ఎంఎస్ఎంఈలకు ప్రపంచ బ్యాంకు భారీ సాయం

World Bank and Government of India sign  usd750 million Agreement for  for MSMEs - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి, లాక్‌డౌన్‌ కారణంగా తీవ్రంగా ప్రభావితమైన సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ప్రపంచ బ్యాంకు భారీ సాయాన్ని ప్రకటించింది. వాటికి ద్రవ్య లభ్యత లభించేందుకు 750 మిలియన్ డాలర్లు(సుమారు 5,670 కోట్ల రూపాయలు) పైగా సహకారం అందించే ఒప్పందంపై సంతకం చేసింది. ఈ ఒప్పందంపై ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్థిక వ్యవహారాల శాఖ అదనపు కార్యదర్శి సమీర్ కుమార్ ఖరే, ప్రపంచ బ్యాంకు భారత డైరెక్టర్ జునైద్ అహ్మద్ సంతకం చేశారు.

ప్రస్తుత సంక్షోభంనుంచి తట్టుకోవడంతోపాటు, మిలియన్ల ఉద్యోగాలను రక్షించడంలోనూ, తక్షణ ద్రవ్య భ‍్యత, ఇత రుణ అవసరాల నిమిత్తం 1.5 మిలియన్ల సంస్థలకు ఇది సాయపడుతుందని తెలిపింది. ఎంఎస్ఎంఈ రంగాన్ని ఇబ్బందులనుంచి గట్టెక్కించడానికి అవసరమైన చర్యల్లో ఇది ​​మొదటి అడుగు అని ప్రపంచ బ్యాంకు ప్రకటించింది. మహమ్మారి ఎంఎస్ఎంఈ  రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేసిందని, ఫలితంగా జీవనోపాధి, ఉద్యోగాలు కోల్పోతున్నారని ఖరే చెప్పారు. సంక్షోభం నుండి బయటపడేందుకు ఎంఎస్ఎంఈ రుణ ప్రణాళికను ప్రకటించామని చెప్పారు. జునైద్ అహ్మద్ మాట్లాడుతూ, ఎంఎస్ఎంఈ  రంగం భారతదేశం  వృద్ధికి, ఉద్యోగ కల్పనకు కేంద్రంగా ఉందని పేర్కొన్నారు.  (భారత్‌కు మరోసారి ప్రపంచ బ్యాంకు భారీ సాయం)

కరోనా అనంతరం ఆర్ధిక పునరుద్ధరణకు ఈ రంగానికి ద్రవ్యలభ్యత తక్షణ అవసరమని ఆయన తెలిపారు. మొత్తం ఫైనాన్సింగ్  వ్యవస్థను బలోపేతం చేయడం కూడా అంతే ముఖ్యమని పేర్కొన్నారు. ప్రధానంగా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు(ఎన్‌బిఎఫ్‌సి) స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు (ఎస్‌సిబి)ల రుణ సామర్థ్యాన్ని పెంచాలని, దీంతో ఎంఎస్ఎంఈ ఆర్థిక సమస్యల పరిష్కారంలో ఇవి సమర్ధవంతమైన పాత్ర పోషిస్తాయని అన్నారు.

కాగా కరోనా నేపథ్యంలో భారత సామాజిక, వైద్య రంగాలకు ప్రపంచ బ్యాంకు ఇప్పటికే 2.75 బిలియన్ డాలర్ల ఫండింగ్ ప్రకటించింది. వీటికి అదనంగా ప్రస్తుతం ప్రకటించిన మొత్తాన్ని ఎంఎస్ఎంఈల కోసం ఇస్తామని ప్రపంచ బ్యాంకు తెలిపింది. ఈ లోన్ మెచ్యూరిటీ 19 ఏళ్లతో 5 ఏళ్ల గ్రేస్ పీరియడ్ కలిగి ఉంటుందని చెప్పారు.  భారతదేశ ఆరోగ్య రంగానికి తక్షణ మద్దతు కోసం ఈ ఏడాది ఏప్రిల్‌లో ఒక బిలియన్‌ డాలర్ల అత్యవసర సహాయాన్ని ప్రకటించింది. అలాగే  పేదలు, బలహీన వర్గాలకు నగదు బదిలీ, ఆహార ప్రయోజనాల నిమిత్తం  మే నెలలో మరో  బిలియన్ డాలర్లను ప్రకటించిన సంగతి తెలిసిందే.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top