‘ఇప్పుడు ఇంటికి తిరిగి వెళ్తే.. కచ్చితంగా చంపేస్తారు’

Saudi Woman To Seek Asylum After Fleeing Family - Sakshi

ఆడపిల్లగా పుట్టినందుకు స్వేచ్ఛ లేదని, రాచకుటుంబ ఆంక్షల చట్రం నుంచి బయటపడి, అమెరికాలో ఆశ్రయం పొందాలనుకున్న దుబాయ్‌ యువరాణి షికా లతీఫా... అనేక నాటకీయ పరిణామాల అనంతరం ఇటీవలే ఇంటికి చేరుకున్న విషయం తెలిసిందే. సంప్రదాయాల పేరిట మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందనడానికి ఈ ఘటన ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచిందంటూ హక్కుల సంఘాలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో సౌదీకి చెందిన రహాప్‌ మహ్మద్‌ అల్‌-కునున్‌ అనే పద్దెనిమిదేళ్ల యువతి తనకు నచ్చినట్టుగా బతకాలని ఉందంటూ ఇంట్లో నుంచి పారిపోయి రావడంతో ‘ఆంక్షల’ అంశం మరోసారి చర్చనీయాంశమైంది.

ఆస్ట్రేలియాలో స్థిరపడాలని నిర్ణయించుకున్న రహాప్‌  తల్లిదండ్రులకు చెప్పకుండా ఒంటరిగా శనివారం కువైట్‌ నుంచి బయలుదేరింది. అయితే ఆమె బ్యాంకాక్‌ చేరుకోగానే ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు రహాప్‌ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఆమె రెండు రోజులపాటు బ్యాంకాక్‌ ఎయిర్‌పోర్టులోని హోటల్‌లో తలదాచుకుంది. ఈ నేపథ్యంలో రహాప్‌ వ్యవహారం థాయ్‌ ఇమ్మిగ్రేషన్‌ అధికారులు దృష్టికి రావడంతో సోమవారం ఆమెను తిరిగి కువైట్‌ పంపించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే రహాప్‌ అప్పటికే ఈ విషయం గురించి ఐక్యరాజ్యసమితి శరణార్థుల సంస్థ దృష్టికి తీసుకువెళ్లింది.

‘నేను ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాను. నన్ను చంపేస్తానంటూ నా కుటుంబ సభ్యులే బెదిరిస్తున్నారు. ఒకవేళ ఇప్పుడు గనుక నేను ఇంటికి తిరిగి వెళ్లినట్లైతే వాళ్లు కచ్చితంగా నన్ను చంపేస్తారు’ అంటూ రాయిటర్స్‌కు ఆడియో, టెక్ట్స్ మెసేజ్‌ల ద్వారా రహాప్‌ తన పరిస్థితిని వివరించింది. ఈ క్రమంలో రహాప్‌ విషయం అంతర్జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించింది. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి శరణార్థుల హై కమిషనర్‌ తరపున బ్యాంకాక్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న థాయ్‌ ప్రతినిధి సోమవారం రహాప్‌తో మాట్లాడి ఆమెకు రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు. బ్యాంకాక్‌లోనే ఓ సురక్షిత ప్రాంతంలో రహాప్‌కు ఆశ్రయం కల్పిస్తామని, ఆమెను వెనక్కి పంపించే హక్కు ఎవరికీ లేదని వ్యాఖ్యానించారు.

సౌదీలో మాది శక్తిమంతమైన కుటుంబం
‘నన్ను శారీరకంగా, మానసికంగా, మాటలతో దారుణంగా హింసించారు. కొన్ని నెలలపాటు ఇంట్లో బంధించి నరకం చూపించారు. ఇంకా చదువుకుంటానని పట్టుబడితే చంపేస్తామని బెదిరించారు. అస్సలు బయటికి వెళ్లనివ్వరు. డ్రైవింగ్‌ చేస్తానన్నా వద్దంటారు. నాకేమో జీవితాన్ని ఆనందంగా గడపాలని ఉంటుంది. అలాగే ఉన్నత చదువులు చదివి ఆదర్శప్రాయంగా నిలవాలని ఉంటుంది. అందుకే అతి కష్టం మీద ఆస్ట్రేలియా వీసా సంపాదించా. కొన్ని రోజుల థాయ్‌లాండ్‌లో ఉండి ఎవరికీ అనుమానం రాకుండా ఆస్ట్రేలియా వెళ్లిపోదాం అనుకున్నా. కానీ మా వాళ్లకు ఇదంతా ఇష్టం ఉండదు. సౌదీలో మాది ఓ పవర్‌ఫుల్‌ ఫ్యామిలీ. అందుకే ఇప్పుడు నన్ను ఆపేయాలని ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారంటూ రాయిటర్స్‌తో తన పరిస్థితి గురించి రహాప్‌ వివరించింది. తనను తాను హోటల్‌లో బంధించుకుని, ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో వందలాది మంది నెటిజన్లు ఆమెకు మద్దతుగా నిలిచారు. (‘వాళ్ల అమ్మ రమ్మంటేనే వెళ్లాను.. తను చాలా మంచిది’)

అదంతా అబద్ధం..
రహాప్‌ చెప్పినట్లుగా ఆమె వద్ద ఆస్ట్రేలియా వీసా లేదని థాయ్‌ ఇమ్మిగ్రేషన్‌ ముఖ్య అధికారి తెలిపారు. రహాప్‌ ఇంట్లో నుంచి పారిపోయి వచ్చిందని ఆమె భద్రత గురించి తల్లిదండ్రులు ఆందోళన చెందడంతో సౌదీ ఇమ్మిగ్రేషన్‌ పోలీసులు తమని సంప్రదించారని పేర్కొన్నారు. తన డాక్యుమెంట్లన్నీ పరిశీలించాం. ‘పాస్‌పోర్టు తప్ప రిటర్న్‌ టికెట్‌ గానీ, ఇతర ట్రావెల్‌ ప్లాన్‌గానీ ఏమీ లేదు. ఏ హోటల్‌లోనూ బస చేసేందుకు కూడా తను రిజర్వేషన్‌ చేయించుకోలేదు. అందుకే నిబంధనలను అనుసరించే తనని వెనక్కి పంపాలని నిర్ణయించుకున్నాం’ అని వెల్లడించారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top