మురికి కాలువను తలపిస్తున్న ఎస్సారెస్పీ ఎల్‌ 6 కాలువ

SRSC L6 Canal Drinking Water Contaminated By Dirty Water Evacuation From Houses - Sakshi

సాక్షి,రామగిరి: మండలంలోని రాజాపూర్‌ వద్ద ఉన్న ఎస్సారెస్పీ ఎల్‌ 6 కాలువ మురికి కాలువను తలపిస్తుంది. గ్రామం పరిధిలో సుమారు 400 మీటర్ల పొడవున ఎస్సారెస్పీ కాలువ ప్రవహిస్తుంది. గ్రామం పరిధిలో కాలువ ప్రారంభం నుంచి చివరి వరకు నివాస గృహాల్లోని వృథానీరు కాలువలోకి వదిలేస్తుండంతో ఈదుస్థితి నెలకొంది. కాలువ పొడవునా ఆనుకుని నిర్మించిన సుమారు 200 ఇళ్లలోని మరుగుదొడ్లు, వృథా నీరుకూడా ఇందులోకి పైపులైన్ల ద్వారా వదిలివేయడంతో కాలువ పొడవునా దుర్గంధం వెలువడుతుంది. కాలువ నుంచి సాగునీరు విడుదల అయ్యే సమయంలో మినహా మిగతా సమయంలో ఎస్సారెస్పీ కాలువ మురికి కాలువను తలపిస్తోంది. కాలువలో మురికినీరు నిలిచిపోవడం వల్ల కాలువ పొడవునా తుంగ, చెత్తా చెదారం పేరుకు పోయి పందులకు స్థావరంగా మారి దోమలు వృద్ధి చెందుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దీని వల్ల ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నా సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వెలువడుతున్నాయి. ఇటీవల సింగరేణి స్థంస్థ ఓసీసీ2 విస్తరణ కోసం ఎల్‌6 కాలువను మళ్లీస్తున్నారు. దీంతో దీన్ని గురించి పట్టించుకునే వారు కరువయ్యారు. కాలువ గురించి ఎవరు పట్టించుకోపోవడం వల్ల మురికి కాలువను తలపిస్తున్న ఎస్సారెస్పీ కాలువ వల్ల స్థానికులు నానా ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఇటీవల టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కొత్త గ్రామపంచాయతీల ఏర్పాటుకు రూపకల్పన చేయడంతో రాజాపూర్‌ గ్రామం నూతన గ్రామ పంచాయతీగా ఏర్పడింది. కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీ పాలనలోనైన మురికి కాలువను తలపిస్తున్న ఎస్సారెస్పీ కాలువ వల్ల పడుతున్న ఇబ్బందులు తొలగిపోతాయని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైన సంబంధిత అధికారులు మురికి కాలుగా మారిన ఎస్సారెస్పీ కాలువ పట్ల తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.  

భరించలేకపోతున్నాం.. 
కాలువలోకి ఇండ్లల్లోని నీరు వదిలేయడం వల్ల వస్తున్న గలీజు వాసన భరించలేకపోతున్నాం. కాలువ నుంచి వచ్చే వాసన వల్ల కడుపులో వికారం ఏర్పడి వాంతులు చేసుకుంటున్నాం. కాలువ నిండి తుంగ మొలిచి పందులు తిరుగుతున్నాయి. దీన్ని పట్టించుకునేటోళ్లే లేకుండా పోయారు.  


–రొడడ బాపు, రాజాపూర్‌ 

కాలువ శుభ్రం చేయాలి 
కాలువలో చెత్తాచెదారం నిండిపోవడం వల్ల దోమలు పెరిగి రోగాల భారిన పడుతున్నాం. నీళ్లు వచ్చినప్పుడు ఎలాంటి వాసన రావడం లేదు, నీళ్లు బంద్‌ అయిన తరువాత వచ్చే వాసన వల్ల మాగోస చెప్పుకోలేము. అధికారులు కాలువను శుభ్రం చేయించాలి. 

 –బర్ల కుమార్, రాజాపూర్‌  

Read latest Karimnagar News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top