శ్రీలంక శాటిలైట్‌కు ‘రావణ’ పేరెందుకు?

Why Sri Lanka Named Its First Ever Satellite After Ravana - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : శ్రీలంక ఇటీవల అంతరిక్షంలోకి విజయవంతంగా ప్రయోగించిన మొట్ట మొదటి ఉపగ్రహంకు ‘రావణ’ అని ఎందుకు నామకరణం చేసింది. రామాయణ కాలంనాటి  రావణాసురుడి పాత్రను నిజంగా ఆరాధిస్తోందా? అక్కడి సింహళ–బౌద్ధులు రావణుడిని తమ హీరోగా ఎందుకు పేర్కొంటున్నారు? ఎప్పటి నుంచి ? రాముడిని కూడా ఓ ఆయుధంగా చేసుకొని భారత్‌లో  అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వాన్ని కవ్వించడం కోసం ఉపగ్రహంకు రావణ పేరును ఖరారు చేసిందా?

దాదాపు నాలుగు దశాబ్దాల పాటు ఎల్‌టీటీఈ తీవ్రవాదులతో అవిశ్రాంత యుద్ధం చేసి విజయం సాధించిన శ్రీలంక ప్రభుత్వం శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంపై దృష్టి సారించి ఓ ఉపగ్రహాన్ని తయారు చేసింది. దానికి ‘రావణ–1’గా నామకరణం చేసి జూన్‌ 19వ తేదీన విజయవంతంగా అంతరిక్షంలోకి పంపించింది. ఎక్కువ మంది భారతీయుల దృష్టిలో రావణుడు ఓ దుష్ట రాజు. అతను రాముడి చేతుల్లో మరణిస్తాడు. శ్రీలంక మెజారిటీలైన సింహళీయులు కూడా రాముడి చేతుల్లోనే రావణుడు మరణించారని నమ్ముతున్నారు. రావణుడి సోదరుడైన విభూషణడి కుట్ర వల్ల రావణుడు మరణిస్తారని, రావణాసురుడు రాముడికన్నా మంచి రాజని వారు నమ్ముతున్నారు. వారేకాకుండా తమిళనాడులో ద్రావిడ ఉద్యమకారులు కూడా రావణుడినే తమ ద్రవిడ హీరోగా పరిగణిస్తూ వచ్చారు. రాముడిని వారు ఆర్యుడిగానే ద్వేషించారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి సీఎన్‌ అన్నాదురై కూడా రావణుడినే హీరోగా కీర్తించారు. ఒకరకంగా ద్రావిడ ఉద్యమానికి రావణుడి పాత్రే స్ఫూర్తినిచ్చింది.


2,500 సంవత్సరాల క్రితం జరిగినట్లు చెబుతున్న రామాయణంకు సంబంధించి కొన్ని వందల పుస్తకాలు ఉన్నాయని, అవన్నీ కూడా వాల్మికీ సంస్కృతంలో రాసిన రామాయణం మహా కావ్యానికి భిన్నంగానే ఉన్నాయని ప్రముఖ విద్యావేత్త ఏకే రామానుజన్‌ చెప్పారు. ఒక్క భారత్‌లోని కేరళలోనే 29 రకాల రామాయణాలు ఉన్నాయి. వాటిలో కూడా కొన్ని రావణుడినే హీరోగా పేర్కొన్నాయి. రామాయణం నిజంగా జరిగినట్లు చెప్పడానికి సరైన చారిత్రక ఆధారాలు లేకపోవడం వల్ల అన్ని రామాయణ పుస్తకాలు పుట్టుకొచ్చాయన్నది చరిత్రకారుల వాదన. అసలు రామాయణం పేర్కొన్న లంక, శ్రీలంక కాకపోవచ్చని, నీటితో చుట్టుముట్టి ఉన్న దీవులన్నింటినీ లంకలుగా వ్యవహరిస్తారన్నది కూడా వారి వాదనే.

