
థాయిలాండ్ ప్రధాని పేటోంగ్టార్న్ షినవత్రాకు భారీ షాక్ తగిలింది. ఆమెను ప్రధాని పదవి నుంచి సస్పెండ్ చేస్తూ ఆ దేశ రాజ్యాంగ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. కంబోడియాతో జరిగిన డిప్లొమాటిక్ వివాదం నేపథ్యంలో.. నైతిక ప్రమాణాలు ఉల్లంఘించారన్న ఆరోపణలపై విచారణకు ఆదేశించింది. ఈ మేరకు 7-2 మెజారిటీ ధర్మాసనం తీర్పు ఇచ్చింది. ఇవాళ( జులై 2) నుంచి రాజ్యాంగ న్యాయస్థానం తీర్పు ఇచ్చేంతవరకు ఆమెను ప్రధాని విధుల సస్పెండ్ చేసినట్లు పేర్కొంది. తీర్పుపై షినవత్రా స్పందిస్తూ.. తన విధులకు అంతరాయం కలగకూడదని తాను కోరుకున్నప్పటికీ, కోర్టు ఆదేశాలను అంగీకరిస్తానంటూ చెప్పుకొచ్చారు.
థాయ్‌లాండ్ బిలియనీర్, మాజీ ప్రధాని అయిన తక్సిన్ షినవత్రా కుమార్తె ప్రస్తుత థాయ్ ప్రధాని పేటోంగ్టార్న్ షినవత్రా గతేడాది ఆగస్టులో ఆమె ఆ పదవిని చేపట్టారు. 37 ఏళ్లకే ప్రధాని పీఠాన్ని అధిష్టించిన ఆమె.. ఆ దేశ చరిత్రలోనే అతి పిన్న ప్రధానిగా, రెండో మహిళా ప్రధానిగా చరిత్ర సృష్టించారు. అంతేకాదు.. అందం, ఫ్యాషన్స్‌లోనూ స్టైల్ ఐకాన్‌గా, బ్యూటిఫుల్ పీఎంగా నెట్టింట విశేష ఆదరణ సొంతం చేసుకున్నారు.
థాయ్‌లాండ్‌కు పొరుగున ఉన్న కంబోడియా మాజీ ప్రధాని హున్ సేన్‌కి థాయ్ ప్రధాని షినవత్రా ఫోన్ చేశారు. ‘‘అంకుల్’’ అంటూ ఆయనను సంబోధించిన ఆమె.. తన దేశంలోని పరిస్థితులను వివరించారు. ఈ సందర్భంగా సరిహద్దులో థాయ్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ బూన్‌సిన్‌ను ఉద్దేశించి తనకు వ్యతిరేకంగా ఉన్నట్లు ఆమె ఆయనతో చెప్పారు పేర్కొన్నారు. అయితే, జూన్ 15వ తేదీన జరిగిన ఈ ఫోన్‌కాల్ సంభాషణ తాజాగా బయటకు వచ్చింది.
సాధారణంగానే కంబోడియా-థాయ్‌లాండ్‌ల మధ్య సంబంధాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. పైగా సరిహద్దు వివాదాల కారణంగా ఈ మధ్యకాలంలో(మే 28వ తేదీ నుంచి) అవి మరింతగా దెబ్బతిన్నాయి. అయితే.. 2023లో హున్ సేన్ ప్రధాని పదవి నుంచి దిగిపోగా.. ఆయన కుమారుడు హున్ మానెట్ అధికార పగ్గాలు చేపట్టారు. పదవిలో లేకపోయినా కంబోడియా రాజకీయాలను ప్రభావితం చేయగల వ్యక్తి హున్‌సేన్. అలాంటి వ్యక్తితో షినవత్రా ఫోన్‌లో మాట్లాడడం.. పైగా దేశ భద్రతకు సంధించిన విషయాలను ప్రత్యర్థితో పంచుకున్న తీరు కూడా వివాదాస్పదమైంది.