
నాలుగు వందల ఏళ్ల క్రితం జరిగినట్టు చెబుతున్న థాయ్‌లాండ్ రాజుల చరిత్రలో ఓ అంశాన్ని ప్రశ్నించినందుకు 85 ఏళ్ల థాయ్‌లాండ్ విమర్శకుడిని సోమవారం ఇక్కడి సైనిక కోర్టులో హాజరుపరిచారు.
బ్యాంకాగ్ : నాలుగు వందల ఏళ్ల క్రితం జరిగినట్టు చెబుతున్న థాయ్‌లాండ్ రాజుల చరిత్రలో ఓ అంశాన్ని ప్రశ్నించినందుకు 85 ఏళ్ల థాయ్‌లాండ్ విమర్శకుడిని సోమవారం ఇక్కడి సైనిక కోర్టులో హాజరుపరిచారు. రాజును అవమానించారన్న ఆరోపణలకు సంబంధించిన ఆయనపై ‘లీజ్ మెజెస్టీ లా’ కింద అధికారికంగా కేసును నమోదు చేశారు. ఈ చట్టం కింద ఆయనకు మూడేళ్ల నుంచి 15 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.
సులక్ శివరక్ష అనే వద్ధుడు 2014 సంవత్సరంలో ఓ బహిరంగ వేదికపై ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ 1593లో ప్రముఖ థాయ్‌లాండ్ రాజు నరేసువాన్, బర్మా రాజు మధ్య జరిగిన నాంగ్ సరాయ్ యుద్ధాన్ని ప్రస్తావించారు. చరిత్ర పుస్తకాలు చెబుతున్నట్లు ఆ యుద్ధంలో నిజంగా నరేసువాన్ ఏనుగ్గునెక్కి పోరాడి విజయం సాధించారా? అని ప్రశ్నించారు. చరిత్రను ప్రశ్నించడం కూడా అవసరమన్నారు. మూడేళ్ల క్రితం ఆయన చేసిన ఈ వ్యాఖ్యలను సులక్ శివరక్ష మరిచిపోయారో లేదో తెలియదుగానీ ప్రజలు మాత్రం ఎప్పుడో మరచిపోయారు. ఇంతకాలం ఏమి జరిగిందో ఏమోగానీ సోమవారం నాడు సైనిక అధికారులు వచ్చి శివరక్షను పట్టుకెళ్లి కేసు పెట్టారు.
మూడేళ్లపాటు పట్టించుకోని సైనిక అధికారులు ఇప్పుడు తనపై ఎందుకు కేసు పెట్టారో అర్థం కావడం లేదని శివరక్ష వ్యాఖ్యానించారు. బహూశా పాలకులు ఎవరైనా వారిని ప్రశ్నించరాదన్నది ప్రస్తుతం ప్రభుత్వం వైఖరై ఉంటుందని అన్నారు. అయినా ప్రతి విషయాన్ని తరచి చూడడం, విమర్శించడం తన నైజమని, ఈ నైజాన్ని తాను వదులుకోనని చెప్పారు. డిసెంబర్‌లో మరోసారి కేసు విచారణ ఉందని, బహూశ ఆరోజున శిక్షను ఖరారు చేయవచ్చని ఆయన తరఫు న్యాయవాది తెలిపారు. రాజులను, వారి కుటుంబ సభ్యలను విమర్శించరాదని ‘లీజ్ మెజెస్టీ లా’ చెబుతోంది. అయితే బతికున్న రాజులను విమర్శించకూడదా? వారు మరణించాక కూడా విమర్శించకూడదా? అన్న అంశంపై చట్టంలో స్పష్టత లేదు. అందుకని అవసరాన్ని బట్టి పాలకులు చట్టానికి భాష్యం చెబుతూ వస్తున్నారు.
2014లో అధికారాన్ని కైవసం చేసుకున్న థాయ్ సైన్యం ఇప్పటి వరకు ఈ చట్టం కింద 93 కేసులను దాఖలు చేసి, 138 మందిని విచారించింది.