కాల్పులతో దద్దరిల్లిన అమెరికా

Recap of American Gun Culture massacre - Sakshi

కాలిఫోర్నియా : అమెరికా మరోసారి తుపాకీ కాల్పులతో దద్దరిల్లింది. కాలిఫోర్నియాలోని తౌజండ్‌ ఓక్స్‌ బార్‌లోని డాన్స్‌హాల్‌లో 29 ఏళ్ల వ్యక్తి  జరిపిన కాల్పుల్లో 13 మంది (ఓ పోలీస్‌ అధికారితో సహా) మరణించారు. ఈ ఘటనతో అమెరికాలో గన్‌కల్చర్‌ మరోసారి చర్చనీయాంశమైంది. ఆత్మరక్షణ పేరిట తుపాకుల వినియోగానికి అక్కడి ప్రభుత్వం అనుమతించడంపై విమర్శలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాలో తుపాకులతో జరిపిన హింసాకాండ ఘటనలు కొన్ని...

ఆధునిక అమెరికా చరిత్రలో అత్యంత పాశవికంగా జరిగిన తుపాకీ కాల్పుల్లో పెద్ద సంఖ్యలో పౌరులు మరణించిన ఘటనలు...
2017 అక్టోబర్‌ 1న నెవడా రాష్ట్రంలో లాస్‌వేగాస్‌లోని మాండలే బే రిసార్ట్, కాసినోలో జరుగుతున్న సంగీతోత్సవ వీక్షకులపై 64 ఏళ్ల స్టీఫెన్‌ పాడాక్‌ జరిపిన కాల్పుల్లో అత్యధికంగా 58 మంది మృతి చెందారు. 500 మంది వరకు గాయపడ్డారు
2016 జూన్‌ 12న ఒర్లాండోలోని పల్స్‌ గే నైట్‌క్లబ్‌లో 29 ఏళ్ల సాదిక్‌ మతీన్‌ జరిపిన కాల్పుల్లో 49 మంది చనిపోయారు. 50 మందికి గాయాలయ్యాయి.
2007 ఏప్రిల్‌ 16న వర్జీనియాలోని వర్జీనియాటెక్‌ యూనివర్సిటీలో 23 ఏళ్ల విద్యార్ధి సీఉంగ్‌ హ్యుచో రెండుచోట్ల వరస కాల్పులకు తెగబడగా 32 మంది మరణించారు
2012 డిసెంబర్‌ 14న కనెక్టికట్‌లోని న్యూటౌన్‌లో 20 ఏళ్ల అడం లాంజా జరిపిన కాల్పుల్లో 27 మంది మృత్యువాతపడ్డారు. వారిలో ఆరేడేళ్ల వయసున్న పిల్లలు 20 మంది, ఏడుగురు పెద్దవారున్నారు
2017 నవంబర్‌ 5న టెక్సాస్‌లోని  సదర్‌లాండ్‌ స్ప్రింగ్స్‌లోని చిన్న చర్చిలో ప్రార్థన చేస్తున్న వారిపై  డెవిన్‌ ప్యాట్రిక్‌ కెల్లీ అనే వ్యక్తి జరిపిన కాల్పుల్లో 25 మంది హతమయ్యారు
1991 అక్టోబర్‌ 16న టెక్సాస్‌లోని కిలీన్‌లో 35 ఏళ్ల జార్జి హెన్నార్డ్‌ అనే వ్యక్తి తన ట్రక్‌తో ఓ కెఫిటేరియా గోడను ఢీకొట్టి ఆ తర్వాత తుపాకీతో 23 మందిని కాల్చి  చంపాడు. 

2018లో ఇప్పటివరకు కొన్ని వందల సంఖ్యలో కాల్పుల ఘటనలు చోటు చేసుకోగా అందులో పది మంది అంతకు పైగా హతులైన ఘటనలు కొన్ని...
తాజాగా కాలిఫోర్నియాలోని తౌజండ్‌ ఓక్స్‌లో జరిగిన ఘటనలో 13 మంది చనిపోయారు
అక్టోబర్‌ 27న పెన్సిల్వేనియా లోని పిట్స్‌బర్గ్‌లో జరిగిన కాల్పుల్లో 11 మంది మృత్యువాత
మే 18న టెక్సాస్‌లోని సాంతా ఫేలో జరిగిన కాల్పుల్లో 10మంది మరణం
ఫిబ్రవరి 14న ఫ్లోరిడాలోని పొంపనో బీచ్‌ (పార్క్‌ల్యాండ్‌)లో తుపాకి కాల్పులకు 17 మంది మృతి

గత మూడేళ్లలో...
నేషనల్‌ సేఫిటీ కౌన్సిల్, నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ హెల్త్‌ స్టాటిస్టిక్స్, తదితర సంస్ధల అంచనాల మేరకు
2017లో 346 సామూహిక కాల్పుల ఘటనలు చోటు చేసుకోగా, 437 మంది హతమయ్యారు. 1,802 మందికి గాయాలయ్యాయి
2016లో 383 కాల్పుల ఘటనల్లో 456 మంది మృతి చెందగా, 1,537 మంది గాయపడ్డారు
2015లో 333 తుపాకీ కాల్పుల సంఘటనల్లో 367 మంది మరణించారు. 1,328 మంది గాయపడిన వారిలో ఉన్నారు 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top