తొక్కిసలాట ఘటనలో ఏడుగురి అరెస్టు | Kolkata Durga Puja Stampede Incident | Sakshi
Sakshi News home page

తొక్కిసలాట ఘటనలో ఏడుగురి అరెస్టు

Oct 19 2026 9:45 AM | Updated on Oct 19 2026 9:59 AM

Kolkata Durga Puja Stampede Incident

ఆప్తులను కోల్పోయి రోదిస్తున్న బాధితులు, - నిందితులను కోర్టుకు తీసుకొస్తున్న పోలీసులు(ఇన్‌సైడ్‌)

నిందితుల్లో పూజా కమిటీ సభ్యులు, సెక్యూరిటీ ఏజెన్సీ ఉద్యోగులు

19కి చేరిన మృతుల సంఖ్య

అన్ని మండపాల వద్ద భద్రత పెంపు

వీఐపీ గేట్ల రద్దు యోచన

ఘటనపై సమగ్ర దర్యాప్తునకు సిట్‌ ఏర్పాటు

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో దుర్గామాత మండపం వద్ద తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య 19కి చేరుకుంది. మృతదేహాలను గుర్తించే ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. 25 మంది గాయపడ్డారు. ఈ దుర్ఘటనపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. చోర్‌బగన్‌ దుర్గా పూజ మండపం నిర్వాహకులతోపాటు ఏడుగురిని అరెస్టు చేసినట్లు అదివారం ప్రకటించారు. సుమోటోగా కేసు నమోదు చేసినట్లు చెప్పారు. దర్యాప్తులో భాగంగా శనివారం రాత్రి 14 మందిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. ఏడుగురిని అరెస్టు చేశామని, మరికొన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని వెల్లడించారు.

పూజా మండపం కమిటీ కార్యదర్శి రాజ్‌కుమార్‌ సియోదా, ఉపాధ్యక్షుడు శంతను దూబే, ఇద్దరు ప్రైవేట్‌ సెక్యూరిటీ ఏజెన్సీ ఉద్యోగులతో పాటు మరికొందరు నిర్బంధంలోకి తీసుకున్నామని పోలీసులు వివరించారు. ఏడుగురు నిందితులను పోలీసులు ఆదివారం స్థానిక కోర్టులో హాజరుపర్చారు. వారిని తమ కస్టడీకి అప్పగించాలని కోర్టును కోరారు. దుర్గా మాత మండపం వద్ద తొక్కిసలాట నేపథ్యంలో బెంగాల్‌ ప్రభుత్వం అప్రమత్తమైంది.

రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన దుర్గా పూజా మండపాల వద్ద భద్రతా ఏర్పాట్లను సమీక్షించేందుకు ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ ఆదివారం కోల్‌కతాలోని పలు మండపాలను తనిఖీ చేసింది. భద్రతా ఏర్పాట్లను పరిశీలించింది. కమిటీలో విపత్తు నిర్వహణ శాఖ కార్యదర్శి రాజే‹Ù, అగ్నిమాపక సేవల డైరెక్టర్‌ జనరల్‌ అనుజ్‌ శర్మ, ఎస్‌టీఎఫ్‌ డీజీపీ జావేద్‌ షమీమ్‌ సభ్యులుగా ఉన్నారు.

బాధితులకు అమిత్‌ షా పరామర్శ
తొక్కిసలాటలో గాయపడి కోల్‌కతాలో ఒక ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 14 మంది బాధితులను కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఆదివారం పరామర్శించారు. వైద్యులతో మాట్లాడారు. బాధితుల ఆరోగ్య పరిస్థితి, వారికి అందుతున్న చికిత్స గురించి అడిగి తెలుసుకున్నారు. ముగ్గురు క్షతగాత్రులతో అమిత్‌ స్వయంగా మాట్లాడారు. ధైర్యంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. అంతకుముందు కోల్‌కతాలో కాళీఘాట్‌ ఆలయాన్ని అమిత్‌ షా సందర్శించారు.

రూ.25 లక్షల పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం
తొక్కిసలాటలో మరణించిన వారి కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం, గ్రూప్‌–డి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి సువేందు అధికారి ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.5 లక్షలు చొప్పున అందజేస్తామని చెప్పారు. వారి వైద్య ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని అన్నారు.

