ఇంటర్నెట్‌ను కదిలిస్తోన్న వైరల్‌ వీడియో

UNICEF Post A  Video HIV Positive Hug Me Video - Sakshi

ఎయిడ్స్‌ / హెఐవీ పేరు పలకడానికే చాలా మంది అసహ్యించుకుంటారు, అలాంటిది ఇక ఈ వ్యాధి బారిన పడిన వారి పట్ల సమాజం తీరు ఎలా ఉంటుందో అందరికి తెలిసిన విషయమే. ఇలాంటి పరిస్థితుల్లో ఈ వ్యాధి బారిన పడిన చిన్నారుల బాధ వర్ణానాతీతం. అటు తల్లిదండ్రులు ప్రేమకు దూరమయ్యి, ఇటు సమాజపు చీత్కారాలను ఎదుర్కొలేక ఆ పసి మనసులు పడే క్షోభ వర్ణనాతీతం. దీనికి ప్రధాన కారణం నేటికి ఈ వ్యాధి పట్ల ఎన్నో అనుమనాలు సమాజంలో వేళ్లునుకుపోవడమే.

నేటికి దీన్నో అంటువ్యాధిలా భావించి, కనీసం చూసినా కూడా ఆ వ్యాధి తమకు అంటుకుంటుందేమోనని భావించేవారు కోకొల్లలు. ఈ అనుమానాలను దూరం చేసి, ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్తులు, ముఖ్యంగా ఈ వ్యాధితో బాధపడే చిన్నారులకు బాసటగా నిలవడం కోసం యునిసెఫ్‌ ఒక వినూత్న కార్యక్రమాన్ని రూపొందించింది. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియో ఇప్పుడు ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది.

ఉజ్బెకిస్తాన్‌లో చిత్రీకరించిన ఈ వీడియోలో అజ్మా అనే పదహారేళ్ల యువతి రోడ్డు పక్కన నిల్చుని ఉంది. ఆమె పక్కనే ఒక ప్ల కార్డు ఉంది. దాని మీద ‘నాకు హెచ్‌ఐవీ ఉంది. నన్ను కౌగిలించుకోండి అని రాసి ఉంది. రోడ్డు మీద వెళ్లే వారు యువతిని, ఆమె పక్కన ఉన్న ప్ల కార్డును గమనించారు. తరువాత ఏం జరుగుతుందని భావిస్తున్నారు.. ఆశ్చర్యం వారంతా ఆమె దగ్గరకి వెళ్లి, ఆ యువతిని కౌగిలంచుకున్నారు.

ఈ విషయం గురించి వీడియో చివరలో అజ్మా ‘పది సంవత్సరాల క్రితం నాకు హెచ్‌ఐవీ అని తెలిసింది. అయిన నాటి నుంచి నేటి వరకూ నేను బాగానే ఉన్నాను. నా జీవితాన్ని సంతోషంగానే గడుపుతున్నాను. కేవలం రక్త మార్పిడి వల్ల, తల్లి నుంచి బిడ్డకు, అసురక్షితమైన లైంగిక పద్దతుల వల్లనే హెచ్‌ఐవీ వ్యాపిస్తుంది. అంతే తప్ప ఈ వ్యాధి ఉన్న వారితో కరచాలనం చేసినా, మాట్లాడినా, కలిసి కూర్చున్నా, తిన్నా ఎయిడ్స్‌ రాదు’అని తెలిపారు.

అంతేకాక ‘ఈ వీడియో చేయాలనుకున్నప్పుడు ఇంత మంచి స్పందన వస్తుందని నేను ఊహించలేదు. నన్ను ఆలింగనం చేసుకున్న ప్రతివారిని నా కుటుంబ సభ్యులుగా భావించాను. మీ అందరి ప్రేమకు ధన్యవాదాలని’ తెలిపారు. యునిసెఫ్‌ ఈ వీడియోను ట్విటర్‌లో పోస్ట్‌ చేసిన కొన్ని గంటల్లోనే వేల కొద్ది లైక్‌లు దాదాపు రెండు వేల రీ ట్వీట్లు పొందింది. చాలామంది అజ్మా చేసిన పనిని మెచ్చుకుంటూ, ఆశీర్వదిస్తున్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top