ప్రపంచంలోనే అత్యంత ముసలి కుక్క మరణం! | Sakshi
Sakshi News home page

ప్రపంచంలోనే అత్యంత ముసలి కుక్క మరణం!

Published Wed, Apr 20 2016 12:07 PM

ప్రపంచంలోనే అత్యంత ముసలి కుక్క మరణం! - Sakshi

సాధారణంగా కుక్కలు 8 నుంచి 15 ఏళ్ల వరకు బతుకుతాయి. కానీ ఆస్ట్రేలియాలోని నైరుతి విక్టోరియా ప్రాంతంలో 30 ఏళ్లపాటు బతికిన ఓ కుక్క బుధవారం మరణించింది. మాగీ అనే ఈ శునకం చనిపోయి ఉండటాన్ని దాని యజమాని బ్రియాన్ మెక్‌లారెన్ గమనించారు. గత వారం కూడా అది బాగానే ఉందని, పిల్లులను చూసి గట్టిగా మొరిగిందని ఆయన చెప్పారు. బుధవారం ఉదయం చూస్తే అది చనిపోయి ఉందని, దాంతో తాను చాలా బాధపడుతున్నానని అన్నారు. అయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా సునాయాస మరణం వచ్చినందుకు మాత్రం కాస్త ఊరటగా ఉందన్నారు.

తన పెంపుడు శునకానికి 30 ఏళ్లు ఉన్నట్లు మెక్‌లారెన్ చెబుతున్నా, దానికి సంబంధించిన ఆధారాలు ఏవీ లేవు కాబట్టి దాని సరైన వయసు ఎంతో నిర్ధారణ కాలేదు. తన చిన్నకొడుకు నాలుగేళ్ల పిల్లాడిగా ఉన్నప్పుడు ఆ కుక్కపిల్లను తెచ్చినట్లు మెక్‌లారెన్ చెబుతున్నారు. అతడికి ఇప్పుడు 34 ఏళ్లు. దాంతో ఆ కుక్క వయసు 30  ఏళ్లని అంటున్నారు. తామిద్దరం చాలా మంచి స్నేహితులమని అన్నారు. చెవులు వినిపించకపోయినా అది మాత్రం అతడి పొలానికి కాపలా ఉంటోంది. గత సంవత్సరం అక్టోబర్ నెలలో అది రోడ్డుమీద పడుకొని ఉండగా.. ఓ వాహనం కొట్టేయడంతో బాగా రక్తం పోయింది. కానీ ఎలాగోలా బతికింది.

Advertisement
Advertisement