అన్నదాతల ఆక్రోశం

farmers protest and rasta roko in alampur - Sakshi

అయిజలో కందుల కొనుగోలు చేయాలని రైతుల ధర్నా, రాస్తారోకో

రెండుగంటలపాటు నిలిచిపోయిన వాహనాలు

పోలీసుల జోక్యంతో ఆందోళన విరమించిన రైతులు

అయిజ (అలంపూర్‌) : ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యానికి మద్దతు ధర కల్పించి, కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని రైతులు ఆక్రోశం వెళ్లగక్కారు. రైతులు తాము పండించిన పంటలను దళారులకు తక్కువ ధరకు విక్రయించి నష్టపోకుండా ఉండేందుకు ప్రభుత్వం ప్రాథమిక వ్యవసాయ సహకార సం ఘం, హాలియా నాఫెడ్‌ వారి ఆధ్వర్యంలో హాకా ద్వారా గిట్టుబాటు ధరకు కందులు కొనుగోలు చేసేందుకు ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ నెల 1న అయిజ మార్కెట్‌ సబ్‌యార్డులో కందుల కొనుగోలు కేంద్రం ప్రారంభించారు.

ఇక్కడ మద్దతు ధర రూ.5,250 కాగా బోనస్‌ రూ.200 కలిపి మొత్తం రూ.5,450కు కొ నుగోలు చేయాలి. ఈ మేరకు సబ్‌ యార్డుకు రైతులు ప్రతిరోజు సుమారు 300 నుంచి 500 క్విం టాళ్ల కందులు తెస్తుండగా 250 నుంచి 300 క్వింటాళ్ల వరకు కొనుగోలు చేస్తున్నారు. ప్రతిరోజు సుమారు 200 క్వింటాళ్ల కందులు మి గిలిపోతున్నాయి. సంచుల కొరత ఎక్కువగా ఉండడంతో కందుల కొనుగోళ్లు సైతం మందగించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. 

రేయింభవళ్లు పడిగాపులు.. 
ఇదిలా ఉండగా హమాలీలకు హాకా నుంచి  సుమారు రూ.90 వేలు కూలీలు చెల్లించాల్సి ఉంది. దీంతో హమాలీలు మార్కెట్‌ యార్డులో పనిచేసేందుకు నిరాసక్తి చూపుతున్నారు. దాని వలన వేల క్వింటాళ్ల కందులు మార్కెట్‌ యార్డులో పోగవుతున్నాయి. నాలుగైదు రోజుల నుంచి కందులు కొనుగోలు చేయకపోవడంతో రైతులు రేయింభవళ్లు కందుల కుప్పల వద్ద పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ మేరకు ఆగ్రహించిన రైతులు గురువారం ఏకంగా నగరపంచాయతీలోని పాతబస్టాండ్‌ చౌరస్తాలో రోడ్డుపై రాస్తారోకో, ధర్నా కార్యక్రమాలను చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రెండుగంటల పాటు ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి అధికారులతో మాట్లాడుతామని, రోడ్డుపై నుంచి వెళ్లిపోవాలని రైతులను కోరారు. దానితో రైతులు ధర్నా విరమించి వెళ్లిపోయారు.  

ఐదురోజుల నుంచి కాపలా.. 
ఆదివారం అయిజ మార్కెట్‌ యార్డుకు 40 సంచులు కందులు తెచ్చా. ఇంతవరకు కొనలేదు. రాత్రీపగలు కందుల వద్ద కాపలా ఉంటున్నాం. తిండి తినడానికి కూడా కష్టమైంది. రాత్రిపూట చలికి వణికిపోతున్నా. అధికారులను బతిమలాడినా కందులు కొనకపోవడంతో రోడ్డుమీదకు వచ్చాం. 
– రాముడు, రైతు, తాండ్రపాడు, రాజోళి మండలం 
 

సమస్యలను పరిష్కరిస్తాం.. 
తేమశాతం ఎక్కువ ఉండడంతో కొంతమంది రైతుల కందులు కొనుగోలు చేయలేదు. సంచుల కొరత ఉన్నందుకు కొంత మేరకు పనులు మందగించాయి. హమాలీలకు కూలీలు చెల్లించకపోవడంతో వారు పనులకు సరిగా రావడంలేదు. సంచుల కొరత లేకుండా చేసి, హమాలీలకు కూలీలు చెల్లించేలా కృషిచేస్తాం. 
– విష్ణువర్ధన్‌రెడ్డి, చైర్మన్, అలంపూర్‌ మార్కెట్‌ యార్డు చైర్మన్‌ 
 

Read latest Jogulamba News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top