ఇరాన్‌ మరో దాడి.. అమెరికా ఆగ్రహం! | Sakshi
Sakshi News home page

త్వరగా కోలుకోవాలి.. దుష్ట చర్యలను అడ్డుకుంటాం!

Published Mon, Jan 13 2020 10:40 AM

Mike Pompeo Says Outraged After Another Rocket Hits US Airbase In Iraq - Sakshi

వాషింగ్టన్‌: అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇరాన్‌ మరోసారి ఇరాక్‌పై రాకెట్లు ప్రయోగించడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో పేర్కొన్నారు. ఈ ఘటన తమను షాక్‌కు గురిచేసిందన్నారు. తరచుగా జరుగుతున్న ఈ దాడులు ఇరాక్‌ సార్వభౌమత్వాన్ని ప్రశ్నార్థకం చేస్తున్నాయని మండిపడ్డారు. బాధ్యులైన వారిని గుర్తించి ఇరాక్‌ ప్రభుత్వం వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని... ప్రజలకు జవాబుదారీగా ఉండాలని పేర్కొన్నారు. రాకెట్‌ దాడిలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ మేరకు మైక్‌ పాంపియో ట్వీట్‌ చేశారు.

అదే విధంగా ఇరాక్‌లో ఉన్న ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రమూకలను అంతమొందించేందుకు అమెరికా, ఐరోపా దేశాలు నిర్విరామంగా కృషి చేస్తాయన్నారు. ఈ మేరకు ఫ్రాన్స్‌ మంత్రితో తాను చర్చలు జరిపానని, ఇరాన్‌ దుష్ట చర్యలను అడ్డుకునేందుకు ఉమ్మడిగా ముందుకు సాగనున్నట్లు పేర్కొన్నారు. అంతేగాకుండా మధ్య ప్రాచ్యంలో పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు టర్కీ విదేశాంగ మంత్రితో కూడా చర్చలు జరిపినట్లు మైక్‌ పాంపియో వెల్లడించారు.(ఇరాన్‌కు ట్రంప్‌ మరో హెచ్చరిక)

కాగా ఇరాన్‌ మద్దతున్న హిజ్బుల్‌ బ్రిగేడ్‌ తీవ్రవాద సంస్థ మద్దతుదారులు.. ఇరాక్‌లోని బాగ్దాద్‌లో ఉన్న అమెరికా రాయబార కార్యాలయంపై చేసిన విషయం విదితమే. ఇందుకు ప్రతీకారంగా అమెరికా.. ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌లో రాకెట్‌ దాడికి పాల్పడి.. ఇరాన్‌ జనరల్‌ సులేమానిని హతమార్చింది. ఈ నేపథ్యంలో ఇరాన్‌.. ఇరాక్‌లో ఉన్న అమెరికా వైమానిక స్థావరాలపై డజనుకు పైగా క్షిపణులతో విరుచుకుపడింది. ఇందులో భాగంగా ఉక్రెయిన్‌ విమానాన్ని పొరబాటున కూల్చివేసినట్లు ఇరాన్‌ అంగీకరించింది. ఈ ఘటనలో మృతి చెందిన 173 మంది కుటుంబాలకు, వారి దేశాలను క్షమాపణ కోరింది. అయితే తాజాగా... ఇరాక్‌లోని అమెరికా స్థావరంపై ఇరాన్‌ మళ్లీ దాడి చేసింది. బాగ్దాద్‌కు 80 కి.మీ.ల దూరంలోని అల్‌ బలాద్‌ వైమానిక దళ స్థావరంపై ఆదివారం 8 ‘కాట్యూషా’ తరహా రాకెట్లను ప్రయోగించింది. (అవును.. మేమే కూల్చేశాం: ఇరాన్‌)

ఈ దాడిలో ఇరాక్‌ సైన్యానికి చెందిన ఇద్దరు అధికారులు, ఇద్దరు ఎయిర్‌మెన్‌ గాయపడ్డారు. స్థావరం లోపల రన్‌వే పై మోర్టారు బాంబులు పడ్డాయని ఇరాక్‌ సైన్యం ప్రకటించింది. అల్‌ బలాద్‌ ఇరాక్‌ ఎఫ్‌ 16 యుద్ధ విమానాల ప్రధాన కేంద్రం. ఇక్కడ అమెరికా వైమానిక దళానికి చెందిన చిన్న బృందం, కొందరు అమెరికా కాంట్రాక్టర్లు ఉన్నారు. ఇరాన్‌-అమెరికాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో.. అల్‌ బలాద్‌ స్థావరం నుంచి అమెరికా వైమానిక దళ సభ్యులు, ఇతర సాంకేతిక సహాయ బృందాల వారిలో చాలామంది ఇప్పటికే వెళ్లిపోయారు. 15 మంది అమెరికా సైనికులు, ఒక చిన్న విమానమే ఈ స్థావరంలో ఉంది. కాగా, గత బుధవారం తాము జరిపిన క్షిపణి దాడుల లక్ష్యం అమెరికా సైనికులను చంపడం కాదని ఇరాన్‌ రెవల్యూషనరీ గార్డ్స్‌ తెలిపింది. ‘నాటి దాడుల్లో మా లక్ష్యం నిజానికి శత్రు సైనికులను హతమార్చడం కాదు. అదంత ముఖ్యం కూడా కాదు’అని రెవల్యూషనరీ గార్డ్స్‌ కమాండర్‌ హుస్సేన్‌ సలామీ ఇరాన్‌ పార్లమెంట్‌కు వివరించారు. 


 

Advertisement
 
Advertisement
 
Advertisement