శవపేటికలో ఉన్నపుడు ఆశ్చర్యం వేసింది!!

South Koreans Placed Inside Coffins To Simulate Death - Sakshi

సియోల్‌ : జీవిత పరమార్థాన్ని తెలిపేందుకు, బతుకు మీద తీపిని పెంచేందుకు దక్షిణ కొరియా హీలింగ్‌ సెంటర్లు సరికొత్త విధానాలు అనుసరిస్తున్నాయి. ప్రాణాలతో ఉండగానే ‘సామూహిక అంత్యక్రియలు’   నిర్వహించుకునే వీలు కల్పిస్తున్నాయి. తద్వారా నిరాశలో కూరుకుపోయిన వారు జీవితాన్ని కొత్త కోణం నుంచి చూసేలా సరికొత్త అనుభూతిని కలిగిస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ గతంలో వెలువరించిన నివేదికల ప్రకారం మిగతా దేశాలతో పోలిస్తే దక్షిణా కొరియాలో ఆత్మహత్యలు రెండింతలు ఎక్కువ. ప్రతీ లక్ష మంది పౌరులకు సగటున 20 మంది బలవన్మరణానికి పాల్పడుతున్నారు.

ఈ క్రమంలో 2012 నుంచే ఆ దేశంలో అధిక సంఖ్యలో హీలింగ్‌ సెంటర్లు పుట్టుకొచ్చాయి. బతికి ఉండగానే శవపేటికలోకి పంపి.. చనిపోయామన్న భావన కల్పిస్తూ జీవితంపై ఆశ కల్పించడమే వీటి ప్రధాన ఉద్దేశం. ఈ నేపథ్యంలో హైవోన్‌ అనే హీలింగ్‌ సెంటర్‌ మంగళవారం ‘డైయింగ్‌ వెల్‌’  పేరిట కార్యక్రమాన్ని నిర్వహించింది. టీనేజర్లు మొదలు వృద్ధుల దాకా పదుల సంఖ్యలో ఈ ‘లివింగ్‌ ఫర్నియల్‌’లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా అంత్యక్రియలకు ముందు చేసే కార్యక్రమాలు పూర్తి చేసి.. అనంతరం పది నిమిషాల పాటు శవపేటికలో పడుకున్నారు. 

ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న ఓ వ్యక్తి మాట్లాడుతూ.. ‘చావుపై ఎప్పుడైతే మనకు అవగాహన వస్తుందో.. చావు తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో బతికి ఉండగానే మనకు బోధపడతాయో అప్పుడు జీవితాన్ని చూసే విధానంలో మార్పు వస్తుంది. సరికొత్త పంథాలో ముందుకు సాగేందుకు ఇది దోహదపడుతుంది అని పేర్కొన్నాడు. మరో టీనేజర్‌ తన అనుభవం గురించి వివరిస్తూ... ‘శవ పేటికను చూడగానే ముందు భయం వేసింది. ఆ తర్వాత ఆశ్చర్యంగా అనిపించింది. ఇంతకు ముందు ఎవరిని చూసినా నాకు పోటీదార్లే అంటూ ఒత్తిడికి గురయ్యేవాడిని. అందుకే చచ్చిపోవాలనిపించేది. కానీ ఇప్పుడు నా ఆలోచన మారింది. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత సొంతంగా వ్యాపారం ప్రారంభిస్తా’ అని చెప్పుకొచ్చాడు.

ఇక ఈ కార్యక్రమ నిర్వాహకుడు జోయింగ్‌ మాట్లాడుతూ... ‘ఆత్మహత్య చేసుకోవాలని ఉందని చెప్పిన ఎంతో మంది నిర్ణయాన్ని నేను మార్చగలిగాను. మేము 2012నుంచి ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. అప్పటి నుంచి నేటిదాకా దాదాపు 25 వేల మంది ఇందులో పాల్గొన్నారు. సామూహిక అంత్యక్రియల కార్యక్రమానికి ఏడ్చేవాళ్లను కూడా పిలవాలనుకున్నాం. కానీ ఈసారి కుదరలేదు. శవపేటికలో ఉన్నపుడు మన కోసం ఏడ్చేవారి స్వరం విన్నపుడు బలవన్మరణానికి పాల్పడి వారిని ఎంత వేదనకు గురిచేశామో అన్న విషయం అర్థమవుతుంది’ అని పేర్కొన్నాడు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top