సినిమాను మించిపోయే దొంగల కథ ఇది.. | Sakshi
Sakshi News home page

చోర్‌ చోర్‌..! పకడో పకడో...!!

Published Wed, Jan 17 2018 9:11 AM

local peoples cached thief - Sakshi

జూలూరుపాడు:

మంగళవారం ఉదయం 10.40 గంటలు..
జూలూరుపాడు మండలం గుండెపూడి గ్రామం..
గాదె లక్ష్మి బడ్డీ కొట్టు..

పల్సర్‌ బైక్‌పై ఇద్దరు యువకులు వచ్చారు. సిగరెట్‌ అడిగారు. ఆమె ఇచ్చింది. అగ్గిపెట్టె కావాలన్నారు. కిందికి వంగి అగ్గిపెట్టు తీస్తోంది. సరిగ్గా అదే క్షణంలో.. ఆమె మెడలోని రెండు తులాల బంగారపు గొలుసు(నానుతాడు)ను ఆ ఇద్దరు యువకులు లాక్కున్నారు, వాయువేగంతో మాయమయ్యారు. ఆమె గావుకేకలు వేసింది. తన గొలుసు లాక్కుని వెళుతున్నారంటూ దూరంగా వెళుతున్న బైక్‌ను చూపించింది. చుట్టుపక్కల వాళ్లంతా వెంటనే అప్రమత్తమయ్యారు. బైక్‌లపై వెంటాడారు. సమాచారం అందిన వెంటనే జూలూరుపాడు ఎస్సై ఇళ్ల రాజేష్, చండ్రుగొండ ఎస్సై ప్రసాద్‌ ఆధ్వర్యం లో పోలీసులు రంగంలోకి దిగారు. వారు తమ వాహనాల్లో ప్రత్యక్షమయ్యారు. ముందు పల్సర్‌ బైక్‌.. వెనుక స్థానికులు, పోలీసుల వాహనాలు..! చేజింగ్‌ సాగుతోంది..!! సినిమాల్లో విలన్లను హీరో(లు) వెంటాడుతున్నట్టుగా...!!!

ఆ ఇద్దరు చైన్‌స్నాచర్ల పల్సర్‌ బైక్‌.. చండ్రుగొండ వైపు వెళుతోంది. ముందు దొంగల బైక్‌.. వెనుక పోలీసులు, ఇతరుల వాహనాలు.. కొంతసేపు ఈ చేజింగ్‌ సాగింది. అనూహ్యంగా, రోడ్డుపై కొంచెం దూరంలో (చండ్రుగొండ) పోలీసుల వాహనం కనిపించింది. ఆ ఇద్దరు దొంగలు తమ బైక్‌ను జూలూరుపాడు వైపు మళ్లించారు.
చండ్రుగొండ క్రాస్‌ రోడ్డులోని ఆటో అడ్డా వద్ద అక్కడి స్థానికులు, ఆటో డ్రైవర్లు కలిసి ఆటోలను రోడ్డుకు అడ్డంగా పెట్టారు. ‘ఈ దెబ్బకు దొంగల ఆట కట్టు’ అనుకున్నారు. పక్కన నిలబడి చూస్తున్నారు.
ఆ పల్సర్‌ బైక్‌ వాయువేగంతో దూసుకొస్తోంది... వస్తోంది.. వస్తోంది... వచ్చింది.. వెళ్లింది...! అక్కడున్న వారంతా నిశ్చేష్టులై కొన్ని క్షణాలపాటు అలా చూస్తుండిపోయారు.
రోడ్డుపై అడ్డుగా ఆటోల మధ్యనున్న కొద్దిపాటి ఖాళీ నుంచి దొంగలు చాలా నేర్చుగా వెళ్లారన్న విషయాన్ని గ్రహించారు, ఆ వెంటనే తేరుకుని వెంబడించారు. ఇంతలో వెనుక నుంచి పోలీసులు, ఇతరుల వాహనాలు వచ్చాయి.
కొత్తగూడెం వైపుగా దొంగలు పారిపోతున్నారు. సాయిరాం తండా గ్రామం దాటారు. కాకర్ల ఎర్రవాగు చెరువునకు వెళ్లే మట్టి రోడ్డు వైపునకు బైక్‌ మళ్లింది. కొంతదూరం ప్రయాణించిన తరువాత బైక్‌ను పడేశారు... పారిపోతున్నారు.
అప్పటికే వెనుకనున్న వాహనాలు దగ్గరికి వచ్చాయి. పారిపోతున్న ఇద్దరిలో ఒకడిని పట్టుకున్నారు. నాలుగు దెబ్బలేశారు. వెనుకగా వచ్చిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మరొకడు కనిపించలేదు. వాడి కోసం వేట మొదలైంది. అందరూ కలిసి పరిసర ప్రాంతాల్లో గాలించారు. దాదాపుగా గంట తర్వాత,  దండుమిట్టతండా గ్రామ సమీపంలోగల జామాయిల్‌ తోటలో రెండో దొంగ కూడా దొరికాడు.
వీరిద్దరిదీ, కృష్ణా జిల్లా విజయవాడ. ఒకడేమో నాగ, మరొకడేమో మధు.
ఈ చేజింగ్‌ అంతా దాదాపుగా రెండు గంటలపాటు సాగింది. చివరికిది సుఖాంతమైంది. ‘‘సినిమాల్లో విలన్లను హీరోలు వెంటాడి పట్టుకున్నట్టుగా మేము (స్థానిక ప్రజలు), పోలీసులం కలిసి దొంగలను పట్టుకున్నాం’’ అంటూ, స్థానికులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు.
ముందు రోజు (సోమవారం) రాత్రి రెండు ఆలయాల్లో చోరీలు చేసింది ఈ ఇద్దరే కావచ్చేమో..?! అనే అనుమానాలను స్థానికులు వ్యక్తం చేస్తున్నారు.

రెండు ఆలయాల్లో చోరీ
సంక్రాంతి రోజు (సోమవారం) అర్థరాత్రి. జూలూరుపాడు మండలంలోని కొమ్ముగూడెం శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయ గర్భగుడిలో చోరీ జరిగింది. తాళం కప్పను కోశారు. అమ్మవారి బంగారు తాళిబొట్టు, ముక్కుపుడక, వెండి గొడుగు దొంగిలించారు. ఆలయం నుంచి దొం గలు బయటకు వెళుతుండడాన్ని సమీపంలోని స్థానికులు గమనించారు. ఆలయ కమిటీకి, పోలీసులకు సమాచారమిచ్చారు, ఎస్సై ఇళ్ల రాజేష్‌ వచ్చారు. మాయమైన నగల విలువ రూ.50వేలు ఉంటుందని ఆలయ కమిటీ తెలిపింది. జూలూరుపాడులోని శ్రీ కోట మైసమ్మ తల్లి ఆలయంలోకూ ఇదే రోజు రాత్రి చోరీ జరిగింది. తాళం పగలగొట్టారు. అమ్మవారి విగ్రహానికి అలం కరించిన రోల్డ్‌గోల్డ్‌ నగలు ఎత్తుకెళ్లారు. హుండీ పగలగొట్టారు.
 ఈ రెండు ఆలయాల్లో చోరీ చేసింది.. పట్టుబడిన ఆ ఇద్దరు చైన్‌ స్నాచర్లేనా..? ఇది తేలాల్సుంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement