తొందర్లోనే వెళ్లగొడతాం

US will begin removing millions of illegal immigrants - Sakshi

అక్రమ వలసదారులనుద్దేశించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌

వాషింగ్టన్‌: అమెరికాలో ఉన్న లక్షలాది మంది అక్రమ వలసదారులను త్వరలోనే వెళ్లగొడతామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ హెచ్చరించారు. వచ్చే వారమే ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. వలసదారుల్ని వెనక్కి తీసుకునేందుకు ఉద్దేశించిన ఒప్పందంపై సంతకం చేసేందుకు గ్వాటెమాలా అంగీకరించిందన్నారు. ‘అక్రమమార్గాల్లో వచ్చిన వారిని వెళ్లగొట్టేందుకు ఉద్దేశించిన ప్రక్రియను వచ్చే వారం ఇమిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీ(ఐసీఈ) ప్రారంభించనుంది. ఎంత వేగంగా వచ్చారో అంతే వేగంతో వాళ్లు వెళ్లిపోతారు’ అని ట్వీట్‌చేశారు.

‘తమ దేశం మీదుగా అమెరికాలో ప్రవేశించిన వారిని వెనక్కి తీసుకునేందుకు ఉద్దేశించిన ఒప్పందంపై త్వరలోనే గ్వాటెమాలా సంతకం చేయనుంది. ఆ వలసదారులు ఆశ్రయం కోసం ఇకపై అమెరికాకు బదులు గ్వాటెమాలాలోనే దరఖాస్తు చేసుకుంటారు’ అని ట్రంప్‌ పేర్కొన్నారు. మధ్య అమెరికాలో దేశాల్లో అశాంతి కారణంగా అక్కడి ప్రజలు గ్వాటెమాలాకు, మెక్సికోకు అక్కడి నుంచి అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే ఇటీవల సాయం నిలిపి వేస్తామంటూ మెక్సికోను భయపెట్టి మరీ అమెరికా ఒప్పందానికి దిగేలా చేసింది. దాని ప్రకారం వలసదారులను నిలువరించేందుకు అమెరికాతో సరిహద్దుల్లో మెక్సికో అదనంగా 6వేల మంది గార్డులను నియమించింది. దీంతోపాటు తమ దేశం గుండా ప్రవేశించిన వారిని వెనక్కి తీసుకునేందుకు కూడా అంగీకరించింది. అమెరికా, గ్వాటెమాలా త్వరలో ఇలాంటి ఒప్పందమే కుదుర్చుకోనున్నాయి. దేశంలో అక్రమంగా ఉంటున్న దాదాపు 10లక్షల మందిని వెనక్కి పంపించేయాలన్న కోర్టుల ఉత్తర్వుల్ని అమలు చేసేందుకు అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు.

హెచ్‌–4 వీసా రద్దు మరింత ఆలస్యం
అమెరికాలో ఉండే భారత ఐటీ నిపుణుల జీవిత భాగస్వాములు ఉద్యోగాలు చేసుకునేందుకు వీలు కల్పించే హెచ్‌–4 వీసా విధానం మరి కొంతకాలం కొనసాగనుంది. రద్దు ప్రక్రియకు సంబంధించిన చట్ట రూప కల్పన ఇంకా పూర్తి కాలేదని అధికారులు అంటున్నారు. హెచ్‌–4 సహా ఉద్యోగ ఆధారిత వీసా విధానాలన్నిటిపై సమీక్ష కొనసాగుతోందని యూఎస్‌ సిటిజన్‌ అండ్‌ ఇమిగ్రేషన్‌ సర్వీసెస్‌ (యూఎస్‌సీఐఎస్‌) తెలిపింది.  

పశ్చిమాసియాకు అమెరికా సైనికులు
ఇరాన్‌తో అమెరికా సంబంధాల్లో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్న నేపథ్యంలో మరో వెయ్యి మంది సైనిక సిబ్బందిని పశ్చిమాసియా ప్రాంతానికి పంపేందుకు అమెరికా ఆమోదం తెలిపింది. గగన, సముద్ర, భూతలంలో ఉన్న ప్రమాదాలను ఎదుర్కొనేందుకు పశ్చిమాసియాకు కొత్తగా వెయ్యి మందిని పంపుతున్నట్లు అమెరికా తాత్కాలిక రక్షణ మంత్రి ప్యాట్రిక్‌ షనాహన్‌ చెప్పారు. అణు ఒప్పందంలో నిర్దేశించిన దానికన్నా అధికంగా యూరేనియంను తాము వచ్చే పది రోజుల్లోనే నిల్వచేయనున్నామంటూ ఇరాన్‌ ప్రకటించిన కొద్దిసేపటికే అమెరికా ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. అణు ఒప్పందం నుంచి అమెరికా ఇప్పటికే బయటకు రావడం తెలిసిందే.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top