
ఉత్తర్వుల్ని ట్రంప్ వెనక్కి తీసుకోవాలి
శరణార్థులు, ఏడు ముస్లిం దేశాల వలసదారులపై నిషేధ ఉత్తర్వుల్ని నిరసిస్తూ అమెరికా చట్టసభ సభ్యులు సుప్రీంకోర్టు ముందు శాంతియుతంగా ఆందోళన నిర్వహించారు.
► అమెరికా సుప్రీంకోర్టు ముందు డెమొక్రాట్ల ఆందోళన
► బ్రిటన్ లో ట్రంప్ పర్యటించ వద్దంటూ నిరసన ప్రదర్శనలు
వాషింగ్టన్ : శరణార్థులు, ఏడు ముస్లిం దేశాల వలసదారులపై నిషేధ ఉత్తర్వుల్ని నిరసిస్తూ అమెరికా చట్టసభ సభ్యులు సుప్రీంకోర్టు ముందు శాంతియుతంగా ఆందోళన నిర్వహించారు. ట్రంప్ తన నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ‘ట్రంప్ తీసుకున్న నిర్ణయం ముస్లింలపై నిషేధమే కాకుండా రాజ్యాంగ విరుద్ధం కూడా. ఇది మన విలువల్ని, భద్రతను బలహీనపరుస్తుంది’ అని డెమొక్రాట్ సభ్యుడు స్టెనీ హెచ్ హోయర్ పేర్కొన్నారు. స్వేచ్ఛకు, వివిధ భాషలు మాట్లాడే, విశ్వసాలు పాటించే వారి ధైర్యసాహసాలకు అమెరికా నిలయమని ఆయన గుర్తు చేశారు. అమెరికా అధ్యక్షుడు చేసింది తప్పకుండా రాజ్యాంగ విరుద్ధమేనని, మనల్ని కాపాడుకునేందుకు రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలన్నారు.
దేశ ప్రయోజనం కోసం ట్రంప్ ఈ నిర్ణయం తీసుకోలేదని, ఇది తొందరపాటు, దుందుడుకు చర్యగా మరో సభ్యుడు పెలోసీ విమర్శించారు. ఉత్తర్వుల్ని రద్దు చేయాలంటూ దాదాపు 30 మంది డెమొక్రటిక్ సెనెటర్లు ట్రంప్‌కు లేఖ రాశారు. ట్రంప్ దూకుడుపై మాజీ అధ్యక్షుడు ఒబామా మౌనం వీడారు. మతం, విశ్వాసాల ఆధారంగా వ్యక్తులపై వివక్ష చూపడాన్ని అంగీకరించబోమన్నారు.
బ్రిటన్ లోనూ...
ట్రంప్ నిర్ణయానికి వ్యతిరేకంగా బ్రిటన్ లో వేలాది మంది రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. ట్రంప్ బ్రిటన్ పర్యటనకు ఇచ్చిన ఆహ్వానాన్ని వెనక్కితీసుకునేందుకు ప్రధాని థెరెసా మే అంగీకరించకపోవడంపై కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. లండన్ లో డౌనింగ్ స్ట్రీట్ వెలుపల సోమవారం రాత్రి వేలాదిమంది ట్రంప్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
తాత్కాలిక అటార్నీపై వేటు: వలసదారుల రాకపై నిషేధాన్ని వ్యతిరేకించిన అమెరికా తాత్కాలిక అటార్నీ జనరల్ సల్లీ యేట్స్‌ను ట్రంప్ పదవి నుంచి తొలగించారు. అలాగే ఇమిగ్రేషన్ , కస్టమ్స్ ఎన్ ఫోర్స్‌మెంట్ తాత్కాలిక డైరక్టర్ డేనియల్‌నూ తప్పించారు.