అమెరికాలో మహిళ కాల్పులు: పలువురు మృతి | Woman kills many in US' Baltimore mass shooting | Sakshi
Sakshi News home page

అమెరికాలో మహిళ కాల్పులు: పలువురు మృతి

Sep 21 2018 4:58 AM | Updated on Apr 4 2019 3:25 PM

Woman kills many in US' Baltimore mass shooting - Sakshi

వాషింగ్టన్‌: అమెరికాలో మరోసారి కాల్పులు అలజడి సృష్టించాయి. బాల్టిమోర్‌ పట్టణంలో గురువారం గుర్తుతెలియని మహిళ విచ్చలవిడిగా కాల్పులు జరపడంతో పలువురు మృతిచెందగా, మరికొందరు గాయపడినట్లు తెలిసింది. నిందితురాలు స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు. ఔషధాలను నిల్వ ఉంచిన గోదాము వద్ద ఉదయం జరిగిన ఈ దాడిలో ముగ్గురు మరణించగా, ఇద్దరు గాయపడినట్లు స్థానిక మీడియాలో వార్తలొచ్చాయి.

హర్‌ఫోర్డ్‌ కౌంటీ పోలీసు అధికారి జెఫ్రీ గెహ్లార్‌ వివరాలు వెల్లడిస్తూ మృతులు, క్షతగాత్రుల సంఖ్యను ధ్రువీకరించలేదు. నిందితురాలి వద్ద ఒకటే తుపాకి ఉందని, సంఘటనా స్థలానికి చేరుకున్న భద్రతా బలగాలు ఆమెను నిలువరించే క్రమంలో కాల్పులకు దిగలేదని తెలిపారు. కౌంటీకి ఉగ్రముప్పు లేదని స్పష్టం చేశారు. కాలిఫోర్నియాలోని యూట్యూబ్‌ ప్రధాన కార్యాలయంలో ఇరాన్‌ మహిళ ముగ్గురిని కాల్చి చంపి తనని తాను కాల్చుకున్న సుమారు ఐదు నెలల తరువాత మరో మహిళ అమెరికాలో తుపాకితో విధ్వంసం సృష్టించింది. 

Advertisement
 
Advertisement
Advertisement