ఉద్యోగాల ఎర..రూ.కోట్లలో టోకరా!

fraud job givers took crores from people - Sakshi

ఉద్యోగాలు, ఎంబీబీస్‌ సీట్ల పేరిట మోసం

సామాన్యులే లక్ష్యంగా రూ.కోట్లలో బురిడీ

వెలుగులోకి వస్తున్నఉదంతాలు..

పోలీసులను ఆశ్రయిస్తున్న బాధితులు 

గద్వాల క్రైం : ఎంత చదివినా ఉద్యోగం కోసమే కదా..? లేకపోతే కోరుకున్న కాలేజీలో ఎంబీబీఎస్‌ సీటు రావాలి.. ఎంత కష్టపడినా అదృష్టం ఉండాలి.. ఇప్పుడు అదృష్టం మీ ఎదురుగా ఉంది.. నాకు పెద్ద పెద్ద అధికారులు తెలుసు.. నాతోపాటే రండి.. అన్ని విషయాలు తెలుస్తాయి..! ఇలా సామాన్యులకు కొందరు మోసగాళ్లు వల వేస్తున్నారు. ఇలాంటి ఉదంతాలు నడిగడ్డలో ఎన్నో చోటుచేసుకుంటున్నాయి.

 నడిగడ్డ ప్రాంతంలో.. 
జోగుళాంబ గద్వాల జిల్లాకేంద్రంతోపాటు అలంపూర్, అయిజ, గట్టు, మల్దకల్, మానవపాడు, శాంతినగర్, ఇటిక్యాల తదితర మండలాలకు చెందిన అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకుని ఉద్యోగాలు, ఉన్నత చదువుల పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. పోలీసు శాఖలోనూ హోంగార్డు ఉద్యోగాలు ఇప్పిస్తామని రూ.లక్షలు వసూలు చేశారు. ఇందులో ఏపీకి చెందిన ఇద్దరిని గద్వాల పట్టణ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. అయితే ఇలాంటి మోసగాళ్లకు దళారులు అండగా ఉండి నిరుద్యోగులకు వల వేస్తున్నారు. దళారులుగా ఉన్న వారిలో చాలామందికి పలుకుబడిన వ్యక్తులతో సంబంధాలు ఉండడంతో వారిపై ఫిర్యాదు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేకపోతున్నారు. పలు ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని ఏజెన్సీలు సైతం ఏర్పాటు చేసుకుని రూ.కోట్లు వసూలు చేసి మకాం మార్చిన కేటుగాళ్లు సైతం జిల్లాలో పెద్ద మనుషులుగా చెలామణి అవుతున్నారు. అసలు సూత్రధారులు.. మధ్యవర్తులను నిలువరిస్తే మోసగాళ్లకు కళ్లెం వేయవచ్చు.

ఇవిగో ఘటనలు.. 
గద్వాలకు చెందిన ఓ వ్యక్తి 2015లో తన కూతరు ఎంబీబీఎస్‌ ప్రవేశం కోసం హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తిని కలిసి ముందస్తుగా రూ.15 లక్షలు ఇచ్చి.. సీటు వచ్చిన తర్వాత రూ.50 లక్షలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇలా అంతర్జాతీయ ముఠా సభ్యులు పలు రాష్ట్రాల్లో 21 మంది విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి రూ.3.39 కోట్లు దోచుకున్నారు. 2015లో జరిగిన ఈ వ్యవహారం జిల్లా ఏర్పాటు తర్వాత ఈ నెల 1న ఈ ముఠా సభ్యులను గద్వాల పట్టణ పోలీసులు అరెస్టు చేయడం గమనార్హం. 

