పాక్, రష్యాల్లో కరోనా విజృంభణ

Russia And Pakistan virus cases spike as others ease controls - Sakshi

మాస్కో/ఇస్లామాబాద్‌/వాషింగ్టన్‌/బీజింగ్‌: కరోనాతో అతలాకుతలమైన ప్రపంచ దేశాల్లో నెమ్మదిగా సాధారణ పరిస్థితులు నెలకొని మార్కెట్లు తెరుచుకుంటూ ఉంటే రష్యా, పాకిస్తాన్‌లలో వైరస్‌ విజృంభిస్తోంది. ఈ రెండు దేశాల్లో ఒకేరోజు అత్యధిక కేసులు నమోదయ్యాయి. రష్యాలో ఒకే రోజు శుక్రవారం 7,933  కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య లక్షా 24 వేలు దాటింది. మాస్కోలో అధిక కేసులు నమోదవుతున్నాయి. పాకిస్తాన్‌లో శనివారం అత్యధికంగా 1,952 కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 19వేలకు చేరువలో ఉందని అధికారులు చెప్పారు. 24 గంటల్లో 32 మంది మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 417కి చేరుకుంది. రంజాన్‌ మాసంలో ఇఫ్తార్‌ విందులు జరుపుకుంటూ ఉండడం వల్లే కరోనా కేసులు ఎక్కువైపోయాయని విమర్శలు వస్తున్నాయి.  

అమెరికాలో రోగులకు భారత్‌ మందులు
అమెరికాలో వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న కోవిడ్‌ రోగులకు భారత్‌ పంపించిన యాంటీ మలేరియా ఔషధం హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ (హెచ్‌సీక్యూ)ను ఇస్తున్నట్టుగా మెడికల్‌ పబ్లికేషన్‌ ఎండెడ్జ్‌ వెల్లడించింది. అమెరికాలో కరోనా హాట్‌స్పాట్‌లలో ఒకటైన కనెక్టికట్‌లో క్లోరోక్విన్‌ ఔషధాన్ని ఎక్కువగా వాడుతున్నారు. కరోనాపై పోరాటంలో క్లోరోక్విన్‌ గేమ్‌ ఛేంజర్‌గా మారుతుందని గతంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వ్యాఖ్యానించారు. అమెరికాలో మరణాలు లక్షలోపు ఉండవచ్చునని ట్రంప్‌ అంచనా వేశారు.  


కెనడాకు చెందిన డేల్‌ జాన్‌స్టన్, అమెరికాకు చెందిన డయాన్‌ సుమి మూడున్నరేళ్లుగా డేటింగ్‌ చేస్తున్నారు. కరోనా వ్యాప్తితో రెండు దేశాల సరిహద్దులను మూసివేయడంతో వీరిద్దరూ సరిహద్దుల్లోని లాంగ్లే ప్రాంతం వద్ద కూర్చుని కబుర్లతో కాలక్షేపం చేస్తున్నారు. 

రెమిడెస్‌విర్‌కు ఎఫ్‌డీఏ అనుమతి
వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌లను నియంత్రించడానికి వాడే రెమిడెస్‌విర్‌ ఔషధాన్ని అత్యవసర సమయాల్లో కోవిడ్‌ రోగులకు ఇవ్వడానికి అమెరికా ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్‌డీఏ) అనుమతి ఇచ్చింది. కరోనా వైరస్‌ను కూడా నియంత్రించడానికి ఈ మందు ఉపయోగపడుతుందని ఇప్పటికే పలు పరిశోధనల్లో తేలింది.  

చైనాకు డబ్ల్యూహెచ్‌ఓ ప్రశంసలు
కోవిడ్‌ను ఎదుర్కోవడంలో చైనా ప్రదర్శించిన పోరాట పటిమను చూసి ఇతర దేశాలు నేర్చుకోవాలని ట్రంప్‌ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) అంటోంది. వూహాన్‌లో బట్టబయలైన ఈ వైరస్‌ను సమర్థంగా ఎదుర్కోవడమే కాకుండా తిరిగి సాధారణ జనజీవనాన్ని పునరుద్ధరించడం చాలా గొప్ప విషయమని డబ్ల్యూహెచ్‌ఓ నిర్వహించే ఆరోగ్య అత్యవసర కార్యక్రమాలకు టెక్నికల్‌ హెడ్‌ మారియా కేర్‌ఖోవ్‌ ప్రశంసించారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top