కరోనా కాలం: బిలియనీర్ల విలాస జీవనం

Superyachts Luxury Bunkers With Pool Gym Super Rich Life Amid Covid 19 - Sakshi

లండన్‌: ప్రపంచమంతా కరోనా కల్లోలంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న వేళ కొంత మంది ‘అపర కుబేరులు’మాత్రం విలాసాల్లో మునిగితేలుతున్నారు. ప్రాణాంతక వైరస్‌ బారి నుంచి తప్పించుకునేందుకు కొందరు కరేబియన్‌ దీవులకు వెళ్లగా.. మరికొందరు తమ కలల సౌధాల్లోని రహస్య గదుల్లో జీవనం గడుపుతున్నారు. ఇంకొందరు జిమ్‌, గార్డెన్‌, స్విమ్మింగ్‌ పూల్‌ వంటి సకల సౌకర్యాలు కలిగి ఉండి,  నీటిపై తేలియాడే పడవల్లో నివాసం ఉంటూ విలాసవంతమైన జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. అమెరికా మీడియా మొఘల్‌ డేవిడ్‌ జెఫెన్‌ వంటి ప్రముఖులు ఇందుకు సంబంధించిన ఫొటోలను షేర్‌ చేస్తూ.. ‘‘సూర్యాస్తమయ దృశ్యాలు బాగున్నాయి. గ్రెనాడిన్స్‌లో ఐసోలేషన్‌ వైరస్‌ బారి నుంచి కాపాడుతుంది. అందరూ సురక్షితంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నా’’అంటూ క్యాప్షన్లు జత చేశారు. (కరోనా విపత్తు: చైనాను బెదిరించిన ట్రంప్‌!)

కాగా డేవిడ్‌తో పాటు ఆయన లాంటి ఎంతో మంది సంపన్నులు కరోనా వ్యాప్తి చెందుతున్న తొలి నాళ్లలోనే వైరస్‌ ప్రభావం లేని, తీవ్రత తక్కువగా ఉన్న న్యూజిలాండ్‌ వంటి దేశాలకు ప్రైవేట్‌ విమానాల్లో తరలివెళ్లారని ప్రముఖ పత్రిక ది గార్డియన్‌ పేర్కొంది. మరికొంత మంది అండర్‌ గ్రౌండ్‌ షెల్లర్లు(నేల మాళిగ)ల నిర్మాణానికై తమ సంపదను ఖర్చు చేస్తున్నట్లు టెక్సాస్‌ కేంద్రంగా పనిచేసే ఎస్‌ బంకర్స్‌ అనే సంస్థ లాస్‌ ఏంజెల్స్‌ టైమ్స్‌తో పేర్కొంది. దాదాపు 8.35 మిలియన్‌ డాలర్ల మేర ఖర్చు చేస్తున్నారని తెలిపింది. వాటిలోనే నెలలకు సరిపడా తిను బండారాలు కూడా ముందే అమర్చుకుంటున్నారని పేర్కొంది. కరోనా కంటే కొన్ని దేశాల్లో ఆకలి చావులే ఎక్కువగా నమోదవుతున్న తరుణంలోనూ సంపన్నులు తమ జీవన శైలిలో ఎలాంటి మార్సులు లేకుండా హాయిగా జీవితాన్ని గడుపుతున్నారని మరో అంతర్జాతీయ మీడియా కొన్ని ఫొటోలను విడుదల చేసింది.(న్యూయార్క్‌లో శవాల గుట్ట!)

అదే విధంగా లాక్‌డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమైనప్పటికీ ఫ్యాషన్‌ను వీడకూడదని.. అందమైన దుస్తులు ధరించాలని ఎఫ్‌టీ మ్యాగజీన్‌ తన పాఠకులకు సూచించింది. వివిధ రకాల బ్రాండ్లను ప్రమోట్‌ చేస్తూ వారి వ్యాపారాన్ని వృద్ధిని చేసే పనిలో ఉందని వెల్లడించింది. ఇక కొంతమంది కరోనా కాలంలో తాము మరింత సంపన్నులమయ్యేందుకు మార్గాలు అన్వేషిస్తున్నారని పాలసీ స్టడీ గ్రూప్‌ పేర్కొంది. జూమ్‌ యాప్‌ ప్రవేశపెట్టిన ఎరిక్‌ యువాన్‌ వంటి కొంతమంది లాక్‌డౌన్‌ నేపథ్యంలో మరిన్ని లాభాలు ఆర్జిస్తున్నారని తెలిపింది. ఇక మార్చి 18- ఏప్రిల్‌ 10 వరకు అమెరికా బిలియనీర్ల సంపద 10 శాతం మేర పెరిగిందని వెల్లడించింది. అయితే అందరూ కోటీశ్వరులు ఇలాగే ఉండటం లేదని..  అమెజాన్‌ సీఈవో జెఫ్‌ బెజోస్‌‌, ట్విటర్‌ జాక్‌ డోర్సే వంటి సంపన్నులు దాతృత్వం ప్రదర్శిస్తున్నారని పేర్కొంది. కాగా అమెరికా ఫుడ్‌ బాంక్స్‌ కోసం బెజోస్‌ 100 మిలియన్‌ డాలర్లు విరాళం ఇవ్వగా.. జాక్‌ డోర్సే కరోనాపై పోరులో అండగా నిలిచేందుకు ఒక బిలియన్‌ డాలర్లు దానం చేసి గొప్ప మనసు చాటుకున్న విషయం తెలిసిందే.   

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top