అలలపై అణు విద్యుత్‌

Rosatom floating nuclear power unit arrives in Chukotka, Russia - Sakshi

ప్రపంచంలోనే తొలి తేలియాడే అణువిద్యుత్‌ కేంద్రం

అభివృద్ధి చేసిన రష్యా

తూర్పుతీరంలోని చుకోట్కా ప్రాంతంలో సేవలు  

మాస్కో: రష్యా మరో కీలక ప్రాజెక్టును చేపట్టేందుకు సిద్ధమైంది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారి నీటిలో తేలియాడే అణు విద్యుత్‌ కేంద్రాన్ని రష్యా అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. రష్యా ప్రభుత్వ అణుశక్తి సంస్థ రోసాటమ్‌ రూపొందించిన ఈ అణు కేంద్రానికి ‘ది అకడెమిక్‌ లొమొనోసొవ్‌’గా నామకరణం చేశారు. దీన్ని రష్యాలోని మారుమూల ప్రాంతాల్లో విద్యుత్‌ సౌకర్యం అందించేందుకు అభివృద్ధి చేశారు. తాజాగా ‘ది అకడెమిక్‌ లొమొనోసొవ్‌’ తన గమ్యస్థలాన్ని చేరుకుంది.

ఆర్కిటిక్‌ మహాసముద్రంలో 5,000 కి.మీ ప్రయాణించి రష్యాలోని చుకోట్కాలో పీవెక్‌ అనే ప్రాంతానికి చేరుకుంది. ఈ అణు విద్యుత్‌ కేంద్రం బరువు 21 టన్నులు కాగా, ఎత్తు 470 అడుగులు ఉంటుంది. ఇందులోని 35 మెగావాట్ల సామర్థ్యమున్న రెండు అణురియాక్టర్లు ఉన్నాయి. ఈ రియాక్టర్‌ ద్వారా చుకోట్కాలోని లక్ష మందికిపైగా ప్రజలకు విద్యుత్‌ సరఫరా చేయొచ్చు. ఈ ఏడాది చివరికల్లా ‘ది అకడెమిక్‌ లొమొనోసొవ్‌’ అందుబాటులోకి రానుంది. ఇది ఓసారి పనిచేయడం ప్రారంభిస్తే 3 నుంచి ఐదేళ్ల వరకూ ఇంధనాన్ని మార్చాల్సిన అవసరముండదు.  

మిశ్రమ స్పందన..
ఈ తేలియాడే అణు కేంద్రంపై రష్యాలోని గ్రీన్‌ పీస్‌ అనే పర్యావరణ సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇలాంటి అణు విద్యుత్‌ కేంద్రాలను తరలిస్తున్నప్పుడు ఏదైనా విపత్తు సంభవిస్తే  తీవ్రమైన పరిణామాలు ఉంటాయని ఆందోళన వ్యక్తం చేస్తోంది. చుకోట్కా వంటి మంచు ప్రాంతాల్లో ఒకవేళ అణు విపత్తు సంభవిస్తే పర్యావరణంపై పడే దుష్ప్రభావం ఊహకు కూడా అందదని హెచ్చరించింది. దీన్ని ఓ ‘అణు టైటానిక్‌’గా సదరు సంస్థ అభివర్ణించింది.

అయితే రోసాటమ్, ప్రభుత్వ అనుకూలవర్గాలు మాత్రం ఇందులోని సానుకూలతలు కూడా చూడాలని చెబుతున్నాయి. ఎందుకంటే మారుమూల చుకోట్కా ప్రాంతంలో ఈ అణు కేంద్రం ఏర్పాటుతో థర్మల్‌ ప్లాంట్, మరో అణుకేంద్రం మూతపడతాయని రోసాటమ్‌ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. తద్వారా పర్యావరణంలోకి విడుదలవుతున్న కాలుష్యం భారీఎత్తున తగ్గుతుందని వెల్లడించారు. అణు ఇంధనంతో నడిచే సబ్‌మెరైన్ల వల్ల ఎలాంటి ముప్పు ఉండదనీ, తమ అణు విద్యుత్‌ కేంద్రం కూడా అంతే సురక్షితమని వ్యాఖ్యానించారు. ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా తట్టుకునేలా ఇందులో భద్రతను ఏర్పాటుచేశామని పేర్కొన్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top