1940 సింహళ–తమిళుల ఘర్షణ
శ్రీలంకలో మెజారిటీలైన సింహళులు, మైనారిటీలైన తమిళుల మధ్య 1940 దశకంలోనే ఘర్షణలు మొదలయ్యాయి. తాము ఆదివాసులమని, తామే శ్రీలంకకు అసలైన వారసులమన్న వాదనను సింహళీయులు తీసుకొచ్చారు. పరభాషా ప్రభావాన్ని తొలగించి ఆ భాషను శుద్ధి చేయాలనే లక్ష్యంతో సాహితీవేత్త కుమారతుంగ మునిదాస 1941లో ‘హేల అవులా’ అన్న సాహితీ సంస్థను ఏర్పాటు చేశారు. ఆ సంస్థ సింహళ భాషాభివృద్ధికి కృషి చేయడంతోపాటు సంసృతిని పునరుద్ధరించడంలో భాగంగా రావణ రాజును తీసుకొచ్చింది. సింహళీలులకు హీరోగా పేర్కొంటు రచనలను మొదలుపెట్టింది. అయినా అనుకున్న స్థాయిలో ఫలితం రాలేదు.

1987లో భారత శాంతి దళం ప్రవేశంతో
శ్రీలంక ప్రభుత్వాన్ని ముప్పు తిప్పలు పెడుతున్న ఎల్‌టీటీఈ తీవ్రవాదులను అణచివేసేందుకు 1987లో భారత శాంతి పరిరక్షక దళం శ్రీలంకలో అడుగుపెట్టింది. అప్పుడు దానికి వ్యతిరేకంగా రామాయణాన్ని దృష్టిలో పెట్టుకొనే ‘మంకీ ఆర్మీ’ వచ్చిందంటూ వామపక్ష భావాలు కలిగిన ‘జనతా విముక్తి పెరమున’ అనే సంస్థ పోస్టర్లను వేసింది. అప్పటికే భారత పట్ల వ్యతిరేకత చూపే సింహళ–బౌద్ధులు రావణుడిని హోరాగా చేస్తూ అనేక నాటకాలు వేయడం ప్రారంభించారు. ఆ తర్వాత టీవీ, రేడియోల్లో కూడా రావణడిపై నాటకాలు, రూపకాలు, పాటలు ప్రసారమయ్యాయి. పుస్తకాలు, వ్యాసాలూ వెలువడ్డాయి. 2009లో ఎల్‌టీటీఈ ఓడిపోయి భారత దళాలు వెనక్కి వెళ్లిపోయాక వీధి వీధిన రావణుడి విగ్రహాలు వెలిశాయి. ఆ తర్వాత ప్రత్యేక ఈలం గొడవ లేకపోవడంతో రావణుడిని పెద్దగా పట్టించుకోలేదు.

భారత్‌ పట్ల ద్వేషమా?
భారత్, శ్రీలంక మధ్య బలమైన సాంస్కృతిక, ఆర్థిక, నైసర్గిక సంబంధాలు ఉన్నాయి. ఇవి రాజకీయాలకు అతీతమైనవి. దౌత్య సంబంధాల విషయంలో ఇరు దేశ ప్రభుత్వాలు  ఒకటి, రెండు సందర్భాల్లో మినహా తమ రాజకీయాలను పక్కన పెట్టి వ్యవహరించాయి. వ్యవహరిస్తున్నాయి. కనుక మన ప్రభుత్వం పట్ల వ్యతిరేకతతో ‘రావణ’ పేరును ఖరారు చేయలేదు. మెజారిటీలైన సింహళీయులు హీరోగా రావణుడి పరిగణించడం ఒక కారణమైతే, అసలు కారణం మరోటి ఉంది. రావణుడి కాలంలో పుష్పక విమానం ఉంది కనుక, అప్పటికే తమకు అంతటి శాస్త్ర పరిజ్ఞానం ఉందని గుర్తు చేయడంలో భాగంగా ‘రావణ’ పేరు పెట్టారని కొలంబో యూనివర్శిటీ చరిత్ర విభాగం సీనియర్‌ లెక్చరర్‌ నిర్మల్‌ రంజిత్‌ దేవసిరి తెలిపారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top