హడలెత్తించిన మినీ సునామీ

Spain Beaches Hit By MeteoTsunami - Sakshi

మాడ్రిడ్‌, స్పెయిన్‌ : దేశంలో టూరిజానికి ప్రసిద్ధిగాంచిన మజోర్కా, మెనోర్కా ద్వీపాల బీచ్‌లపై మినీ సునామీ విరుచుకుపడింది. మెనోర్కా పశ్చిమ తీరంలో గల సిటడెల్లా బీచ్ వద్ద ఆరు అడుగులు ఎత్తైన అలలు తీరాన్ని తాకాయి. దీంతో యాత్రికులు బెంబేలెత్తిపోయారు. సిటడెల్లాతో పాటు దగ్గరలోని పలు బీచ్‌లపై సైతం మినీ సునామీ ప్రభావం కనిపించింది.

భీకర గాలుల కారణంగానే తీరంపైకి భారీ అలలు వచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. దీన్ని శాస్త్రీయ పరిభాషలో ‘మెటిరియలాజికల్‌ సునామీ’గా పిలుస్తారని వెల్లడించారు. పెనుగాలుల తాకిడికి నీటిపై అధిక ఒత్తిడి కలిగి భారీ ఎత్తున అలలు ఎగసిపడతాయని వివరించారు. దీన్నే వాతావరణ ప్రేరిత సునామీగా చెప్పొచ్చని తెలిపారు. అయితే, అల ఎంత ఎత్తుకు ఎగసేది సదరు ప్రదేశంలో ఉన్న లోతును బట్టి ఉంటుందని చెప్పారు.

ఈ తరహా సునామీలు తరచుగా మధ్యదరా సముద్రంలో సంభవిస్తుంటాయి. బ్రిటన్‌ తీరంలో కూడా కనిపిస్తుంటాయి. స్పెయిన్‌ తీరంలో వచ్చిన మినీ సునామీ ధాటికి తీరంలో ఉన్న రిసార్టులు, బార్లలోకి నీరు చొచ్చుకెళ్లింది. కొన్ని చోట్ల సముద్రపు నీరు రోడ్లపైకి చేరింది. తీరంలో ఉన్న బోట్లను రక్షించుకునేందుకు యజమానులు పడరానిపాట్లు పడ్డారు.

ఏంటీ మెటిరియలాజికల్‌ సునామీ..?
సముద్ర గర్భంలో భూకంపాలు, భూపాతాలు, అగ్నిపర్వత ఉద్భేదనాల వల్ల సహజంగా సునామీ సంభవిస్తుందని అందరికీ తెలుసు. అయితే, మెటిరియలాజికల్‌ సునామీ ఇందుకు విభిన్నం. ఇది సముద్ర గర్భంలో సంభవించదు. గాలి ఒత్తిడి కారణంగా మెటిరియలాజికల్‌ సునామీ వస్తుంది. వాతావరణం కల్లోలంగా(ఉరుములు, పిడుగులు, పెనుగాలులు, భీకర వర్షం తదితరాలు) ఉన్న సమయంలో గాలి తీవ్ర ఒత్తిడి వల్ల తీరం వైపునకు నీరు వేగంగా నెట్టబడుతుంది.

ఇదే సమయంలో నీటి కణాలు ఒకదాన్ని మరొకటి ఢీ కొట్టుకుని పెద్ద ఎత్తున ఎగసిపడతూ తీరాన్ని తాకుతాయి. శాస్త్రవేత్తలు సైతం మెటిరియలాజికల్‌ సునామీలను అర్థం చేసుకునేందుకు ఇంకా పరిశోధనలు నిర్వహిస్తున్నారు. గ్రేట్‌ లేక్స్‌, గల్ఫ్‌ ఆఫ్ మెక్సికో, అట్లాంటిక్‌ తీరం, మధ్యదరా, అడ్రియాటిక్‌ సముద్రాల్లో తరచుగా ఈ మినీ సునామీలు సంభవిస్తుంటాయి.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top