అప్పుడే ఉద్రిక్తతలు తొలగుతాయి: ఖతార్‌

Qatar Says De Escalation Only Solution For Iran US Crisis - Sakshi

టెహ్రాన్‌: చర్చల ద్వారానే మధ్యప్రాచ్యంలో తలెత్తిన ఉద్రిక్తతలు క్రమంగా తొలగిపోతాయని ఖతార్‌ పాలకుడు ఇమిర్‌ షేక్‌ తమీమ్‌ బిన్‌ హమాద్‌ అల్‌-థానీ అభిప్రాయపడ్డారు. ఆదివారం ఇరాన్‌ పర్యటనకు వెళ్లిన ఇమిర్‌.. ఆ దేశ అధ్యక్షుడు హసన్‌ రౌహానీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా... తమకు మద్దతుగా నిలుస్తున్న ఇరాన్‌ ప్రభుత్వానికి ఇమిర్‌ ధన్యవాదాలు తెలిపారు. అమెరికా మద్దతున్న సౌదీ అరేబియా, దాని మిత్రపక్షాలు ఖతార్‌ వాణిజ్యంపై ఆంక్షలు విధించి... రవాణా వ్యవస్థ(చమురు ఎగుమతులు)ను బాయ్‌కాట్‌ చేసినపుడు ఇరాన్‌ తమకు అండగా నిలిచిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. ఇక ప్రస్తుతం ఇరాన్‌- అమెరికా పరస్పర ప్రతీకార దాడుల నేపథ్యంలో మధ్యప్రాచ్యంలో నెలకొన్న పరిస్థితుల గురించి ఇమిర్‌ మట్లాడుతూ... ‘అత్యంత కఠిన సమయంలో నేను ఈ ప్రాంత పర్యటనకు వచ్చాను. ప్రతీ ఒక్కరితో చర్చించడం ద్వారానే ఈ సంక్షోభాన్ని రూపుమాపవచ్చనే ఒప్పందానికి వచ్చాం’ అని పేర్కొన్నారు.(ఇరాన్‌ మరో దాడి.. అమెరికా ఆగ్రహం)

ఇక ఆయన వ్యాఖ్యలపై స్పందించిన ఇరాన్‌ అధ్యక్షుడు హసన్‌ రౌహానీ..‘ ఈ ప్రాంత భద్రత మాకు అత్యంత ముఖ్యమైనది. అందుకే మేం తరచుగా భేటీ అవుతూ... పరస్పర సహకారం అందించుకునేందుకు అంగీకరించాం’ అని పేర్కొన్నారు. కాగా అధిక చమురు నిల్వలు కలిగిన ఉన్న ఖతార్‌పై 2017లో సౌదీ అరేబియా ఆంక్షలు విధించిన సమయంలో వైమానిక, భూమార్గాల ద్వారా ఖతార్‌ వ్యాపారం కొనసాగించేందుకు ఇరాన్‌ మద్దతుగా నిలిచిన విషయం తెలిసిందే. ఇక మధ్యప్రాచ్యంలోని అన్ని దేశాల కంటే ఖతార్‌లోనే ఎక్కువ అమెరికా బలగాలు ఉన్నప్పటికీ.. ఆ దేశం ఇరాన్‌తో స్నేహ బంధాలను కొనసాగించడం విశేషం. ఇక తాజాగా... ఇరాక్‌లోని అమెరికా స్థావరంపై ఇరాన్‌ మళ్లీ దాడి చేసిన విషయం విదితమే. ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌కు 80 కి.మీ.ల దూరంలోని అల్‌ బలాద్‌ వైమానిక దళ స్థావరంపై 8 ‘కాట్యూషా’ తరహా రాకెట్లను ప్రయోగించింది. ఈ ఘటనలో ఇరాక్‌ సైన్యానికి చెందిన ఇద్దరు అధికారులు, ఇద్దరు ఎయిర్‌మెన్‌ గాయపడ్డారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top