కరోనా: ఊపిరితిత్తుల పరిస్థితి ఇది.. తస్మాత్‌ జాగ్రత్త!

Video Shows Lungs Damage Of Man Infcted By Corona Virus - Sakshi

వాషింగ్టన్‌: ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి తన విస్త్రృతిని పెంచుకుంటూ పోతోంది. తీవ్రస్థాయిలో విజృంభిస్తూ ప్రజలను బెంబేలెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో చాలా దేశాలు అత్యవసర పరిస్థితి విధించగా.. పలు దేశాలు లాక్‌డౌన్‌ ప్రకటించాయి. అయితే కొంత మంది ప్రజలు మాత్రం లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘిస్తూ ఈ మహమ్మారికి ఎదురువెళ్తున్నారు. ప్రాణాలు కోల్పోయే దుస్థితి తెచ్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కరోనా తీవ్రతను ప్రజల కళ్లకు కట్టేలా.. అమెరికాలోని జార్జ్‌ వాషింగ్టన్‌ యూనివర్సిటీ ఆస్పత్రి సర్జన్‌ డాక్టర్‌ కేత్‌ మార్ట్‌మన్‌ ఓ వీడియో షేర్‌ చేశారు. కరోనా సోకిన 59 ఏళ్ల వ్యక్తి ఊపిరి తిత్తులు ఎంతగా నాశనం అయ్యాయో తెలిపే 3డీ వీడియో ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. (‘ఊపిరి తిత్తులు ఇలాగే ఉక్కిరిబిక్కిరి అవుతాయి’ )

ఊపిరి తిత్తుల పరిస్థితి ఎలా ఉందో చూడండి..
‘‘ఇది 70 లేదా 80 ఏళ్ల వృద్ధుడిదో.. డయాబెటిక్‌ పేషెంట్‌తో కాదు. కొన్నాళ్ల క్రితం ఆరోగ్యంగా ఉన్న 59 ఏళ్ల వ్యక్తి రిపోర్టు. తనకు కేవలం బీపీ మాత్రమే ఉంది. అయితే కరోనా సోకి అతడి ఊపిరితిత్తులు ఇలా మారిపోయాయి. ఇందులో పసుపు రంగులో ఉన్న ప్రాంతం ఇన్‌ఫెక్షన్‌ సోకినది. వైరస్‌ అంతకంతకూ తన ప్రభావాన్ని పెంచుకుంటూ పోతోంది. దీంతో ఊపిరి తిత్తులు డ్యామేజ్‌ అయ్యాయి. శ్వాస వ్యవస్థపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇవి మళ్లీ పూర్వ స్థితికి రావాలంటే ఎంత సమయం పడుతుందో చెప్పలేం. ప్రస్తుతం అతడి పరిస్థితి సీరియస్‌గా ఉంది. వృద్ధులపై మాత్రమే కాదు యువతపై కూడా ఈ వైరస్‌ తన ప్రతాపాన్ని చూపించగలదు’’ అని వీడియోలో పేర్కొన్నారు.(కేవలం 5 నిమిషాల్లోనే కరోనా నిర్ధారణ!)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top