‘ప్రమాదంలో ఉన్నాం.. కచ్చితంగా చంపేస్తారు’

Saudi Sisters Request For Help After Fleeing To Georgia - Sakshi

‘మేము ప్రమాదంలో ఉన్నాము. దయచేసి మాకు సహాయం చేయండి. ఇప్పుడు గనుక ఇంటికి(సౌదీ అరేబియా) తిరిగి వెళ్తే కచ్చితంగా చంపేస్తారు. ఏ సురక్షిత దేశంలోనైనా సరే మాకు ఆశ్రయం కల్పించండి. మా దేశంలో ఉన్న బలహీన చట్టాల కారణంగా మాకు రక్షణ లేకుండా పోయింది. అందుకే ఇంటి నుంచి పారిపోయి వచ్చాముఅంటూ సౌదీ అరేబియాకు చెందిన అక్కాచెల్లెళ్లు సోషల్‌ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పాస్‌పోర్టులను పునరుద్ధరించి సురక్షిత ప్రాంతంలో ఆశ్రయం కల్పించాలంటూ అంతర్జాతీయ సమాజానికి మొరపెట్టుకుంటున్నారు.  

సౌదీ అరేబియాలో మహిళలను బానిసలుగా చూడటాన్ని భరించలేక.. ఆ దేశ యువతి రహాఫ్‌ ముహమ్మద్‌ అల్‌ఖునన్ కొన్నిరోజుల క్రితం థాయ్‌లాండ్‌కు పారిపోయి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సోషల్‌ మీడియాలో ఈ విషయం వైరల్‌ కావడంతో యూఎన్‌ శరణార్థి సంస్థ ఆమెకు కెనడాలో ఆశ్రయం కల్పించింది. ఈ క్రమంలో సౌదీకి చెందిన ఇద్దరు యువతులు మహా అల్‌సుబే(28), వఫా అల్‌సుబే(25)కూడా ఇదేవిధంగా ఇంటి నుంచి పారిపోయి జార్జియాకు చేరుకున్నారు. దీంతో సమాచారం అందుకున్న ఇమ్మిగ్రేషన్‌ అధికారులు వారి పాస్‌పోర్టులను రద్దు చేశారు.

చదవండి : ‘ఇప్పుడు ఇంటికి తిరిగి వెళ్తే.. కచ్చితంగా చంపేస్తారు’

ఈ నేపథ్యంలో భయాందోళనకు గురైన సదరు యువతులు సోషల్‌ మీడియా ద్వారా తమ సమస్యను అంతర్జాతీయ మీడియా దృష్టికి తీసుకువచ్చారు. ఈ విషయంపై స్పందించిన యూఎన్‌ శరణార్థి సంస్థ.. బాధితులకు రక్షణ కల్పించాల్సిందిగా జార్జియా అధికారులకు విఙ్ఞప్తి చేసింది. కాగా ఇంతవరకు తమ అధికారులను బాధితులెవరూ కలవలేదని జార్జియా హోం మంత్రిత్వ శాఖ ప్రతినిధి సోఫో డినారడిజే గురువారం తెలిపారు. ఆశ్రయం కల్పించాల్సిందిగా తమను కోరలేదని, కనీసం సహాయం కోసం కూడా అర్థించలేదని పేర్కొన్నారు.

చదవండి : అమెరికాలో సౌదీ అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య

ఇక ఆడపిల్లగా పుట్టినందుకు స్వేచ్ఛ లేదని, రాచకుటుంబ ఆంక్షల చట్రం నుంచి బయటపడి, అమెరికాలో ఆశ్రయం పొందాలనుకున్న దుబాయ్‌ యువరాణి షికా లతీఫా... అనేక నాటకీయ పరిణామాల అనంతరం కొంతకాలం క్రితం ఇంటికి చేరుకున్న విషయం తెలిసిందే. ఆమె తరహాలోనే పలు యువతులు కూడా ఇటీవలి కాలంలో సౌదీ నుంచి పారిపోయి ఇతర దేశాల్లో ఆశ్రయం పొందేందుకు ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారు. సౌదీకి తిరిగి వెళ్లాల్సి వస్తుందనే భయంతో రొటానా ఫారియా(22), ఆమె సోదరి తాలా(16) ఫారియా అనే అక్కాచెల్లెళ్లు న్యూయార్క్‌లో ఆత్మహత్య చేసుకున్నారు. ఈ నేపథ్యంలో సంప్రదాయాల పేరిట మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందనడానికి ఈ ఘటనలు ప్రత్యక్ష సాక్ష్యాలుగా నిలుస్తున్నాయంటూ హక్కుల సంఘాలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top