‘ఐరాస హక్కుల’ నుంచి అమెరికా ఔట్‌

US Leaves UN Human Rights Council - Sakshi

వాషింగ్టన్‌/ఐక్యరాజ్యసమితి: అగ్రరాజ్యం అమెరికా అన్నంత పనిచేసింది. ఐక్యరాజ్యసమితి మానవహక్కుల మండలి(యూఎన్‌–హెచ్‌ఆర్సీ) ఇజ్రాయెల్‌పై పక్షపాత వైఖరిని అవలంబిస్తోందని ఆరోపిస్తూ బుధవారం ఆ సంస్థ నుంచి వైదొలిగింది. ఈ విషయాన్ని ఐరాసలో అమెరికా రాయబారి నిక్కీహేలీ, విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియోతో కలసి వాషింగ్టన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ‘ప్రపంచంలోనే అత్యంత అమానవీయమైన దేశాలు తనిఖీల్ని తప్పించుకుంటున్నాయి.

కానీ యూఎన్‌ హెచ్‌ఆర్సీ మాత్రం వారిని వదిలేసి మానవహక్కుల పరిరక్షణలో మంచి రికార్డు ఉన్న దేశాల్ని(ఇజ్రాయెల్‌) లక్ష్యంగా చేసుకుంటోంది. మండలి ఇజ్రాయెల్‌పై ఎడతెగని శత్రుత్వాన్ని చూపిస్తోంది. ప్రస్తుతం మానవహక్కుల ఉల్లంఘనలు, దురాగతాలకు పాల్పడే దేశాలే మండలిలో సభ్యులుగా ఉన్నాయి’ అని నిక్కీ హేలీ విమర్శించారు. యూఎన్‌ హెచ్‌ఆర్సీ ప్రస్తుతం రాజకీయ పక్షపాతంలో కూడిన మురికిగుంటగా మారిపోయిందని ఘాటుగా వ్యాఖ్యానించారు.

మానవహక్కుల్ని ఉల్లంఘించి, దుర్మార్గాలకు పాల్పడిన దేశాలే యూఎన్‌ హెచ్‌ఆర్సీకి ఎన్నికవుతున్నాయని హేలీ ఎద్దేవా చేశారు. మండలి నుంచి వైదొలిగినప్పటికీ అమెరికా మానవహక్కులకు కట్టుబడి ఉంటుందన్నారు. తాజాగా మెక్సికో అక్రమ వలసదారులపై అమెరికా అనుసరిస్తున్న ‘జీరో టాలరెన్స్‌’ విధానం అన్యాయమని యూఎన్‌–హెచ్‌ఆర్సీ విమర్శించింది. దీంతో ట్రంప్‌ యంత్రాంగం మండలి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించింది.

ఇజ్రాయెల్‌పై కఠిన వైఖరిని అవలంబిస్తుందని ఆరోపిస్తూ అమెరికా గతేడాది ఐరాస అనుబంధ సంస్థ యునెస్కో నుంచి కూడా బయటకొచ్చింది. ప్రపంచవ్యాప్తంగా మానవహక్కుల పరిరక్షణకు జెనీవా కేంద్రంగా ఏర్పడిన యూఎన్‌ హెచ్‌ఆర్సీలో ప్రస్తుతం 47 సభ్యదేశాలున్నాయి.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top