
50మంది పోలీసులకు జైలు శిక్ష
సాధారణంగా ఎవరైనా తప్పుచేస్తే పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుస్తారు.
కైరో(ఈజిప్టు): సాధారణంగా ఎవరైనా తప్పుచేస్తే పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుస్తారు. కోర్టు వారికి శిక్ష విధిస్తుంది. ఈజిప్టులో మాత్రం, తప్పు చేస్తే జైలులో పెట్టాల్సిన పోలీసులే జైలుపాలయ్యారు. తమ సెలవు దినాలను తగ్గించారని నిరసనకు దిగారు. అధికారులను బండ బూతులు తిట్టారు. చివరకు కటకటాలపాలయ్యారు.
వివరాల్లోకి వెళ్తే.. నిబంధనలకు విరుద్ధంగా సమ్మెకు దిగిన 50 మంది పోలీసులకు ఈజిప్టులోని ఓ న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. సెలవు దినాల తగ్గింపుపై 50 మంది దిగువ తరగతి పోలీసు సిబ్బంది జనవరిలో సమ్మెకు దిగారు. దీంతోపాటు వీరు ఉన్నతాధికారులపై బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ అంశాలను సీరియస్‌గా తీసుకున్న దక్షిణ సినాయ్ ప్రొవిన్షియల్ కోర్టు వీరందరికీ మూడేళ్ల జైలుశిక్షతోపాటు 330 డాలర్ల చొప్పున జరిమానా కూడా విధిస్తూ తీర్పు వెలువరించారని ప్రభుత్వ అల్-అహ్రాం వెబ్‌సైట్ వెల్లడించింది.