికలోడు కారణంగా అప్పుడప్పుడు సమస్య ఎదురవుతోంది. తాత్కాలికంగా సమస్యల నుంచి గట్టెక్కడానికి 100 కేవీ ట్రాన్స్‌ఫార్మర్లు 160 కేవీగా మార్చేందుకు 3 ట్రాన్స్‌ఫార్మర్ల కోసం ప్రతిపాదనలు పంపాం. కొత్తగా మరో 100 కేవీ ట్రాన్స్‌ఫార్మర్లు 10 మంజూరుకు ప్రతిపాదనలు పంపాం. అవి మంజూరైతే సమస్య చాలా వరకు తగ్గుతుంది.
-జె.శ్రీధర్‌రెడ్డి, విద్యుత్‌ ఏఈ

Read latest Khammam News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top