అక్కడ బురఖా ధరిస్తే ఆరున్నర లక్షల ఫైన్ | Sakshi
Sakshi News home page

అక్కడ బురఖా ధరిస్తే ఆరున్నర లక్షల ఫైన్

Published Wed, Nov 25 2015 4:06 PM

అక్కడ బురఖా ధరిస్తే ఆరున్నర లక్షల ఫైన్ - Sakshi

బెర్న్: బహిరంగ ప్రదేశాల్లో ముఖం కనిపించకుండా బురఖాలు ధరించడాన్ని స్విడ్జర్లాండ్లోని టిసినో రాష్ట్రం నిషేధించింది. 2013, సెప్టెంబర్లో బురఖాలపై స్థానిక ప్రభుత్వం రెఫరెండమ్ నిర్వహించింది. అందులో ప్రతి ముగ్గురిలో ఇద్దరు బహిరంగ ప్రదేశాల్లో ముస్లిం మహిళలు బురఖాలు ధరించడాన్ని నిషేధించాలనే రెఫరెండమ్కు సానుకూలంగా ఓటు వేశారు. ఇప్పడు ఆ రెఫరెండమ్ ప్రకారం తీసుకొచ్చిన చట్టాన్ని టిసినో రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. ఇలా బురఖాలను నిషేధించడం ఫెడరల్ చట్టానికి వ్యతిరేకం కాదని కేంద్ర ప్రభుత్వం కూడా సమర్థించింది. నిషేధాన్ని ఉల్లంఘించి ముఖం కనపడకుండా బురఖాలు ధరించిన పక్షంలో ఆరున్నర వేల రూపాయల నుంచి ఆరున్నర లక్షల రూపాయల వరకు జరిమానా విధిస్తారు.


ఎప్పటి నుంచి ఈ చట్టాన్ని అమలులోకి తీసుకొచ్చేది మాత్రం స్థానిక ప్రభుత్వం వెల్లడించలేదు. దుకాణాలు, మాల్స్, రెస్టారెంట్లు, ప్రభుత్వ కార్యాలయాలు తదితర ప్రదేశాల్లో బురఖాలు ధరించకుండా చట్టం తీసుకొచ్చామని, ఈ చట్టం గురించి పర్యాటకుల్లో అవగాహన కల్పించేందుకు విమానాశ్రయాల్లోనే వారికి ముందుగా తెలియజేస్తామని రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి ఒకరు తెలియజేశారు. బురఖా ముసుగుల్లో టెర్రరిస్టు కార్యకలాపాలు, దోపిడీలు, దొంగతనాలకు పాల్పడకుండా నిరోధించడం కోసమే ఈ చట్టాన్ని తీసుకొచ్చింది.


బహిరంగ ప్రదేశాల్లో బురఖాలు ధరించడాన్ని నిషేధించిన దేశాల్లో స్విడ్జర్లాండ్ మొదటిదేమీ కాదు. ఫ్రాన్స్ 2010లోనే ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. చట్టాన్ని ఉల్లంఘిస్తే ఆ దేశంలో 3,500 నుంచి 15,000 రూపాయల వరకు జరిమానా విధిస్తారు.

Advertisement
Advertisement