స్పెర్మ్‌వేల్‌ కడుపులో 25 కేజీల ప్లాస్టిక్‌

Sperm Whale Found Dead On The Spanish Coast - Sakshi

మాడ్రిడ్‌, స్పెయిన్‌ : స్పెయిన్‌లోని ఓ బీచ్‌లో తీవ్ర విషాదం నెలకొంది. పది మీటర్ల పొడవున్న ఓ భారీ వేల్‌ చనిపోయి ఒడ్డుకు కొట్టుకొచ్చింది. వేల్‌ మృతికి కారణం తెలుసుకునేందుకు పోస్టు మార్టం నిర్వహించిన వైద్యులు అసలు విషయం తెలిసి కంగుతిన్నారు. వేల్‌ పొట్టలో దాదాపు 25 కేజీల ప్లాస్టిక్‌ ఉన్నట్లు వారు గుర్తించారు.

ప్లాస్టిక్‌ బ్యాగ్స్‌, వలలు, జెర్రీ క్యాన్స్‌ను తినడం వల్ల జీర్ణాశయంలో ఏర్పడ్డ ఇన్ఫెక్షన్‌ కారణంగా వేల్‌ మరణించిందని వెల్లడించారు. సముద్రాల్లో ప్లాస్టిక్‌ వేస్ట్‌ పెరిగిపోతుండటం వల్ల జలచరాలు ప్రాణాలు కోల్పోతున్న విషయం తెలిసిందే. తాజా సంఘటన స్పెయిన్‌ అధికారులను ఓ కొత్త నిర్ణయం తీసుకునేలా చేసింది. ప్రజలు ప్లాస్టిక్‌ వ్యర్థాలను సముద్రాల్లో పడేయకుండా వారిలో అవగాహన కలిగించాలని నిర్ణయించుకున్నారు.

స్పెర్మ్‌వేల్‌.. ఆసక్తికర విషయాలు
టూత్ వేల్‌, డాల్ఫిన్ జాతులకు చెందినవే ఈ స్పెర్మ్‌వేల్స్‌‌. చతురస్రాకారంగా ఉండే వేల్స్‌ తల లోపలి భాగంలో పాల లాంటి తెల్లని పదార్థం ఉండటం వల్ల వాటికి ఈ పేరు వచ్చింది. ఇవి ప్రపంచంలో ఉన్న అన్ని సముద్రాల్లో నివసిస్తుంటాయి. స్పెర్మ్‌ వేల్స్‌ ఎక్కువగా సముద్రపు అడుగు భాగాల్లో జీవించడానికి ఇష్టపడతాయి. ఇవి దాదాపు 70 సంవత్సరాలకు పైగా జీవిస్తాయి. పరిమళాల తయారీలలో స్పెర్మ్‌వేల్స్‌ను ఉపయోగిస్తారు.

ఒక్కోసారి బంగారంతో సమానంగా స్పెర్మ్‌వేల్స్‌ల ధర ఉంటుంది. సముద్రపు అడుగు భాగాలకు వెళ్లగలిగే అతికొద్ది జీవుల్లో ఇవి కూడా ఉన్నాయి. ఇవి దాదాపు రెండు గంటల పాటు నీటిలో ఊపిరి తీసుకోకుండా ఉండగలవు. ప్రపంచవ్యాప్తంగా స్పెర్మ్‌ వేల్స్‌ సంఖ్య ఒక లక్షకుపై మాటే.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top