సామాజిక మీడియా సంస్థ ఫేస్ బుక్ వచ్చిన ఆరోపణలపై సంస్థ వ్యవస్థాపకుడు సీఈవో మార్క్ జుకర్ బర్గ్ రంగంలోకి దిగారు. రాజకీయ పక్షపాతం చూపిస్తున్నారంటూ చెలరేగిన దుమారంపై ఆయన ఫేస్ బుక్ లో వివరణ ఇచ్చారు
	శాన్ ఫ్రాన్సిస్కో:   సామాజిక మీడియా సంస్థ ఫేస్ బుక్ పై చెలరేగిన ఆరోపణలపై సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో మార్క్ జుకర్ బర్గ్ రంగంలోకి దిగారు.  రాజకీయ పక్షపాతం  చూపిస్తున్నారంటూ రాజుకున్న వివాదంపై ఆయన  ఫేస్ బుక్ లో వివరణ ఇచ్చారు.  ట్రెండింగ్ టాపిక్స్ పై గోల్ మాల్ జురుగుతోందన్న ఆరోపణలపై ఆయన స్పందించారు.  ఈ మేరకు ఆయన కన్సర్వేటివ్  పార్టీ నేతలతో సమావేశం  అయ్యేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. తమ సంస్థ పని తీరు తదితర  అంశాల గురించి కొన్ని ఆలోచనలను షేర్   చెయ్యాలనుకుంటున్నా నంటూ ఫేస్ బుక్ లో తన భావాలను  పంచుకున్నారు.
	
	తమ సంస్థ  ఫేస్బుక్  ప్రపంచంలో ప్రతీ ఒక్కరికీ ఒక స్వరాన్ని అందిస్తుందని పేర్కొన్నారు.  వివిధ రకాల నేపథ్యాల ఆలోచనలను,  ప్రజల అనుభవాలను పంచుకున్నపుడే ఆ ప్రపంచం బావుంటుందని తాము నమ్ముతామన్నారు.  అదే  సోషల్ మీడియాను  విశ్వవ్యాప్తం చేస్తుందని తెలిపారు. ఈ విషయంలో తాము ఎలాంటి వివక్ష చూపడం లేదన్నారు.  ఒక తల్లీ బిడ్డ ఫోటోఅయినా,   మేధో విశ్లేషణ అయినా తమకు సమానమే అని స్పష్టం చేశారు. అన్ని ఆలోచనా ధోరణలకు తమ  సంస్థ ఫేస్ బుక్  ప్లాట్ ఫాంగా నిలవడానికి తాము కట్టుబడి ఉన్నామన్నారు. ట్రెండింగ్ టాపిక్స్ డిజైన్ కఠినమైన మార్గదర్శకాలతో, విశ్వసనీయతతో కూడుకుందనీ, ఇందులో ఎలాంటి ప్రాముఖ్యతలకు, రాజకీయ భావాల అణచివేత ధోరణికి తావులేదని  పేర్కొన్నారు. అలాంటి చర్యలను తాము అనుమతించమని తెలిపారు.
కన్సర్వేటివ్ పార్టీ భావాలను తొక్కి పెడుతున్నామన్న ఆరోపణలు తమ దృష్టికి వచ్చాయనీ, దీనిపై పూర్తి స్తాయిలో విచారణ జరుగుతోందన్నారు. తమ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా జరుగుతున్నట్టు తేలితే... సంబంధిత చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఇకముందు కన్సర్వేటివ్ నాయులు, ఇతర రాజకీయ నాయకులు తనతో మాట్లాడాలని ఆహ్వానించారు.
	
	కాగా  టెక్నాలజీ న్యూస్ వెబ్ సైట్ గిజ్ మోడో  ఫేస్ బుక్ ఉద్యోగులు ట్రెండింగ్ కథనాలను ప్రభావితం చేస్తున్నారని, కన్సర్వేటివ్ పార్టీకి అనుగుణమైన స్టోరీలను అణచివేస్తున్నారంటూ కథనాన్ని ప్రచురిచింది.  దీంతో   అమెరికాలోని పలువురు రాజకీయవేత్తలు, జర్నలిస్టులు ఫేస్ బుక్ పై మండిపడ్డారు.  విచారణ జరిపి, చర్యలు తీసుకోవాలని కోరారు.  ఈ ఆరోపణలపై జుకర్ వివరణ యివ్వాలని కూడా డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో  దీనిపై విచారణకు అదేశించిన  జుకర్, ఉద్యోగులకు కొన్ని మార్గదర్వకాలను జారీ  చేసినట్టు సమాచారం.
	 

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
