నెటిజన్లను కంటతడి పెట్టిస్తున్న దృశ్యాలు

Venezuela Mother Sings Peru Streets Over Economic Crisis In Her Country - Sakshi

కరాకస్‌ : దక్షిణ అమెరికా దేశం వెనిజులాలో సంక్షోభం తారస్థాయికి చేరింది. ఆర్థికమాంద్యంతో కొట్టుమిట్టాడుతున్న వెనిజులా నుంచి లక్షలాది మంది పౌరులు పొట్టచేతబట్టుకుని... పెరు సహా ఇతర దేశాలకు శరణార్థులుగా వెళ్తున్నారు. తమకు వచ్చిన విద్యను ప్రదర్శిస్తూ చిల్లర పోగుచేసుకుంటూ దీనస్థితిలో కాలం వెళ్లదీస్తున్నారు. వెనిజులా అధ్యక్షుడు నికోలస్‌ మదురో వ్యవహారశైలి వల్లే ఆ దేశ పౌరులకు ఇలాంటి దుర్గతి పట్టిందంటూ ప్రతిపక్షాలతో పాటు మానవ హక్కుల సంఘాలు తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నాయి. ఈ క్రమంలో ఓ వెనిజులన్‌ మహిళ దీనస్థితిని కళ్లకుగట్టే వీడియోను ఐక్యరాజ్యసమితి శరణార్థుల హైకమిషనర్‌ మంగళవారం షేర్‌ చేసింది. ‘ మీరు ఈరోజు వినాల్సిన సుందరగానం ఇది’ అంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసిన ఆ వీడియోలో...తన తొమ్మిది నెలల పాపాయిని చేతుల్లో పెట్టుకుని...గానం చేస్తూ ఆ తల్లి డబ్బు యాచిస్తోంది. ఈ దృశ్యాలు చూసి నెటిజన్లు కంటతడి పెడుతున్నారు. ‘తల్లి పొత్తిళ్లలో కేరింతలు కొడుతూ... హాయిగా పడుకోవాల్సిన ఆ చిన్నారి నేడు ఇలా రోడ్డుపై అమ్మ చేతుల్లో నిద్రపోతోంది. ఈ దుస్థితి కారణం ఎవరు’ అంటూ దేశ అధ్యక్షుడి తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. 

కాగా అంతర్జాతీయ మీడియా కథనం ప్రకారం ఏడాది కాలంలో దాదాపు ఎనిమిదిన్నర లక్షల మంది వెనిజులన్లు పెరూకు వలస వచ్చారు. వారిలో చాలా మందిని అక్రమవలసదారులుగా గుర్తించిన పెరూ ప్రభుత్వం... పాస్‌పోర్టులు, వీసాలు ఉన్నవారిని మాత్రమే దేశంలో ఉండేందుకు అనుమతినిచ్చింది. వీసాలు లేని వాళ్లపై చట్టప్రకారం చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. మరోవైపు కొలంబియా యుద్ధాన్ని కోరుకుంటోందని...వారి కుట్రలు తిప్పికొట్టేందుకు తమ సైన్యం సన్నద్ధంగా ఉన్నదంటూ వెనిజులా అధ్యక్షుడు మదురో ప్రకటన జారీ చేశారు. వివిధ రక్షణ విభాగాలకు చెందిన సైన్య దళాధిపతులతో సమావేశమైన ఫొటోలను విడుదల చేశారు. ‘కొలంబియా యుద్ధం, హింస కోరుకుంటోంది. అందుకు మేము ధీటుగా బదులిస్తాం’ అని మదురో హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

చదవండి: అమెరికాతో తెగదెంపులు!

ఇక ఈ ఏడాది జరిగిన వెనిజులా ఎన్నికల్లో ప్రముఖ ప్రతిపక్ష నాయకులు నిషేధానికి గురవడం, కొన్ని పార్టీలు పోటీకి దూరం కావడంతో అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలిచినట్లు మదురో మేలో ప్రకటించుకున్నారు. ఇందుకు నిరసనగా మళ్లీ కొత్తగా ఎన్నికలు నిర్వహించాలంటూ నిరసనకారులు ఆందోళనలు చేపట్టారు.అప్పటి నుంచి దేశంలో రాజకీయ అనిశ్చితితో పాటు ఆర్థిక సంక్షోభం కూడా ముదిరింది. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నేత జువాన్‌ గైడోను వెనిజులా అధ్యక్షుడిగా.. గుర్తిస్తున్నామంటూ అమెరికా ప్రకటన విడుదల చేసింది. ఇందుకు కొలంబియా సహా ఇతర దేశాలు వంతపాడాయి. ఈ క్రమంలో అమెరికా తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మదురో.. అగ్రరాజ్యంతో దౌత్య పరమైన సంబంధాలన్నీ తెంచుకుంటున్నామని సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top