కరోనా : మాంద్యంలోకి అమెరికా ఆర్థిక వ్యవస్థ

US economy entered recession in February - Sakshi

ఫిబ్రవరిలోనే అమెరికా మాంద్యంలోకి ప్రవేశించింది

వాషింగ్టన్‌: కరోనా దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆర్థిక మాంద్యం తప్పదన్నఆందోళనల నేపథ్యంలో ఇప్పటివరకూ ప్రపంచ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచిన అమెరికాకు సంబంధించి అధికారిక షాకింగ్ రిపోర్టు వెలువడింది.  కరోనా వైరస్ మహమ్మారి, లాక్ డౌన్ ఫలితంగా గత ఫిబ్రవరిలోనే  అమెరికా ఆర్థిక వ్యవస్థ అధికారికంగా మాంద్యంలోకి ప్రవేశించిందని ఆర్థిక నిపుణుల తాజా పరిశోధనలో వెల్లడైంది. 

బిజినెస్ సైకిల్ డేటింగ్ కమిటీ నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకనామిక్ రీసెర్చ్ ప్రకటించిన దాని ప్రకారం మహమ్మారి దేశాన్ని తుడిచి పెట్టేసింది. తద్వారా అధికారికంగా 128నెలల ఆర్థిక వృద్ధికి ముగింపు పలికి మాంద్యం లోకి ప్రవేశించింది. అమెరికా మహమ్మారి కారణంగా ఉపాధి కల్పన, ఉత్పత్తి క్షీణతలో అసాధారణమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్థిక కార్యకలాపాలు గణనీయంగా మందగించడంతో ఊహించిన దానికంటే వేగంగా మాంద్యంలోకి జారుకుంది. దేశంలో రెండోసారి వైరస్‌ విజృంభిస్తే అమెరికా పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. (కరోనా : మూసివేత దిశగా 25 వేలదుకాణాలు)

అయితే వచ్చే ఏడాది ద్వితీయార్థలో ఆర్ధిక వ్యవస్థలో కొంత సానుకూల మార్పు రావొచ్చని అంచనా. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత రెండుసార్లు ఏర్పడిన మాంద్యం ఆరు నుండి 18 నెలల వరకు కొనసాగింది. 1929 లో ప్రారంభమైన మహా మాంద్యం 43నెలల పాటు కొనసాగింది. అయితే గత మాంద్యాల మాదిరిగానే ఇపుడు కూడా శాశ్వత ప్రభావాన్ని కలిగి ఉంటుందా లేదా అనేది నిర్ణయించేందుకు రికవరీ వేగం ముఖ్యమైందని వ్యాఖ్యానించారు. ఉదాహరణకు 2007- 2009 కాలంలో అనేక లక్షల బ్లూ కాలర్ ఉద్యోగాలు శాశ్వతంగా కోల్పోవడం, దీర్ఘకాలిక నిరుద్యోగం, మధ్య, తక్కువ-ఆదాయ కుటుంబాల బలహీనమైన వేతన వృద్ధి లాంటి అంశాలను గుర్తు చేసిన పరిశోధన ఆర్థిక వృద్ది పురోగమనం వీటిపై ఆధారపడి వుంటుందని తేల్చి చెప్పింది. మరోవైపు రెండవ ప్రపంచ యుద్ధం 1946 తర్వాత అమెరికా జీడీపీ ఏకంగా దారుణంగా పతనమైంది. అమెరికా స్థూల జాతీయోత్పత్తి ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో 4.8 శాతం పడిపోయింది. ప్రస్తుత త్రైమాసికంలో చారిత్రాత్మక కనిష్టానికి పడిపోతుందని విశ్లేషకులు అంచనా వేస్తుండగా, ఈ త్రైమాసికంలో దాదాపు 54 శాతం తగ్గుతుందని అంచనా వేసింది. నిరుద్యోగిత రేటు ఫిబ్రవరిలో రికార్డు కనిష్టం 3.5 శాతంగా నమోదైంది.  ఏప్రిల్‌లో 14.7 శాతానికి, మే నెలలో 13.3 శాతానికి చేరింది.  (పరిస్థితి మరింత దిగజారుతోంది: డబ్ల్యూహెచ్ఓ)

కాగా కనబడని శత్రువు కరోనా వైరస్ కారణంగా అమెరికాలో ఆర్థిక మాంద్యం తప్పకపోవచ్చునని దేశ ఆధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అటు ఈ సంక్షోభం నేపథ్యంలో మరో ఆర్థిక ఉపశమన ప్యాకేజీకి  ట్రంప్ సిద్ధంగా ఉన్నారని వైట్ హౌస్ ప్రతినిధి సోమవారం వెల్లడించారు. మరోవైపు అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశాలు ఈ వారం ప్రారంభం కానున్నాయి. దీంతో ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ చర్యలపై అధికారులు ప్రధానంగా దృష్టి పెట్టనున్నారని భావిస్తున్నారు. పెట్టుబడిదారులకు భారీ ఊరట లభించనుందని అంచనా వేస్తున్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top