నేనే రాజు.. నేనే మంత్రి! | Sakshi
Sakshi News home page

Published Sun, Jul 15 2018 2:36 AM

The Principality Of WY A Claimed Micronation In Australia - Sakshi

మోస్‌మన్‌/ఆస్ట్రేలియా: ఈ ఫొటోలో ఉన్న ఆయన పేరు పాల్‌ డెల్‌ప్రాట్‌. వయసు 76 సంవత్సరాలు. వృత్తి రీత్యా రచయిత, చిత్రకారుడు.. చూడటానికి అచ్చు రాజులా కనిపిస్తున్నాడు..! ఏ దేశానికి రాజు అని ఆలోచిస్తున్నారా.. ఆయన ఆస్ట్రేలియాలోని మోస్‌మన్‌ అనే మున్సిపాలిటీకి చెందిన సామాన్య పౌరుడు. అయితే ఇటీవలే ‘ది ప్రిన్సిపాలిటీ ఆఫ్‌ వై’ అనే రాజ్యాన్ని నెలకొల్పి తనకు తాను రాజుగా ప్రకటించుకున్నారు. ఎందుకంటే మున్సిపాలిటీ అధికారులపై కోపంతో సొంతరాజ్యాన్నే ఏర్పరుచుకున్నారు. ఇంతకీ ఏమైందంటే.. 1993లో తన నివాస స్థలానికి రోడ్డు వేయాల్సిందిగా అధికారులకు విన్నవించుకున్నారు. అప్పటినుంచి ఆఫీసుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు.

అయితే ఆయన ఇంటికి వెళ్లే దారిలో వాతావరణ పరంగా చాలా ముఖ్యమైన పొదలు, చెట్లు ఉన్నాయని, రోడ్డు వేయడం కుదరదని అధికారులు తేల్చేశారు. తన ఇంటికి వెళ్లేందుకు ఎలాంటి దారి లేదని, ఎలాగైనా రోడ్డు వేయాల్సిందిగా ఎంత కోరినా అధికారులు కుదరదని చెప్పారు. దీంతో ఏం చేయలేక సొంత రాజ్యం ఏర్పరచుకుని ‘ది ప్రిన్సిపాలిటీ ఆఫ్‌ వై’ అని పేరు పెట్టుకున్నారు. 2004 నవంబర్‌ 15న ఈ కొత్త రాజ్యానికి మున్సిపాలిటీ మేయర్‌ కూడా ఆమోద ముద్ర వేశారు. అయితే ఆస్ట్రేలియాలో ఇలా మినీ రాజ్యాలను ఏర్పరచుకోవడం ఇదే మొదటిసారి కాదు. అక్కడ దాదాపు 300 వరకు మినీ రాజ్యాలు.. వాటికి రాజులు కూడా ఉన్నారట. ప్రభుత్వానికి పన్నులు కట్టినన్ని రోజులు అధికారులు వీరిని ఏమీ అనరట.

Advertisement
Advertisement