2105లో గద్వాల, అయిజకు చెందిన 16 మంది నిరుద్యోగులు ఉద్యోగం కోసం తెలిసిన వ్యక్తిని ఆశ్రయించారు. జిల్లా సహకార కో–ఆపరేటివ్‌ బ్యాంకులో ఉద్యోగాల కోసం ఒక్కొక్కరి నుంచి రూ.1.50 లక్షల చొప్పున రూ.24 లక్షలు వసూలు చేశారు. తప్పుడు ధ్రువపత్రాలు ఇచ్చి మీరు ట్రైనింగ్‌లో ఉన్నారు.. కొన్ని నెలల తర్వాత పర్మనెంట్‌ అవుతుందని నమ్మబలికారు. కానీ ఉద్యోగం మాత్రం రాకపోవడంతో గట్టిగా నిలదీయగా అప్పుడు.. ఇప్పుడు అంటూ కాలయాపన చేశారు. దీంతో మోసపోయామని గుర్తించిన బాధితులు తాజాగా జిల్లా ఎస్పీ విజయ్‌కుమార్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ముఠాలోని ఓ వ్యక్తిని ఇటీవల అయిజ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

 
2016లో మల్దకల్‌ మండలం పాల్వాయికి చెందిన ఇద్దరు నిరుద్యోగులు ఉద్యోగం కోసం ఓ వ్యక్తిని ఆశ్రయించారు. సదరు మోసగాడు కేంద్ర ప్రభుత్వంలో కంప్యూటర్‌ ఆపరేటర్, అటెండర్‌ ఉద్యోగాలు ఉన్నాయి. రూ.3.50 లక్షల చొప్పున రూ.7 లక్షలు వసూలు చేశారు. ఇలా కొల్లాపూర్‌కు చెందిన మరో ఆరుగురు నిరుద్యోగుల నుంచి రూ.24 లక్షలు వసూలు చేశాడు. తర్వాత  మౌఖిక పరీక్షలకు వెళ్లండి అంటూ నకీలి పత్రాలు ఇచ్చి హైదరాబాద్‌కు పంపారు. అక్కడికి వెళ్తే ఇలాంటి ఉద్యోగాలకు ఎలాంటి మౌఖిక పరీక్షలు లేవని చెప్పి వెనక్కి పంపారు. మోసపోయిన వీరు సైతం ఈ ఏడాది జనవరిలో గద్వాల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ూ జిల్లాలో ఇప్పటి వరకు 30కిపైగా ఇలాంటి కేసులు నమోదైనట్లు పోలీసులు వివరించారు. నమోదు కాని కేసులు సైతం మరో 50 వరకు ఉన్నట్లు సమాచారం. 

2015లో జరిగిన వ్యవహారం.. 
నడిగడ్డలో 2015 సంవత్సరంలో మోస పోయిన బాధితులు ప్రస్తుతం జిల్లా ఏర్పాటుతో ఒక్కొక్కరు ఎస్పీ విజయ్‌కుమార్‌ దృష్టికి తీసుకెళ్లడంతో కేటుగాళ్ల లీలలు బయటపడుతున్నాయి. ఇటీవల ఎంబీబీఎస్‌ సీట్లు ఇప్పిస్తామని రూ.3 కోట్లకుపైగా వసూలు చేసిన ముఠాను పోలీసులు అరెస్టు చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే జిల్లాలో ఈ వ్యవహారం నడిపించిన దళారులు, సూత్రధారులు ఎవరనే అంశంపై పోలీసులు పలు బృందాలుగా ఏర్పడి తమదైన శైలిలో దూసుకువెళ్తున్నారు. 

ప్రజల్లో చైతన్యం రావాలి.. 
ప్రభుత్వ ఉద్యోగం డబ్బులు పెడితే రాదు. ప్రజలు మోసపోయేంత వరకు మోసగాళ్లు మోసం చేస్తూనే ఉంటారు. అంతా అయిపోయాక పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఇకనైనా జిల్లా ప్రజల్లో చైతన్యం రావాలి. త్వరలో పోలీసు శాఖ తరపున అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తాం. నిందితులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటాం. 
– విజయ్‌కుమార్, ఎస్పీ, జోగుళాంబ గద్వాల

Read latest Jogulamba News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top