సీఐఏకు సమచారమిచ్చాడు.. ఉరి ఖాయం: ఇరాన్‌

Iran Will Execute CIA Agent Involved In General Soleimani Assassination - Sakshi

టెహ్రాన్‌: ఇరాన్‌ ఖుడ్స్‌ ఫోర్స్‌ అధిపతి ఖాసీం సులేమాని గురించి అమెరికాకు సమాచారమిచ్చిన తమ పౌరుడిని ఉరి తీసేందుకు రంగం సిద్ధమైనట్లు ఆ దేశ న్యాయ శాఖ వెల్లడించింది. ఖాసీం జాడ గురించి అమెరికా, ఇజ్రాయిల్‌ ఇంటలిజెన్స్‌కు తెలియజేసినందుకు త్వరలోనే అతడికి మరణ శిక్ష అమలు చేయనున్నట్లు మంగళవారం తెలిపింది. ఈ మేరకు ఇరాన్‌ జ్యుడిషియరి అధికార ప్రతినిధి ఘోలంహుసేన్‌ ఇస్మాయిలీ మాట్లాడుతూ.. ‘‘సీఐఏ(అమెరికా ఇంటలిజెన్స్‌ సంస్థ) గూఢాచారి మహ్మద్‌ మౌసావి- మాజిద్‌కు మరణ శిక్ష విధించారు. అమరుడైన సులేమాని జాడ గురించి శత్రువులకు అతడు సమాచారమిచ్చాడు’’ అని వెల్లడించారు. (అమెరికాకు ఇరాన్‌ వార్నింగ్‌)

కాగా ఇరాన్‌ మద్దతున్న హిజ్బుల్‌ బ్రిగేడ్‌ తీవ్రవాద సంస్థ మద్దతుదారులు.. ఈ ఏడాది ప్రారంభంలో ఇరాక్‌లో ఉన్న అమెరికా రాయబార కార్యాలయంపై దాడి చేశారు. ఇందుకు ప్రతీకారంగా అమెరికా.. ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌లో రాకెట్‌ దాడికి పాల్పడి.. ఇరాన్‌ జనరల్‌ సులేమానిని హతమార్చింది. దీంతో అమెరికాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన.. ఇరాన్‌.. ఇరాక్‌లో ఉన్న అమెరికా వైమానిక స్థావరాలపై డజనుకు పైగా క్షిపణులతో విరుచుకుపడింది. అప్పటి నుంచి ఇరు దేశాల నేతలు పరస్పరం మాటల యుద్ధానికి దిగుతున్నారు.(ఇరాన్‌ను కుదిపేస్తున్న పరువు హత్య)

ఇక తాజాగా తమ నావికా దళంలో ఇటీవల కొత్తగా అసుర- క్లాస్‌ స్పీడ్‌బోట్స్‌, జోల్ఫాఘర్‌ కోస్టల్‌ పెట్రోలింగ్‌ బోట్లు, తారేఘ్‌ సబ్‌మెరైన్లు వచ్చి చేరిన తరుణంలో అమెరికా కవ్వింపు చర్యలకు పాల్పడితే సహించే ప్రసక్తే లేదని ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్స్‌ హెచ్చరికలు జారీ చేసింది. సముద్రంలో తమ ఓడలకు అడ్డుతగిలితే ఇరాన్‌ నౌకలను ధ్వంసం చేయాలని ఆదేశాలిచ్చినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వెల్లడించిన నేపథ్యంలో.. ఇరాన్‌ ఈ మేరకు కౌంటర్‌ ఇచ్చింది. కాగా ఇరాన్‌- అమెరికా మధ్య దశాబ్దాల కాలంగా వైరం కొనసాగుతున్న విషయం తెలిసిందే.(విమానం పంపండి: ఇరాన్‌కు అమెరికా విజ్ఞప్తి!)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top