ఇదంతా సమక్క–సారలమ్మ మహిమే

jayashankar bhupalpally joint collector interview - Sakshi

సాక్షి ప్రతినిధి, వరంగల్‌ : ‘గత జాతరలో ఐటీడీఏ పీఓ హోదాలో పనిచేశాను. కన్నెపల్లి నుంచి సారలమ్మను తీసుకువచ్చే విధుల్లో పాల్గొన్నాను. తల్లిని ఆలయం బయటకు తీసుకువచ్చే సమయంలో వచ్చే జాతరలో నీ సేవ చేసుకునే భాగ్యం కల్పించు అని మొక్కుకున్నా.. ఆ తర్వాత జిల్లాల విభజన కావడం జయశంకర్‌ జిల్లాకు నేను జాయింట్‌ కలెక్టర్‌గా నియమించబడ్డాను. అంతేకాదు జాతరకు ముందే నాకు ఐఏఎస్‌ హోదా వచ్చింది. ఇదంతా సమక్క–సారలమ్మ  మహిమే’ అని జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ అన్నారు. టీడీఏ పీఓగా, జాయింట్‌ కలెక్టర్‌గా రెండు సార్లు ఆయన జాతర విధులు నిర్వర్తించారు. ఈ జాతర అనుభవాలు, వచ్చే జాతరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జేసీ ‘సాక్షి’ వివరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే...

కలిసికట్టుగా పని చేశారు...
జాతర నిర్వహణకు సరిపడా ఉద్యోగులు జయశంకర్‌ జిల్లాలో ఉన్నారు. అయితే వీరికి జాతరలో పని చేసిన అనుభవం లేదు. అందువల్లే ఇతర జిల్లాల నుంచి అధికారులు, సిబ్బందిని రప్పించాం. అందరు ఇది మన జాతర అన్నట్లుగా పని చేశారు. ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారికి సరైన వసతి, సమయానికి భోజనం అందించాం. ఎవరు ఏ విధులు నిర్వహించాలో చెప్పాం. అంతా కలిసికట్టుగా పని చేశారు. అంతేకాదు వచ్చే జాతరకు అనుగుణంగా జిల్లాలో ఉన్న 400 మంది ప్రభుత్వ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చాం. వచ్చే జాతర పూర్తిగా జయశంకర్‌ జిల్లా అధికార యంత్రాంగంతో పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందిస్తాం.
 

నెల రోజుల ముందే...
గతంతో పోల్చితే మేడారం భక్తుల సంఖ్య పెరిగిపోయింది. జాతరకు నెల రోజు ముందు నుంచే పెద్ద సంఖ్యలో వస్తున్నారు. దీనికి అనుగుణంగా భక్తుల కోసం ఏర్పాటు చేస్తున్న సౌకర్యాలన్నీ నెల రోజులు మందుగానే పూర్తి చేయాలి. అంతేకాదు ఇక నుంచి జాతరకు వచ్చే వీఐపీల సంఖ్య పెరుగుతుంది. వీఐపీల రాక సందర్భంగా భక్తుల క్యూ లైన్లను ఆపేయాల్సి వస్తుంది. దీంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు. వీఐపీలు, భక్తులు ఒకే సారి దర్శనం చేసుకోవాల్సి వస్తే.. భక్తులు గద్దెల మీదకు బెల్లం విసరకుండా చూడాలి. దీని కోసం భక్తులకు అవగాహన కల్పించాలి. వీఐపీ దర్శనాలకు ప్రత్యేక టైమ్‌ కేటాయించడం లేదా ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలి.

సౌకర్యాలు పెరగాలి..
జాతర సందర్భంగా ప్రతీసారి తాత్కాలిక ఏర్పాట్ల కోసం కోట్లాది రూపాయల నిధులు ఖర్చు చేస్తున్నాం. ఇకపై శాశ్వత ప్రతిపాదికన ఏర్పాటు చేయాలి. జాతర సమయంలో సిబ్బంది బస చేసేందుకు విరివిగా డార్మిటరీలు నిర్మించాలి. సాధారణ రోజుల్లో వీటిని భక్తులకు ఇవ్వాలి. ప్రస్తుతం ఉన్న బ్యాటరీ ఆఫ్‌ ట్యాప్స్‌ వల్ల నీటి వృథాతో పాటు జాతర పరిసరాల్లో బురద ఎక్కువ అవుతోంది. దీన్ని నివారించేందుకు ఓవర్‌ హెడ్‌ ట్యాంక్‌ల ద్వారా నీటి సరఫరా చేయాలి. చెత్త నిర్వహణకు డంపింగ్‌ యార్డులు ఏర్పాటు చేయాలి. కోళ్లు, మేకల వ్యర్థాల కోసం ఇన్సులేటర్లు అందుబాటులో ఉంచాలి. 

ఇంటింటికీ వైద్యం...
గతంలో జాతర తర్వాత మేడారం పరిసర ప్రాంత ప్రజల కోసం మెడికల్‌ క్యాంపులు నిర్వహించే వాళ్లు. ఈసారి ఇంటింటికి వైద్య సిబ్బంది వెళ్లి పరీక్షలు నిర్వహించేలా మార్పులు చేశాం. ఎవరికైనా అనారోగ్యం ఉంటే అక్కడే చికిత్స అందిస్తున్నారు. జాతర తర్వాత 15 రోజుల వరకు పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించాం. టాయిలెట్ల నిర్మాణం కోసం నిర్మించిన బేస్‌మెంట్లను ప్రభుత్వ యంత్రాంగం ద్వారా తొలగిస్తాం. రైతులకు ఎటువంటి ఇబ్బంది రానివ్వం. 

Read latest Jayashankar News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top