‘మహా’ జాతర.. ఆరుసార్లు బ్రేక్‌తో అవస్థలు

maha shivaratri jathara  - Sakshi

వైభవంగా మహాశివరాత్రి వేడుకలు 

స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

రాజన్నను దర్శించుకున్న 3లక్షల మంది

దర్శనానికి ఆరుగంటల సమయం

ఆర్జిత సేవలు బంద్‌...

స్వల్ప తోపులాట.. సొమ్మసిల్లిన భక్తులు

వేములవాడ : వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం మహాశివరాత్రి వేడుకలు  వైభవంగా జరిగాయి. ఉదయం స్వామివారికి మహాలింగార్చన కార్యక్రమాన్ని స్థానాచార్యులు గోపన్నగారి శంకరయ్యశర్మ ఆధ్వ ర్యంలో నిర్వహించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన దాదాపు 3లక్షల మంది భక్తులు రాజన్నను దర్శించుకుని తరించారు. శివదీక్షాపరులతో ఆలయ ప్రాంగణమంతా మంచిగంధం వర్ణమైంది. జాతర సందర్భంగా ఆర్జీత సేవలు రద్దు చేశారు. బుధవారం అర్థరాత్రి వరకు ఆలయాన్ని తెరచే ఉంచుతున్నట్లు అధికారులు ప్రకటించారు. ఏర్పాట్లను జిల్లా కలెక్టర్‌ కృష్ణభాస్కర్, ఎస్పీ విశ్వజీత్, ఈవో దూస రాజేశ్వర్, డీఆర్‌వో శ్యాంప్రసాద్‌లాల్‌ అధికారులు పర్యవేక్షించారు.

ఆరుసార్లు బ్రేక్‌తో అవస్థలు
మహాశివరాత్రి సందర్భంగా రాజన్నను దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు అవస్థలు తప్పలేదు. మంగళవారం ఐదుసార్లు విధించిన బ్రేక్‌ వల్ల భక్తులు అసహనం కోల్పోయారు. దీనికితోడుగా అర్థరాత్రి నుంచి స్థానికుల దర్శనాలు, కౌన్సిలర్ల దర్శనాలు, టీడీపీ పట్టువస్త్రాల సమర్పణ, ప్రభుత్వ పక్షాన పట్టువస్త్రాల సమర్పణ, శివస్వాముల దర్శనాలు, స్థానిక బ్రాహ్మణోత్సముల మహాలింగార్చన, లింగోద్భవ సమయంలో ఇలా ఆరుసార్లు బ్రేక్‌ ఇవ్వడం వల్ల భక్తులంతా క్యూలైన్లలోనే గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చింది. పోలీసులు జారీ చేసిన పాస్‌లపై వివాదం నెలకొంది. పాస్‌లు జారీ చేసిన పోలీసులు వాటిని అనుమతించలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.  

వైభవంగా మహాశివరాత్రి వేడుకలు
సోమవారం రాత్రి 12 గంటల నుంచి 3.30 గంటల వరకు స్థానికుల దర్శనాల అనంతరం గర్భగుడి దర్శనాలు నిలిపివేశారు. స్వామివారి దర్శనానికి ఆరుగంటల సమయం పట్టింది.  దీంతో క్యూలైన్లలో నిలబడిన ముగ్గురు భక్తులు సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే ఆరోగ్య సిబ్బంది అక్కడి కి చేరుకుని చికిత్స చేశారు. భక్తులు ధర్మగుండంలో స్నా నా లు చేసి కోడె మొక్కులు, తలనీలాలు సమర్పించుకున్నారు.

పట్టువస్త్రాల సమర్పణ...  
స్వామి వారికి ప్రభుత్వం తరపున రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యే రమేశ్‌బాబు, కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ దంపతులు స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అంతకు ముందు తిరుమల తిరుపతి దేవ స్థానం పక్షాన జేఈవో శ్రీనివాస్‌రావు ఆధ్వర్యంలో టీటీడీ అర్చకుల బృందం స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు. స్వామి వారికి సుమారు రూ. కోటిన్నర ఆదాయం సమకూరనున్నట్లు ఆలయ వర్గాలు భావిస్తున్నాయి.

వైభవంగా సామూహిక ‘మహాలింగార్చన’
వేములవాడ: మహాశివరాత్రి సందర్భంగా  సామూహిక మహాలింగార్చన కార్యక్రమం మంగళవారం రాత్రి వైభవంగా జరిగింది.స్వామి వారి కల్యాణ మండపంలో స్థానాచార్యులు గోపన్నగారి శంకరయ్య నేతృత్వంలో అర్చక బృందం మహాలింగార్చనను రెండు గంటల పాటు నిర్వహించారు. మట్టితో చేసిన 366 మృత్తికలు, పిండితో చేసిన 366 జ్యోతులను లింగాకారంలో పేర్చి స్వామి వారికి అభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనువంశిక అర్చక కుటుంబాలు పాల్గొన్నాయి.  

Read latest Karimnagar News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top