అప్పటికి 2 లక్షల మరణాలు: హార్వర్డ్

US Could Reach 200000 Corona Virus Deaths in September - Sakshi

వాషింగ్టన్‌: సెప్టెంబరు నాటికి కరోనా వైరస్ కారణంగా అమెరికాలో 2,00,000 మరణాలు సంభవించే అవకాశం ఉన్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. హార్వర్డ్ గ్లోబల్ హెల్త్ ఇన్‌స్టిట్యూట్ అధినేత ఆశిష్ ఝా బుధవారం సీఎన్‌ఎన్‌తో మాట్లాడుతూ.. ‘ప్రభుత్వం ఆంక్షలను సడలించడంతో మొత్తం అమెరికాలో కరోనా వైరస్ కేసులు బుధవారం నాటికి 20 లక్షలను అధిగమించాయి. కఠినమైన చర్యలు పాటించకపోతే సెప్టెంబరు నాటికి మరణాల సంఖ్య 2 లక్షలకు చేరుతుంది’ అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

కేసుల సంఖ్య పెరగనప్పటికీ, సెప్టెంబరు నాటికి 2,00,000 మంది మరణించబోతున్నట్లు ఊహించడం సమంజసం అని ఝా అన్నారు. అంతే కాక సెప్టెంబరు నాటికి మహమ్మారి తుడిచిపెట్టుకుపోదని ఆయన తెలిపారు. రాబోయే వారాలు, నెలల్లో కరోనా కేసులు, మరణాల సంఖ్యలో అమెరికా ఎక్కడ ఉండబోతుంది అనే విషయం తలుచుకుంటేనే భయంగా ఉందన్నారు ఝా. బుధవారం నాటికి అమెరికాలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,12,754 ఉండి ప్రపంచంలోనే అత్యధిక మరణాలు సంభవించిన దేశంగా నిలిచింది. కరోనా కట్టడి కోసం దేశాలన్ని లాక్‌డౌన్‌ అమలు చేశాయి. కానీ అమెరికా మాత్రం కేసుల సంఖ్య తగ్గకముందే సడలింపులు ఇచ్చింది. ఫలితంగా మరణాల రేటు ఇంత ఎక్కువగా ఉన్నట్లు నివేదికలు తెలుపుతున్నాయి. అయితే ఎక్కువ సంఖ్యలో పరీక్షలు చేయడం, కాంటాక్ట్ ట్రేసింగ్, భౌతిక దూరం, మాస్క్‌ ధరించడం వంటి నియమాలను కఠినంగా పాటించడం ద్వారా మరణాల సంఖ్యను తగ్గించవచ్చని ఝా అభిప్రాయ పడ్డారు.(అమెరికాను వెంటాడుతున్న ‘భూతం’)

పలు అమెరికా రాష్ట్రాల్లో కేసుల సంఖ్య తగ్గకముందే సడలింపులు ఇస్తున్నారని.. ఇది ఆందోళన కలిగించే అంశమన్నారు ఝా. రాయిటర్స్ విశ్లేషణ ప్రకారం, న్యూ మెక్సికో, ఉటా, అరిజోనాలో గత వారంతో పోలిస్తే.. ఈ వారం 40 శాతం ఎక్కువ కేసులు నమోదయ్యాయని.. ఫ్లోరిడా, అర్కాన్సాస్ హాట్ స్పాట్స్‌గా మారాయని ఆయన తెలిపారు. దేశ వ్యాప్తంగా చూసుకుంటే గత ఐదు వారాల నుంచి కరోనా కేసుల్లో క్షీణత కనిపించగా.. ఈ వారంలో కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయని తెలిపారు. ప్రస్తుతం అమెరికాలో కరోనా కేసుల సంఖ్య  20,03,038గా ఉన్నాయి. కోవిడ్‌ ట్రాకింగ్ ప్రాజెక్ట్ (covidtracking.com) ప్రకారం, గత శుక్రవారం ఒకే రోజు రికార్డు స్థాయి 5,45,690 పరీక్షలు జరిపారు.

ఇదే కాక గత కొద్ది రోజులుగా అమెరికాలో నల్ల జాతీయుడు జార్జ్‌ ఫ్లాయిడ్‌ నర హత్యకు వ్యతిరేకంగా ఆందోళనలు మిన్నంటుతున్న సంగతి తెలిసిందే. వందల సంఖ్యలో ఆందోళనకారులు ఒకే చోట గుమిగూడటం పట్ల వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆందోళనలో పాల్గొన్న వారంతా తప్పక కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. (కరోనా : మాంద్యంలోకి అమెరికా ఆర్థిక వ్యవస్థ)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top