తొక్కిసలాటపై సమగ్ర విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్‌) ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అక్కడ విధుల్లో ఉన్న తాత్కాలిక హోంగార్డులు నిర్లక్ష్యంగా ఉన్నారా? అనే కోణంలోనూ దర్యాప్తు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. దుర్గాపూజ మండపాల వద్ద వీఐపీ గేట్లను ఏర్పాటు చేసే పద్ధతిని రద్దు చేయాలని యోచిస్తున్నట్లు సీఎం తెలిపారు. భక్తుల ప్రవేశం, నిష్క్రమణ కోసం కచ్చితమైన ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు.

మండపం కూలబోతోందంటూ అనౌన్స్‌మెంట్‌!
మండపం కూలిపోయే స్థితిలో ఉందని, ప్రజలను ఖాళీ చేయాలంటూ కోరుతున్న ప్రకటనకు సంబంధించిన వీడియో ఫుటేజ్‌ లభించిందని, ఆ ప్రకటన ఎవరు చేశారో గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసు ఉన్నతాధికారి వెల్లడించారు. దుర్గామాత మండపం వద్ద అకస్మాత్తుగా భారీ వర్షం కురవడం, ఆ తర్వాత జనసమూహాన్ని నియంత్రించడంలో నిర్వాహకులు విఫలం కావడం, తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేయడం, దాంతో భక్తుల్లో గందరగోళం నెలకొనడంతో తొక్కిసలాట జరిగినట్లు భావిస్తున్నామని పోలీసు అధికారి తెలిపారు.

ఘటనా స్థలంలో పోలీసు సిబ్బంది, ప్రైవేట్‌ సెక్యూరిటీ గార్డులు తగినంత మంది లేకపోవడం వల్ల పరిస్థితి మరింత దిగజారినట్లు గుర్తించారు. సీసీటీవీ కెమెరా ఫుటేజీని సేకరించామని, స్థానికులు, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేశామని వివరించారు. తొక్కిసలాట సమయంలో ప్రవేశ ద్వారం గుండా బయటకు వెళ్లిపోవడానికి జనమంతా ఒకేసారి ఎగబడ్డారని, ఆ దారి ఇరుకుగా ఉండటం ప్రమాదానికి కారణమైందని పేర్కొన్నారు. ప్రవేశం, నిష్క్రమణ, జనసమూహం కదలికలకు సంబంధించి సరైన సమాచారం లేకపోవడంతో గందరగోళానికి వారు గురయ్యారని తెలిపారు.  మండపానికి ఆనుకుని ఉన్న రహదారులపై సెక్షన్‌ 163 కింద నిషేధాజ్ఞలు విధించారు. వేదిక చుట్టూ ఉన్న రహదారులపై ప్రజలు గుమికూడకుండా నిషేధించారు.

ప్రభుత్వ వైఫల్యం వల్లే: టీఎంసీ
ఘటనపై విపక్ష తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ప్రభుత్వ వైఫల్యం వల్లే ఈ దుర్ఘటన జరిగినట్లు ఆరోపించింది. జన సమూహ నియంత్రణకు ఏర్పాట్లు చేయకపోవడం, పోలీసుల కొరత, అత్యవసరంగా స్పందించే వ్యవస్థ లేకపోవడంతో భక్తులు ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది. ఈ మేరకు ఆదివారం సోషల్‌ మీడియాలో పోస్టుచేసింది. తొక్కిసలాట జరిగిన ప్రదేశంలో తగినంత మంది పోలీసు సిబ్బంది, పౌర వాలంటీర్లు, అంబులెన్సులు లేవని విమర్శించింది. పూజా నిర్వహణ కమిటీలో ముఖ్యమంత్రి సువేందు మేనల్లుడు దేవదీప్‌ సైతం ఉన్నారని తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత అభిõÙక్‌ బెనర్జీ వెల్లడించారు.

మళ్లీ దుర్గా పూజ చేసుకోబోం
తొక్కిసలాటలో మృతిచెందినవారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. మృతదేహాలను తీసుకెళ్లేందుకు ఆదివారం ఆసుపత్రికి చేరుకున్నారు. కొందరు దుఃఖంతో మాటలు రాక నిశ్చేష్టులయ్యారు. మరికొందరు ఇక తిరిగిరాని తమ ఆప్తులను స్మరించుకుంటూ కన్నీరు పెట్టుకున్నారు. తమ జీవితంలో మళ్లీ దుర్గా పూజ ఉండదని అన్నారు. ఈసారి పండుగ ఎప్పటికీ మర్చిపోలేని చేదు జ్ఞాపకాలనే మిగిల్చిందని ఆవేదన వ్యక్తచేశారు.

ఇదీ చదవండి: తమిళనాట ​వర్ష బీభత్సం.. చెన్నై సహా పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement