కరోనా: 5 నిమిషాల్లో పాజిటివ్‌.. 13 నిమిషాల్లో నెగటివ్‌

US Lab Unveils Small Size Portable 5 Minute Corona Virus Test - Sakshi

వాషింగ్టన్‌: ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్(కోవిడ్‌-19) నిర్ధారణ పరీక్షలు నిర్వహించుటకై అమెరికాకు చెందిన హెల్త్‌కేర్‌ సంస్థ అబాట్‌ లాబొరేటరీస్‌ అత్యాధునిక కిట్‌ను రూపొందించింది. మాలిక్యులర్‌ టెక్నాలజీని ఉపయోగించి చిన్నపాటి టోస్టర్‌ పరిమాణంలో ఉండే పోర్టబుల్‌ టెస్టింగ్‌ కిట్‌ను తయారు చేసింది. దీని ద్వారా కేవలం ఐదు నిమిషాల్లోనే ఒక వ్యక్తికి కరోనా సోకిందా లేదా అన్న విషయం బయటపడుతుందని శుక్రవారం పత్రికా సమావేశంలో సంస్థ పేర్కొంది. ఇక కరోనా నెగటివ్‌ ఫలితాన్ని ఈ కిట్‌ 13 నిమిషాల్లో వెలువరుస్తుందని తెలిపింది. అమెరికా ఆహార, డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌(ఎఫ్‌డీఏ) వచ్చే వారంలోగా వీటిని పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని తమను ఆదేశించినట్లు పేర్కొంది. (అమెరికా గ్లోబల్‌ ప్యాకేజీ.. భారత్‌కు ఎంతంటే.. )

ఈ సందర్భంగా అబాట్‌ అధ్యక్షుడు, సీఓఓ రాబర్ట్‌ ఫోర్డ్‌ మాట్లాడుతూ.. ‘‘ కోవిడ్‌-19 మహమ్మారిపై అన్ని వైపుల నుంచి పోరాటం చేస్తున్నాం. కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొనే యుద్ధంలో ఈ పోర్టబుల్‌ మాలిక్యులర్‌ టెస్టు ఎంతగానో ఉపకరిస్తుంది. వైరస్‌పై పోరాడేందుకు ముఖ్యమైన నిర్ధారణ పరీక్షల్లో త్వరితగతిన ఫలితాలు వెల్లడిస్తుంది’’అని పేర్కొన్నారు. కేవలం ఆస్పత్రులకే పరిమితం కాకుండా ఎక్కడైనా దీనిని తీసుకువెళ్లేందుకు వీలుగా టోస్టర్‌ సైజులో రూపొందించినట్లు వెల్లడించారు. అయితే ఈ కిట్‌ను ప్రజా బాహుళ్యంలోకి తెచ్చేందుకు ఎఫ్‌డీఏ నుంచి ఆమోదం లభించలేదని తెలిపారు. ఇక కరోనా వైరస్‌ను 50 నిమిషాల్లో నిర్ధారించే స్మార్ట్‌ఫోన్‌ ఆధారిత పోర్టబుల్‌ కిట్‌ను రూపొందించినట్లు బ్రిటన్‌ పరిశోధకులు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.(కరోనా నిర్ధారణ నిమిషాల్లోనే!)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top