కరోనా : మూసివేత దిశగా 25 వేల దుకాణాలు

As Many as 25 000 U.S. Stores May Close in 2020 Mostly in Malls - Sakshi

వాషింగ్టన్‌: కరోనా వైరస్ మహమ్మారి అమెరికాను అతలాకుతలం చేసింది. ముఖ్యంగా లాక్‌డౌన్‌ కారణంగా దుకాణాల మూత, పరిమిత సేవల ఆంక్షల నేపథ్యంలో రీటైల్ పరిశ్రమ కుదేలైంది. దీంతో ఈ ఏడాదిలో  సుమారు 25 వేల దుకాణాలు శాశ్వతంగా మూత పడనున్నాయని ఒక నివేదిక వెల్లడించింది. దేశంలోని మాల్స్, డిపార్టమెంటల్ స్టోర్లపై వైరస్ తీవ్ర ప్రభావాన్ని చూపనుందని తాజా రిపోర్టుల ద్వారా తెలుస్తోంది. దీంతో ఇప్పటికే కష్టాల్లో ఉన్న మాల్ ఆధారిత  చిల్లర వ్యాపారులు మరింత కుదేలవుతారని వ్యాఖ్యానించింది. ఈ విషయంలో పరిస్థితి 2019 నాటికంటే దారుణంగా వుంటుందని పేర్కొంది. 

రిటైల్ అండ్ టెక్ డేటా సంస్థ కోర్ సైట్ రీసెర్చ్ నివేదిక ప్రకారం ప్రధానంగా మాల్స్‌లో చాలావరకు దుకాణాలు మూత పడనున్నాయి. వీటితోపాటు డిపార్ట్‌మెంట్ స్టోర్లు, బట్టల దుకాణాలు తీవ్రంగా దెబ్బతింటాయని అంచనా వేసింది. 2019లో 9,800కి పైగా దుకాణాలను మూసివేసిన రికార్డును బద్దలు కొట్టేంత తీవ్రంగా ఇది ఉంటుందని నివేదించింది. అలాగే మాల్‌లోని ప్రధాన అద్దెదారులు స్టోర్లను మూసివేస్తే, ఇతర అద్దె దారులు కూడా తమ షాపులు మూసివేయాల్సి వస్తుందని కోర్ సైట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డెబోరా వీన్స్ విగ్ తన నివేదికలో తెలిపారు. ఈ ప్రభావంతో మూతపడే దుకాణాల సంఖ్య 20-25 వేల వరకు ఉంటుందన్నారు. మూసివేతలతో పాటు, రుణ భారంతో మరికొంతమంది చిల్లర వ్యాపారులు దివాలా అంచుల్లోకి జారుకుంటారని హెచ్చరించారు. ఈ సంవత్సరం ఇప్పటికే పదిహేను ప్రధాన రిటైలర్లు దివాలా పిటిషన్లు దాఖలు చేశారని పేర్కొన్నారు. (పరిస్థితి మరింత దిగజారుతోంది: డబ్ల్యూహెచ్ఓ)

కోవిడ్-19 వ్యాప్తి కారణంగా మార్చి మధ్యలో అమెరికన్ రిటైలర్లు నష్టాల పాలయ్యారు. పలు షాపులు మూత పడ్డాయి. ప్రస్తుతం కొన్ని పరిమితులతో షాపులు తిరిగి తెరుచుకున్నప్పటికీ , లాక్‌డౌన్‌ ప్రతిష్టంభనతో చిల్లర వ్యాపారులు జూన్ 5 నాటికి సుమారు 4 వేల దుకాణాలను శాశ్వతంగా మూసివేతకు నిర్ణయించడం గమనార్హం. వందల సంఖ్యలో దుకాణాలను మూసివేసిన వరుసలో జె.సి. పెన్నీ, విక్టోరియా సీక్రెట్ , పీర్1 ఇంపోర్ట్స్ సంస్థలు ఉన్నాయి. లాక్ డౌన్ ప్రభావం స్పష్టంగా తెలియకముందే, 2020 లో 15,000 దుకాణాలు మూతపడతాయని కోర్ సైట్ మార్చిలో అంచనా వేసింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top