
సార్క్ సమావేశాలు వాయిదా
వచ్చే నెలలో జరగాల్సిన సార్క్ సమావేశాల్ని భారత్, బంగ్లాదేశ్, భూటాన్, అఫ్గానిస్తాన్, శ్రీలంకలు బహిష్కరించడంతో... విధిలేని పరిస్థితుల్లో సదస్సును పాకిస్తాన్ వాయిదావేసింది.
- త్వరలో కొత్త తేదీలు ప్రకటిస్తామన్న పాకిస్తాన్
- భారత్ బాటలో సార్‌కకు దూరంగా శ్రీలంక
ఇస్లామాబాద్: వచ్చే నెలలో జరగాల్సిన సార్క్ సమావేశాల్ని భారత్, బంగ్లాదేశ్, భూటాన్, అఫ్గానిస్తాన్, శ్రీలంకలు బహిష్కరించడంతో... విధిలేని పరిస్థితుల్లో సదస్సును పాకిస్తాన్ వాయిదావేసింది. ఈ మేరకు పాకిస్తాన్ విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. నవంబర్ 9, 10 తేదీల్లో ఇస్లామాబాద్‌లో 19వ సార్క్ సమావేశాలు జరగాల్సి ఉండగా... ఉడీ దాడి నేపథ్యంలో భారత్ సమావేశాల్ని బహిష్కరించింది. సమావేశాలు జరిగేందుకు అనువైన వాతావరణాన్ని పాక్ పాడుచేసిదంటూ బంగ్లాదేశ్, భూటాన్, అఫ్గానిస్తాన్‌లు భారత్‌కు మద్దతుగా నిలిచాయి. సమావేశాలకు తాము హాజరుకావడం లేదంటూ శ్రీలంక కూడా శుక్రవారం పకటించింది.
సదస్సుకు హాజరుకాకుండా సార్క్ సంప్రదాయాన్ని అతిక్రమించేలా భారత్ వ్యవహరిస్తోందంటూ పాకిస్తాన్ విదేశాంగ శాఖ ప్రకటనలో తప్పుపట్టింది. ప్రస్తుతం సార్క్ చైర్మన్‌గా ఉన్న నేపాల్ ద్వారా త్వరలో కొత్త తేదీల్ని ప్రకటిస్తామని పాకిస్తాన్ విదేశాంగ శాఖ కార్యాల యం పేర్కొంది. వాయిదా విషయాన్ని నేపాల్ ప్రధానికి తెలిపామని ఆ దేశం వెల్లడించింది. మరోవైపు సార్క్‌పై కఠ్మాండులో నిర్వహించిన ప్రాంతీయ సదస్సు శుక్రవారం ముగిసింది. ముందుగా నిర్దేశించిన తేదీల్లోనే సార్క్ సమావేశాలు నిర్వహించాలని సదస్సులో పలువురు కోరారు.
సర్జికల్ స్ట్రైక్స్ ఓ డ్రామా: పాక్ మీడియా
ఇస్లామాబాద్: భారత సైన్యం నిర్వహించిన ‘సర్జికల్ స్ట్రైక్స్’ను పాక్ స్థానిక మీడియా డ్రామాగా పేర్కొంది. ఉడీ ఘటన నేపథ్యంలో దేశ ప్రజలను తృప్తి పరిచేందుకే భారత ప్రభుత్వం ఈ సర్జికల్ స్టైక్స్ పేరుతో దాడిని నిర్వహించిందని తెలిపింది. ఈ మేరకు పాక్ ప్రధాన పత్రికలు మొదటి పేజీలో ఎల్‌వోసీలో జరిగిన కాల్పుల వార్తలను ప్రచురించాయి.